
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేతి సీతారాంపై తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. చంద్రబాబు నాయుడిపై ఆయన కామెంట్లను తప్పుబట్టారు. తమ నాయకుడు సమర్థుడు కాబట్టే.. మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడని స్పష్టం చేశారు. ముదిగొండ మారణ హోమంలో ఏడుగురు రైతులను వైఎస్ ప్రభుత్వం కాల్చి చంపిందని పేర్కొన్నారు. ముదిగొండ మారణ హోమాన్ని మర్చిపోయారా? అంటూ అడిగారు. ఇప్పుడు కీలక పోస్టుల్లో రెడ్డిలే ఉండటం యాదృచ్ఛికమా? అంటూ నిలదీశారు. సీఐ రెడ్డి, ఎస్సై రెడ్డిద, సీఎం కూడా రెడ్డి ఉండటం యాదృచ్ఛికమా? అని ప్రశ్నించారు. బీసీ, మైనార్టీలకు ఈ ప్రభుత్వం ఒక్క రూపాయన్న ఇచ్చిందా? అని నిలదీశారు.
తమ నాయకుడు శ్రీకాకుళం పర్యటన చేసినప్పుడు విశేష స్పందన వచ్చిందని, ఈ స్పందన చూశాక స్పీకర్ తమ్మినేని సీతారాం మైండ్ సరిగా పని చేయడం లేదేమోనని పేర్కొన్నారు. లండన్ మందులు కాకున్నా.. ఆయనకు ఉచిత కోటాలో వచ్చే మందులైనా వాడటం మంచిదని విమర్శలు చేశారు. లేదంటే అంతిమ యాత్ర వంటి అడ్డమైన కూతలు స్పీకర్ మాట్లాడటం సరికాదని తెలిపారు. తమ్మినేని నోరు అలాంటిదేనని, కానీ, ఆయన పదవి గౌరవప్రదమైనది కదా? అంటూ ట్విట్టర్‌లో ఫైర్ అయ్యారు.
ఇదిలా ఉండగా, ఇటీవలే ఆంధ్ర ప్రదేశ్ లో వరుసగా మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలపై తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, మాజీ స్పీకర్ ప్రతిభా భారతి ఆందోళన వ్యక్తం చేసారు. రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే మహిళా హోంమంత్రి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం... ఇక ముఖ్యమంత్రి అయితే అసలే స్పందించకపోవడం దారుణమన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి నివాసం పక్కనే మహిళపై అఘాయిత్యం జరిగితే పట్టించుకునే నాధుడే లేకుండా పోయాడని మండిపడ్డారు.
తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత మాట్లాడుతూ... రాష్ట్రాన్ని జగన్ నేరాలు ఘోరాలకు అడ్డాగా మార్చారన్నారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తే రాష్ట్రం బీహార్, యూపీలను మించిపోయేలా కనిపిస్తోంది. గత నెల ఏప్రిల్ మొదటి వారం నుంచి నిన్నటివరకు రాష్ట్రంలో 60 అఘాయిత్యాలు జరిగాయి. చోడవరంలో 7 సంవత్సరాల ఆడబిడ్డపై అఘాయిత్యానికి పాల్పడ్డవారిని కూర్చోబెట్టి మంత్రులే సెటిల్ మెంట్లు చేయడం దుర్మార్గం'' అని అనిత మండిపడ్డారు.
''పక్క రాష్ట్రం తెలంగాణలో యువతిపై అత్యాచారం జరిగిందని దిశాచట్టం తెచ్చిన మొనగాడు, తనజిల్లాలో 15ఏళ్ల ఆడబిడ్డ గర్భందాల్చితే ఏంచేస్తున్నాడు? తనను గెలిపించిన సొంతరాష్ట్రం ఆడబిడ్డలపై జగన్ రెడ్డికి ఎందుకింత వివక్ష?'' అని నిలదీసారు.