ఏపీ గవర్నర్ అబ్ధుల్ నజీర్‌ను బుధవారం టీడీపీ నేతల బృందం కలిసింది . 50 పేజీల నివేదికను గవర్నర్‌కు సమర్పించామని.. ప్రజావేదిక కూల్చివేత సహా ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను వివరించామని అచ్చెన్నాయుడు తెలిపారు.
ఏపీ గవర్నర్ అబ్ధుల్ నజీర్‌ను బుధవారం టీడీపీ నేతల బృందం కలిసింది. ఈ సందర్భంగా చంద్రబాబు అరెస్ట్, తదితర పరిణామాలను వారు గవర్నర్‌కు వివరించారు. అనంతరం ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. చంద్రబాబుపై అక్రమ కేసులు, వైసీపీ ప్రభుత్వ తీరును గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. 50 పేజీల నివేదికను గవర్నర్‌కు సమర్పించామని.. ప్రజావేదిక కూల్చివేత సహా ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను వివరించామని అచ్చెన్నాయుడు తెలిపారు. ఎటువంటి ఆధారాలు లేకుండా కేసులు పెడుతున్నారని తాము గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన చెప్పారు.
ముందు అరెస్ట్ చేసి.. ఆ తర్వాత ఆధారాలు సేకరిస్తామని సీఐడీ చేస్తున్న వాదనలను నజీర్‌కు వివరించామని తెలిపారు స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం, ఐఆర్ఆర్, ఫైబర్ నెట్ స్కాంలో ఎలాంటి తప్పిదాలు జరగలేదని గవర్నర్‌కు తెలియజేశామని అచ్చెన్నాయుడు చెప్పారు. తమ వివరణపై గవర్నర్ సానుకూలంగా స్పందించారని.. వ్యవహారం కోర్టు పరిధిలో వున్నందున దీనిపై ఎక్కువగా మాట్లాడనని గవర్నర్ తమతో చెప్పారని అచ్చెన్నాయుడు వెల్లడించారు.
ఇకపోతే.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మోత మోగిద్దాం, క్రాంతితో కాంతి, న్యాయానికి సంకెళ్లు వంటి వినూత్న నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. పార్టీ నేతలతో పాటు చంద్రబాబు కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘‘నిజం గెలవాలి’’ పేరుతో ఆమె ప్రజా క్షేత్రంలోకి వెళ్లనున్నారు.
వచ్చే వారం నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భువనేశ్వరి పర్యటించనున్నారు. చంద్రబాబు అరెస్ట్ , తదితర పరిణామాలతో మనస్తాపానికి గురై మరణించిన కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. వారానికి రెండు మూడు చోట్ల భువనేశ్వరి పర్యటించనున్నారు. అలాగే చంద్రబాబు అరెస్ట్ కారణంగా నిలిచిన భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమాన్ని ఆయన తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తిరిగి ప్రారంభించనున్నారు. చంద్రబాబు విడుదలయ్యే వరకు లోకేష్ ఈ కార్యక్రమం బాధ్యతలు చూస్తారు. మరోవైపు.. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల నిర్వహణ, సమీక్షపై త్వరలోనే విస్తృత స్థాయి సమావేశం జరగనుంది.