
పట్టభద్రుల ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ముసాయిదా ఓటర్ల జావితాలో జరిగిన అవకతవకలే ఇందుకు నిదర్శనమన్నారు. ఐదో తరగతి, పదో తరగతి, ఇంటర్ చదివిన వారిని కూడా జాబితాలోకి చేర్చారని యనమల ఆరోపించారు. వాలంటీర్లకు టార్గెట్లు పెట్టి... మంత్రులు, ఎమ్మెల్యేలు అనర్హులతో ఓటర్ల జాబితా రూపొందిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ అక్రమాలకు సహకరించి అధికారులు బలికావొద్దని యనమల సూచించారు.
అధికార పార్టీ తన అభ్యర్ధులను గెలిపించుకునేందుకు ఈసీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందన్నారు. వాలంటీర్లను ఎన్నికల విధుల్లో ఉపయోగించవద్దని ఈసీ ఆదేశాలు వున్నా వైసీపీ లెక్క చేయడం లేదని యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఏపీ వ్యాప్తంగా దాదాపు 50 వేల బోగస్ ఓట్లు నమోదయ్యాయని ఆయన అన్నారు. వీటిని తక్షణం తొలగించాలని అలాగే వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా అడ్డుకోవాలని యనమల రామకృష్ణుడు కోరారు.
ఇదిలావుండగా.. మండౌస్ తుఫాను కోస్తా తీరాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వేలాది ఎకరాల పంట నీట మునిగిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. చిత్తూరు, తిరుపతి, కడప, అనంతపురం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా , ఉభయ గోదావరి జిల్లాలపై తుఫాను ప్రభావం తీవ్రంగా వుంది. చేతికొచ్చిన పంట నీట మునగడంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అన్నదాతలను ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. అధికార యంత్రాంగం ద్వారా పంట నష్టాన్ని అంచనా వేయాలని అచ్చెన్నాయుడు కోరారు. వర్షానికి తడిసిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కడప జిల్లా అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి 64 మంది ప్రాణాలు కోల్పోయారని, వేలాది ఇళ్లు, వందలాది ఎకరాల్లో పంట నాశనమైందని అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. రైతుల సంక్షేమాన్ని జగన్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా స్పందించి రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు.