కల్తీ సారా, జే బ్రాండ్ మద్యంపై ఆందోళనలు... విజయవాడలో టిడిపి నేతల హౌస్ అరెస్ట్ లు

Arun Kumar P   | Asianet News
Published : Mar 23, 2022, 11:52 AM ISTUpdated : Mar 23, 2022, 12:07 PM IST
కల్తీ సారా, జే బ్రాండ్ మద్యంపై ఆందోళనలు... విజయవాడలో టిడిపి నేతల హౌస్ అరెస్ట్ లు

సారాంశం

కల్తీ సారా, జె బ్రాండ్ మద్యం కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురయి మరణిస్తున్నారని ఆరోపిస్తూ టిడిపి ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టిడిపి నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ లు చేస్తున్నారు.  

విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ లో కల్తీ సారా, జే బ్రాండ్ మద్యం సేవించి ప్రజలు చనిపోతున్నారని టిడిపి ఆందోళనలు (tdp protest) చేపడుతున్న విషయం తెలిసిందే. ప్రాణాంతకమైన జే బ్రాండ్ మద్యం అమ్మకాలను ప్రభుత్వమే చేపట్టడాన్ని టిడిపి తప్పుబడుతోంది. బడ్జెట్ సమావేశాలు మొదలైన నాటినుండి టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కల్తీ మద్యంపై చర్చకు పట్టుబడుతూ నిరసన చేస్తున్నారు. ఇప్పుడు ఇతర టిడిపి  నాయకులు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు ఎక్కడికక్కడ టిడిపి నేతలను హౌస్ అరెస్ట్ లు చేస్తున్నారు. 

విజయవాడలో టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఇంటి ముందు పోలీసులు మొహరించారు.  అర్ధరాత్రి 12 గంటల నుండే ఆయన ఇళ్లు పోలీస్ పహారాలోకి వెళ్లిపోయింది. ఆయన టిడిపి నిరసనల్లో పాల్గొనకుండా అడ్డుకునేందుకే ఇలా పోలీస్ బందోబస్తును ఏర్పాటుచేసినట్లు సమాచారం. పోలీసులు మొహరింపుతో అచ్చెన్నాయుడు ఇంటివద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. 

ఇలాగే మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు (devineni umamaheshwar rao)ను కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు.  జె బ్రాండ్, కల్తీసారా మరణాలపై నిరసన తెలపేందుకు టిడిపి సిద్దమైన నేపథ్యంలో కీలక నాయకులను ఇలా పోలీసులు అడ్డుకుంటున్నారు. దేవినేని ఇంటి వద్ద కూడా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసారు. 

ఇదిలావుంటే ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత (kesineni swetha)ను కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. తన ఇంటివద్దకు చేరుకున్న పోలీసులతో శ్వేత వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా ఆమె మాటడుతూ... ఇలా ప్రతిపక్షాల గొంతునొక్కడాన్ని తప్పుబట్టారు. జగన్ రెడ్డి దుర్మార్గపు పాలనలో ఇది ఒక అసాంఘిక చర్యగా అభివర్ణించారు. శాంతియుతంగా చేస్తున్న ఉద్యమాలను అణచి వేయాలని చూస్తున్నారని... ఇలాంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి చరమ గీతం పాడే రోజులు దగ్గరలోనే వున్నాయన శ్వేత హెచ్చరించారు.

ఇదిలావుంటే పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలతో (jangareddigudem deaths) కల్తీ సారా, జే బ్రాండ్ మద్యం అమ్మకాలపై వివాదం మొదలయ్యింది. కల్తీ మద్యం సేవించడంవల్లే ఒకే గ్రామంలో 20మందికి పైగా మరణించారంటే రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి ఎలా వుందో అర్థమవుతుందంటూ టిడిపి ఆందోళనకు దిగింది. దీనిపై సభలో చర్చకు పట్టుబట్టడంతో గందరగోళం రేగింది.  

ప్రభుత్వం మాత్రం జంగారెడ్డిగూడెం సహా రాష్ట్రంలో ఎక్కడా కల్తీ మద్యం వల్ల మరణాలు సంభవించలేవని... ప్రభుత్వంపై బురద జల్లేందుకే ప్రతిపక్షాలు సహజ మరణాలను రాజకీయాల కోసం ఉపయోగించుకుంటున్నారని ఆరోపిస్తోంది. కల్తీ మద్యమే రాష్ట్రంలో లేనప్పుడు దీనిపై చర్చ ఎందుకంటూ ప్రతిపక్ష వాదనను తిప్పికొట్టింది. దీంతో గత ఆరేడు రోజులుగా టిడిపి ఆందోళనలను మరింత పెంచింది. 

అసెంబ్లీలో నిరసనకు దిగిన టిడిపి సభ్యులు సస్పెండ్ అవుతూ వస్తున్నారు. అయినప్పటికి అసెంబ్లీ ప్రాంగణంలో టిడిపి సభ్యులు నిరసన తెలుపుతున్నారు. వీరికి మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా టిడిపి శ్రేణులు ఆందోళనకు దిగుతున్నారు. ఈ ఆందోళనను అడ్డుకునేందుకే ప్రభుత్వం కీలక నాయకులను హౌస్ అరెస్ట్ చేస్తోంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం