ఆ డాక్టర్ సస్పెన్షన్... జగన్ సర్కార్ పాలిట యమపాశమే: వర్ల రామయ్య

By Arun Kumar P  |  First Published Apr 8, 2020, 8:15 PM IST

ఏపిలో కరోనా మహమ్మారిని అరికట్టడానికి ప్రయత్నిస్తుంటే వారి ఆత్మస్ధైర్యం దెబ్బతినేలా జగన్ సర్కార్ వ్యవహరిస్తోందని టిడిపి నాయకులు వర్ల రామయ్య మండిపడ్డారు. 


గుంటూరు: అధికారమదంతో దళిత డాక్టర్ సుధాకర్ ను సస్పెండ్ చేయడం దారుణమని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. ఈ నిర్ణయం భవిష్యత్తులో వైసిపి ప్రభుత్వానికి యమపాశంగా మారడం ఖాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనాను ఎదుర్కోడంలో కష్టపడుతున్న  ప్రభుత్వ వైద్యులకే వైసిపి ప్రభుత్వంలో రక్షణ కరవైందని విమర్శించారు.  

ప్రాణాంతక వ్యాధిని ప్రమాదకరస్థితిలో కరోనా రోగులకు చికిత్స చేయాల్సిన డాక్టర్ల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.  ప్రొటెక్టీవ్ కిట్ ఇవ్వండని అడిగిన ఓ నిజాయితీ దళిత డాక్టర్ సుధాకర్ ను సస్పెండ్ చేసిన ఈ ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని ఏమనాలి? అని ప్రశ్నించారు. 

Latest Videos

ప్రభుత్వ అసమర్ధతను కప్పిపుచ్చుకునేందుకే డాక్టర్ ను బలి చేయడం సరైంది కాదని ఆక్షేపించారు. తక్షణమే దళిత డాక్టర్ సస్పెన్షన్ ఎత్తి వెయ్యాలని డిమాండ్ చేశారు. డాక్టర్లకు కావలసిన రక్షణ పరికరాలందించాలని రామయ్య కోరారు. 

ప్రాణాలకు తెగించి వైద్యం చేస్తున్న డాక్టర్ల శ్రమను కించపరచకండని సూచించారు. "ఈనాడు దళిత వైద్యునితోనా మీ ఆట. భవిష్యత్ లో వైకాపా నేతలు దళిత పులుల వేటలో మసికాక తప్పదు'' అని మండిపడ్డారు. వైద్యులకు సరైన ఆయుధాలు ఇవ్వకుండా యుద్ధం చేయమంటారా? అని ప్రభుత్వాన్ని రామయ్య నిలదీశారు.

click me!