దళితులపై దాడులు... వైసిపి నేతలతో పోలీసులు కుమ్మక్కు...: డిజిపికి వర్ల రామయ్య లేఖ

By Arun Kumar PFirst Published Jan 10, 2022, 5:31 PM IST
Highlights

రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడుల గురించి ప్రస్తావిస్తూ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ప్రశ్నిస్తూ టిడిని నేత వర్ల ఏపీ డిజిపికి లేఖ రాసారు. 

కరీంనగర్: ఆంధ్ర ప్రదేశ్ లో వైసిపి (YSRCP) ప్రభుత్వ హయాంలో దళితులపై దాడులు పెరిగిపోయాయని తెలుగుదేశం పార్టీ (TDP) ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. దళితులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వం విఫలమమైంది కాబట్టి ఇక పోలీసులే వారిని కాపాడాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య (Varla Ramaiah) డిజిపి గౌతమ్ సవాంగ్ (goutham sawang) ను కోరారు. ఈ మేరకు డిజిపికి వర్ల రామయ్య లేఖ రాసారు. 

''రాష్ట్రంలో దళితులపై దాడులు నిత్యకృత్యమైనా నిందితులపై చర్యలు లేవు. వైసీపీ (ycp) పాలనలో దళితుల ప్రాణ, మాన, ఆస్తులకు భద్రత లేకుండా పోయింది. దళితులపై దాడికి పాల్పడినా... పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు'' అని డిజిపి దృష్టికి తీసుకెళ్లారు రామయ్య.

''న్యాయస్ధానాలు జోక్యం చేసుకుని డాక్టర్ సుధాకర్ విషయంలో సీబీఐ విచారణకు ఆదేశించాయి. వేధింపుల వల్లే డా.సుధాకర్ చనిపోయారు. వరప్రసాద్ కు శిరోముండనం చేసిన నిందితులకు, చీరాలలో కిరణ్, చిత్తూరులో ఓం ప్రతాప్ చావుకి కారణమైన వారికి ఇంతవరకు ‎శిక్ష పడలేదు. వైసీపీ నేతలు, పోలీసులు కలిసి పనిచేస్తున్నారు'' అని వర్ల ఆరోపించారు.

''అమరావతి ఎస్సీ రైతులపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసుపెట్టి వేదించిన అధికారులపై చర్యలు తీసుకోమని హైకోర్టు సైతం ‎ఆదేశించింది. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న అఘాయిత్యాలపై జాతీయ ఎస్సీ కమిషన్ జోక్యం చేసుకుని పదే పదే విచారణకు ఆదేశిస్తుంది'' అని గుర్తుచేసారు.

''జూన్ 2019 నుంచి దళితులపై జరిగిన దాడులపై సమగ్ర విచారణ జరిపి దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడాలి. రాష్ట్రంలో దళితులపై జరిగిన దాడులు, తీసుకున్న చర్యలపై డీజీపీ శ్వేతపత్రం విడుదల చేయాలి'' వర్ల రామయ్య డిమాండ్ చేసాడు. 

ఇదిలావుంటే అణగారిన దళిత సమాజాన్ని మరింతగా అణచివేయడమే వైసీపీ నైజంగా కనిపిస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఇటీవల ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం మద్దలకట్టలో దళితులపై వైసీపీ నాయకుల దాడి దుర్మార్గమన్నారు. దళితులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మూకలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు అచ్చెన్నాయుడు. 

''సామూహిక అత్యాచారాలు, శిరోముండనాలు, హత్యాయత్నాలు, అక్రమ కేసులు, అక్రమ నిర్భంధాలు, గృహనిర్భంధాలు, కక్ష సాధింపులతో రాష్ట్రంలో వైసిపి పాలన జర్మనీలోని నాజీల దురాగతాలను కళ్ళకు కడుతుంది. జగన్ పాలనపై ఎస్సీలు వ్యతిరేకంగా ఉన్నారనే దాడులు చేసి బెదిరిస్తున్నారు. పరిషత్ ఎన్నికల్లో  వైసీపీ నేతలు ఓడిపోతే దానికి దళితులు కారణం అవుతారా? వైసీపీ అధికారంలోకి వచ్చాక దళితులపై చేసిన దాడులకు, హత్యలకు, అత్యాచారాలకు అడ్డులేకుండా పోయింది'' అని టిడిపి అధ్యక్షుడు ఆందోళన వ్యక్తం చేసారు. 

''అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్లలో దళితులపై వైసీపీ చేసిన దాడులు మునుపెన్నడూ లేవు. రాష్ట్రంలో 158 దళిత కుటుంబాలపై దాడులకు, హత్యాయత్నాలకు వైసీపీ శ్రేణులు తెగబడ్డారు. అధికారాన్ని కట్టబెట్టిన దళితులపైనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ దుర్మార్గాలకు పాల్పడుతోంది'' అని అచ్చెన్నాయుడు అన్నారు. 
 

click me!