
హుద్ హుద్ తుఫాను అధికార పార్టలోని కొందరికి భలే కలిసివచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడగానే సంభవించిన హుద్ హుద్ తుఫాను లక్షలాది మంది జనాల జీవితాల్లో కల్లోలం రేపిన సంగతి అందరికీ తెలిసిందే.
ఇసుకలో నుండి కూడా తైలం తీయగలిగిన కొందరు రాజకీయ నేతలకు మాత్రం వరప్రసాదంగా మారింది. జిల్లాలోని వేల కోట్ల రూపాయల విలువైన భూ కుంభకోణాలు అందులో నుండి వెలుగు చూస్తున్నదే.
జరిగిన కుంభకోణంలో అధికారపార్టీలోని కొందరు నేతలు కీలకపాత్ర పోషిస్తుంటే, బయటపడటంలో కూడా అధికార పార్టీ నేతలే ఉండటం ఆశ్చర్యం. అంటే ఆధిపత్య పోరాటం కారణంగానే సుమారు రూ. 20 వేల కోట్ల విలువైన కుంభకోణం బయటపడిందన్నమాట.
ఇక తుఫాను నేతలకు ఏ విధంగా వరంగ మారిందంటే, భీమిలీ, పెందుర్తి, అనకాపల్లి, యలమంచిలి, విశాఖనగరం ప్రాంతాల్లోని రెవిన్యూ రికార్డులు గల్లంతయ్యాయి. గల్లంతుచేసారనే ఆరోపణలు కూడా వినబడుతున్నాయో లేండి.
తుఫాను దెబ్బకు కూలిపోయిన వేలాది భవనాల్లో రెవిన్యూ కార్యాలయాలు కూడా ఉన్నాయి. కొట్టుకుపోయిన వేలకోట్ల విలువైన ఆస్తుల్లో కార్యాలయాల్లోని రికార్డులు కూడా ఉన్నాయట. అదే అక్రమార్కులకు కలిసి వచ్చింది. భీమిలీలో 4500 ఎకరాలు, పెందుర్తిలో 3500 ఎకరాలు, అనకాపల్లిలో 6500 ఎకరాలు, యలమంచిలిలో 4 వేల ఎకరాలు, విశాఖనగరంకు చెందిన 300 ఎకరాల రికార్డులు గల్లంతైపోయాయి. దాంతో కొందరు నేతలు, అదికారులు కుమ్మకై కుంభకోణానికి తెరలేపారు.
తుఫాను దెబ్బకు కొన్ని ప్రైవేటు భూములను వదిలిపెట్టేసి ప్రభుత్వానికి చెందిన వేలాది ఎకరాలను నేతలు చెప్పిన వారి పేరిట అధికారులు రాసిచ్చేసారు. దాంతో పలువురు ఒక్కసారిగా కోట్లరూపాయల విలువైన భూములకు ఓనర్లు అయిపోయారు. ఆనోటా ఈనోటా అదే విషయం అధికారులకు ఫిర్యాదులందాయి.
కొందరు అదికారులు రహస్యంగా కూపీ లాగారు. దాంతో విషయం అర్ధమైంది. అదే ఇపుడు కుంభకోణం రూపంలో బయటపడింది. రెవిన్యూ ఉన్నతాధికారుల ద్వారానే బయటపడినప్పటికీ నేతల మధ్య జరుగుతున్న ఆదిప్యత పోరాటాల కారణంగా కుంభకోణం పూర్తిస్ధాయిలో వెలుగు చూసింది. మరి, నిప్పు చంద్రబాబు ఈ కుంభకోణంపై ఏం చెబుతారో చూడాలి.