మంత్రి కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలంటూ టిడిపి నాయకులు సీపీకి ఫిర్యాదు చేశారు.
విజయవాడ: టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావులపై బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో వున్న కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారని టిడిపి నాయకులు ఆరోపించారు. ఇందుకుగాను మంత్రిపై చర్యలు తీసుకోవాలంటూ సీపీకి ఫిర్యాదు చేశారు. తమ పార్టీ నాయకులను చంపేస్తామన్న వారిపై చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని సిపిని కోరినట్లు టిడిపి నాయకులు తెలిపారు. సిపిని కలిసి ఫిర్యాదు చేసినవారిలో టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య, ఎమ్మెల్సీలు అశోక్ బాబు, బచ్చుల అర్జునుడు వున్నారు.
ఫిర్యాదు చేసిన అనంతరం వర్ల రామయ్య మాట్లాడుతూ.... మంత్రి కొడాలి నానిని ముఖ్యమంత్రి జగన్ వెంటనే భర్తరఫ్ చేయాలని కోరారు. రాష్ట్ర మంత్రులు కొంతమంది సభ్యత, సంస్కారాలు మరిచి వీధిరౌడీల్లా మాట్లాడుతున్నారని... గతంలో విజయవాడలో ఉన్న రౌడీయిజాన్ని మరోసారి గుర్తుకుతెస్తున్నారన్నారు. మంత్రి కొడాలి నాని తరచుగా బుద్ధిలేకుండా, అసభ్యంగా, జ్ఞానం లేకుండా మాట్లాతుంటారని... అందువల్లే ఆయనను బూతుల మంత్రిగా ప్రజలు పేరుపెట్టి పిలుస్తున్నారని ఎద్దేవా చేశారు.
''ఇద్దరు సహచరులైన మైలవరం, గన్నవరం ఎమ్మెల్యేలను చెరో పక్కన పెట్టుకుని ఆయన వైసీపీ ప్రధాన కార్యాలయం నుంచి చంద్రబాబుపై ఇష్టానుసారంగా మాట్లాడారు. బుద్ధి లేకుండా మాట్లాడారు. ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడారు. కొడాలి నాని బూతులు వింటే ఆయన తల్లిదండ్రులు సిగ్గుతో తలవంచుకుంటారు. మాజీ మంత్రి, సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరరావు గురించి నాని మాట్లాడిన మాటలు సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేవిగా ఉన్నాయి'' అని మండిపడ్డారు.
read more వాలంటీర్లతో అన్యమత ప్రచారం... ఆ మతంలో చేరితేనే ప్రభుత్వ పథకాలట: బోండా ఉమ
''శవాన్ని పట్టుకుని చంద్రబాబు ఊరేగుతారని, లారీతో తొక్కిస్తానని, తానే తొక్కిస్తానని, చెప్పను తానే చేసి చూపిస్తానని మాట్లాడారు. ప్రత్యర్థులను భయపెడతారా? మీ ప్రభుత్వం తప్పుచేస్తోందని చెబితే లారీలతో తొక్కిచ్చేస్తారా? తప్పులు ఏవైనా ఉంటే సరిచేసుకోవాలి? పరిశీలన చేసుకోవాలి? అని ప్రతిపక్షంగా మా బాధ్యతను మేం నెరవేరుస్తుంటే చంపేస్తారా, లారీలతో తొక్కిస్తారా?'' అని ప్రశ్నించారు.
''మంత్రిగా కొనసాగే నైతిక హక్కు కొడాలి నానికి లేదు. ఆయన మంత్రా, వీధి రౌడీనా? సీఎం తేల్చాలి. ముఖ్యమంత్రిగా ఏం చర్యలు తీసుకున్నారు? మంత్రిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మీకు లేదా? జగన్ చర్యలు తీసుకుంటారని చూశాం. కానీ చంద్రబాబుని ఎంత బాగా తిడితే అంత చంకలు గుద్దుకుంటారు. అందుకే నానికి మంత్రి పదవి ఇచ్చారు. మంత్రి పదవి అర్హత లేని వ్యక్తికి ఇచ్చారు. చంద్రబాబుని తిట్టడానికే మంత్రి పదవి ఇచ్చారు'' అని పేర్కొన్నారు.
''జిల్లాలో ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయో కొడాలి నాని చెప్పలేరు. అలాంటి అజ్ఞాని చంద్రబాబుని తిట్టడానికే పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి కొడాలి నానిపై చర్యలు తీసుకోలేదు కాబట్టి చట్టాన్ని ఆశ్రయించాం. పోలీస్ కమిషనర్ ను కలిసి పిటిషన్ ఇచ్చాం. కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని కోరాం. మా నాయకులను చంపేస్తానని, లారీతో తొక్కిస్తానన్న మంత్రి, ఎమ్మెల్యేలపై కేసు రిజిస్టర్ చేసి చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలి. యాక్షన్ తీసుకుంటామని సీపీ చెప్పారు'' అని వర్ల రామయ్య అన్నారు.