
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి (Deputy CM Narayanaswamy ) మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ మంత్రివర్గంలోని నుంచి తొలగించిన మంత్రులు టీడీపీలోని వస్తారేమోనని ఆ పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ఎదురుచూస్తున్నట్టుగా ఉందన్నారు. సీఎం జగన్ మొదట్లోనే రెండున్నరేళ్ల తర్వాత మంత్రులను మారుస్తానని చెప్పారని.. ఇప్పుడు తమని మారిస్తే తాము సంతోషంగా తప్పుకోవాలని.. తీసేశారని అనడం సమంజసంగా ఉండదన్నారు. దీన్ని కూడా చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం సచివాలయంలోని తన చాంబర్‌లో నారాయణ స్వామి మీడియాతో మాట్లాడారు.
టీడీపీ నేత నారా లోకేష్‌ను ఉద్దేశించి తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని నారాయణ స్వామి చెప్పారు. బడుగులకు న్యాయం చేస్తున్న ప్రభుత్వాన్ని కూలగొడతామంటే కోపం రాదా అని ప్రశ్నించారు. ‘మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో జగన్ సర్కార్‌కు ఇబ్బందులు వస్తాయని ఓ వ్యక్తి తనకు ఫోన్ చేసి చెప్పారు. నన్ను మంత్రిపదవి నుంచి తీసేస్తున్నారని రెచ్చగొట్టారు. ఆ వ్యక్తిని ఉద్దేశించి నేను సోమవారం సభలో అభ్యంతకర పదాన్ని వాడాను. కానీ నేను చేసిన వ్యాఖ్యాలను లోకేష్‌ను ఉద్దేశించి చేసినట్టు భావిస్తున్నారేమో. ఆ పదాన్ని నేను లోకేశ్‌ను ఉద్దేశించి అనలేదు. అలాంటి పదాన్ని సభలో వాడటం పోరపాటే’ అని నారాయణ స్వామి అన్నారు.
ఎన్టీఆర్ తీసుకొచ్చిన మద్యనిషేధం ఎత్తివేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని నారాయణ స్వామి అన్నారు. మద్యనిషేధం ఎత్తివేసి టీడీపీ నేతలతో చంద్రబాబు మద్యం వ్యాపారం చేయించారని అన్నారు. జంగారెడ్డిగూడెంలో చనిపోయినవారు సహజంగాే మరణించినట్టుగా వారి కుటుంబ సభ్యులే చెబుతున్నారని.. కానీ చంద్రబాబు మాత్రం అక్కడికి వెళ్లి రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీలను చులకనగా చూసిన చంద్రబాబుకు మద్య నిషేధం, మద్య నియంత్రణ గురించి మాట్లాడే హక్కు లేదన్నారు.
ఖరీదైన మద్యం తాగినా 10 నుంచి 15 ఏళ్లకు ఆరోగ్యం పాడవకుండా ఉండదన్నారు. పదేళ్ల పాటు మద్యం తాగినవారు కొన్నేళ్లకు చనిపోయినా వారి శరీరంలో మద్యం ఆనవాళ్లు ఉంటాయని డాక్టర్లే చెబుతున్నారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. రూ. కోటి, రూ. లక్ష విలువైన మద్యం తాగినా శరీరంలో మద్యం ఆనవాళ్లు ఉంటాయన్నారు. అదే కల్తీ మద్యం తాగితే వెంటనే వాంతులవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని.. కోలుకోకపోతే మృత్యువాత పడుతుంటారని చెప్పారు. దానిని గుర్తించవచ్చని అన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చీప్ లిక్కర్ తాగి ఎవరైన చనిపోయినట్టుగా విన్నారా అని ప్రశ్నించారు.
ఇక, సోమవారం శాసన సభలో ప్రభుత్వం ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (ఐఎంఎఫ్ఎల్) చట్ట సవరణ బిల్లులను ప్రవేశపెట్టింది. ఈ సందర్బంగా మాట్లాడిన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.. నారా లోకేష్‌పై అనుచితంగా మాట్లాడారని టీడీపీ ఆరోపిస్తుంది. ఈ మేరకు నారాయణ స్వామి టీడీపీ ఎమ్మెల్సీలు మండలి చైర్మన్ మోషేనురాజుకు ఫిర్యాదు చేశారు.