టీడీపిలో అంతర్గత పోరు: పరిటాల సునీతకు చుక్కెదురు

By Nagaraju TFirst Published Jan 28, 2019, 4:57 PM IST
Highlights

పరిటాల రవి హత్య అనంతరం ఆయన వారసురాలిగా ఆయన భార్య పరిటాల సునీత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. రాప్తాడు నియోజకవర్గం నుంచి గెలుపొంది ప్రస్తుతం చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే మంత్రి పరిటాల సునీతపై అనుచరులు తిరుగుబాటుకు దిగుతున్నారు. 

రాప్తాడు: నిన్ను నమ్మం బాబూ అంటూ తెలుగుదేశం పార్టీపై ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ప్రచారం చేస్తుంటే ఇక నీతో వేగలేం తల్లీ అంటూ అధికార పార్టీ మంత్రికి సొంత పార్టీ నేతలే తిరుగుబాహుటా ఎగురవేస్తున్నారు. ఇక ఆమెతో వేగలేం, అందరం కలిసివెళ్లిపోదాం అంటూ ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. 

నీతో వేగలేం తల్లీ అంటూ నేతలు పార్టీ వీడటంతోపాటు ఆమెను ఒంటరిని చేసేందుకు కార్యకర్తలు రెడీ అవుతున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే పరిటాల సునీత. దివంగత నేత పరిటాల రవి సతీమణి. రాయలసీమ రాజకీయాల్లో పరిటాల రవి ప్రస్తానం అజరామం. 

పరిటాల రవి హత్య అనంతరం ఆయన వారసురాలిగా ఆయన భార్య పరిటాల సునీత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. రాప్తాడు నియోజకవర్గం నుంచి గెలుపొంది ప్రస్తుతం చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే మంత్రి పరిటాల సునీతపై అనుచరులు తిరుగుబాటుకు దిగుతున్నారు. 

తనయుడు పరిటాల శ్రీరామ్ ని రాబోయే ఎన్నికల్లో బరిలో నుంచి దించాలని ఆమె ప్రయత్నిస్తుంటే మరోవైపు ఆమె సీటుకే ఎసరు తెచ్చేలా అనుచరులు వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు అనంతపురం రాజకీయాల్లో సంచలనంగా మారింది. 

అనంతపురంలో భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పరిటాల రవి ఉద్యమబాట పట్టారు. నిరుపేదలకు న్యాయం చెయ్యాలన్న ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారని అనుచరులు చెప్తుంటారు. ఆ సమయంలో పరిటాల రవికి బడుగు బలహీన వర్గాల ప్రజలు బ్రహ్మరథం పట్టారని చెప్తుంటారు. 

అలా కొందరు ఇప్పటికీ పరిటాల రవి అనుచరులమని గొప్పగా చెప్పుకుంటారు. పరిటాల రవి, ఆయన మరణానంతరం ఆయన భార్య పరిటాల సునీత వెంటన నడుస్తున్నారు. అయితే పరిటాల సునీత వ్యవహారశైలిపై అనుచరులు పెదవి విరుస్తున్నారు. పరిటాల రవి అంతంటి పోరాటపటిమ కానీ సేవా దృక్పథం సునీతలో లేవని విమర్శిస్తున్నారు. 

రాప్తాడు నియోజకవర్గంలో కుటుంబ పాలన సాగిస్తున్నారంటూ విరుచుచుకుపడుతున్నారు. ఆమె పరిటాల సునీత కాదు ధర్మవరపు సునీత అంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు. పరిటాల రవి ముఖ్య అనుచరులలో వేపకుంట రాజన్న ఒకరు. పరిటాల వెన్నంటి ఉండే ఈయన ఆయన మరణానంతరం సునీత వెంట నడిచారు. 

తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా సునీత వైఖరితో పాటు చంద్రబాబు ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో పేదలకు న్యాయం జరగడం లేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పటి వరకు నియోజకవర్గానికి మంత్రిగా సునీత చేసిందేమీ లేదని రాజన్నతోపాటు పలువురు పరిటాల అనుచరులు వాపోతున్నారు.  

ఈ నేపథ్యంలో అసంతృప్తులతో కలిసి తల్లిమడుగుల గ్రామంలో సమావేశం నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వంలో తమతో పాటు పేదలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు.
నాడు నిరుపేదలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో పరిటాల రవితో కలసి భూస్వామ్య పోరాటాలు చేశామని రాజన్న గుర్తు చేశారు. 

రవి మరణించిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన అతని భార్య సునీత తమ ఆశయాలను పక్కన పెట్టి కుటుంబ రాజకీయాలకు తెరలేపారని ఆరోపించారు. సునీత పాలనలో వారి కుటుంబ సభ్యులకు తప్ప ఈ ప్రాంతంలోని బడుగు, బలహీన వర్గాల్లోని పేదలకు న్యాయం జరగడం లేదని విమర్శించారు. 

సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలను సాధించడంలో విఫలమయ్యారని సమావేశంలో ఆరోపించారు. ఇక ఆమెతో వేగలేం అందరమూ కలిసి వెళ్లిపోదాం అంటూ పిలుపునిచ్చారు.  పేదల పక్షాన పనిచేసే నాయకులు, పార్టీలకు మద్దతు ఇవ్వాలని సూచించారు. పేదలకు అండగా నిలిచిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పక్షాన నిలిచేందుకు వైసీపీలో చేరుదామంటూ సూచించారు. 

వేపకుంట రాజన్న సూచనలకు అసంతృప్తులు జై కొట్టారు. పరిటాల శ్రీరామ్ ని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలని అసెంబ్లీ లేదా  పార్లమెంట్ నుంచి పోటీ చెయ్యించాలని మంత్రి పరిటాల సునీత ప్రయత్నాలు చేస్తుంటే ఇలా కుంపటి చెలరేగడంతో ఆమె ఆందోళనకు గురవుతున్నారట. తానొకటి తలస్తే దైవం మరొకటి తలచిందన్నట్లు అసలుకే ఎసరు వచ్చేలా ఉందని భావించిన ఆమె దిద్దుబాటు చర్యలకు ప్రయత్నాలు చేస్తున్నారట. 

ఈ వార్తలు కూడా చదవండి

శ్రీరామ్ ఎంట్రీ పక్కా: అనంత టీడీపీలో నిమ్మల కిష్టప్ప చిచ్చు

పరిటాల శ్రీరామ్ ఎంట్రీ: కొడుకు కోసం నిమ్మల కిష్టప్ప సైతం

 

click me!