కొందరు ఇబ్బంది పెడుతున్నారు.. మా ప్రభుత్వం వచ్చాక వదిలేది లేదు : పోలీసులకు యరపతినేని వార్నింగ్

By Siva KodatiFirst Published Dec 21, 2022, 9:45 PM IST
Highlights

మాచర్ల అల్లర్ల నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొందరు పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని.. తమ ప్రభుత్వం వచ్చాక వారిని వదిలిపెట్టేది లేదన్నారు. 

మాచర్ల నియోజకవర్గంలో ఎస్సీ , ఎస్టీ, బిసి వర్గాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు నేతలను పోలీసులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... మాచర్ల ఘటనకు సంబంధం లేని వ్యక్తులను అదుపులోకి తీసుకుని భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. మాచర్లలో భయనక పరిస్థితిని తీసుకోస్తున్నారని, వైసిపి అరిపోయే దీపమని యరపతినేని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరైతే ఇబ్బందులు పెడుతున్నారో ఆ పోలీసులను వదలిపెట్టమని ఆయన హెచ్చరించారు. డిజిపి పోలీసులను అదుపులో పెట్టుకోవాలని యరపతినేని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో వైసీపీ నేతలు తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని ఆయన పేర్కొన్నారు. మాచర్లలో టిడిపి కార్యకర్తలు, నేతలు ధైర్యంగా వుండాలని, ఎవరు అత్మస్థైర్యం కోల్పోవద్దని శ్రీనివాసరావు సూచించారు. టిడిపి కార్యకర్తలు, నేతలకు అండగా ఉంటామని ఆయన భరోసా కల్పించారు. మాచర్ల ఘటనపై లీగల్‌గా పోరాటం చేస్తున్నామన్నారు. 

Also  REad: మాచర్ల అల్లర్లు : డీజీపీ ఆఫీసులో టీడీపీ మాజీ మంత్రుల ఫోన్ లు తీసుకుని, తలుపులు మూసేసి.. హైడ్రామా...

కాగా.. పల్నాడు జిల్లా మాచర్లలో శుక్రవారం టీడీపీ, వైసీపీ నేతల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలు పట్టణంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ మాచర్ల నివురుగప్పిన నిప్పులాగానే వుంది. ఈ నేపథ్యంలో మాచర్ల ఘర్షణల్లో తీవ్రంగా గాయపడిన టీడీపీ నేతలు, కార్యకర్తలను చంద్రబాబు పరామర్శించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. పోలీసుల అండతోనే తమపై, తమ ఇళ్లపై దాడులు జరిగాయని బాధితులు చంద్రబాబుకు వివరించారు. నష్టపోయిన కుటుంబాలను పార్టీ ఆదుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. కేసుల విషయంలోనూ పార్టీ అండగా వుంటుందని చంద్రబాబు భరోసా కల్పించారు. దీనికి కారకులైన వారిపై చర్యలు తీసుకునే వరకు న్యాయ పోరాటం చేస్తామని చంద్రబాబు తెలిపారు. పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిన ఈ దాడులకు జిల్లా ఎస్పీ సహకరించారని చంద్రబాబు పేర్కొన్నారు.

ఇకపోతే.. మాచర్ల ఘటనపై స్పందించారు గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ్ వర్మ. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాచర్ల ఘటనపై పల్నాడు అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. అనుమతి లేకుండా టీడీపీ నేతలు కార్యక్రమాలు చేశారని.. ఫ్యాక్షన్ నేపథ్యం వున్న టీడీపీ కార్యక్రమంపై సమాచారం ఇవ్వలేదని డీఐజీ అన్నారు. ఇరువర్గాలు రాళ్ల దాడులు చేసుకున్నారని.. కేసులు పెట్టామని త్రివిక్రమ్ వర్మ పేర్కొన్నారు. క్యాడర్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం టీడీపీ నాయకులు చేశారని.. కార్లు, ఆస్తులపై ధ్వంసం చేశారని కఠిన చర్యలు వుంటాయని డీఐజీ హెచ్చరించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. 

click me!