నెల్లూరు కోర్టులో చోరీ.. శిక్ష పడుతుందనే భయంతోనే దొంగతనం : మంత్రి కాకాణిపై సోమిరెడ్డి ఆరోపణలు

Siva Kodati |  
Published : Apr 15, 2022, 09:30 PM ISTUpdated : Apr 15, 2022, 09:41 PM IST
నెల్లూరు కోర్టులో చోరీ.. శిక్ష పడుతుందనే భయంతోనే దొంగతనం : మంత్రి కాకాణిపై సోమిరెడ్డి ఆరోపణలు

సారాంశం

నకిలీ పత్రాలు సృష్టించిన కేసులో శిక్ష పడుతుందని తెలిసే కోర్టులో ఉన్న ఆధారాలను మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి చోరీ చేశారని ఆరోపించారు టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కోర్టులోనే లాకర్‌ను పగులగొట్టి కీలక పత్రాలు తీసుకెళ్లారని... దీనిపై వెంటనే పోలీసులు స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు

నెల్లూరు జిల్లాలో (nellore) కోర్టులో చోరీ వ్యవహారం (theft in nellore court) ఏపీలో రాజకీయ రంగు పులుముకుంటోంది. దీనిపై ప్రతిపక్ష టీడీపీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది. తాజాగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ వ్యవహారంపై ఫైరయ్యారు. నకిలీ పత్రాలు సృష్టించిన కేసులో శిక్ష పడుతుందని తెలిసే కోర్టులో ఉన్న ఆధారాలను మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి చోరీ చేశారని ఆరోపించారు. దీనిపై హైకోర్టు వెంటనే జోక్యం చేసుకుని నిందితుల బెయిల్‌ రద్దు చేయాలని సోమిరెడ్డి డిమాండ్‌ చేశారు. ఇది ఒక జాతీయ స్థాయి కేసని.. ఈ కేసు విచారణ ప్రస్తుతం నడుస్తోందని ఆయన గుర్తుచేశారు. 

ఇతర దేశాల్లో తన కుటుంబసభ్యులకు రూ.వెయ్యి కోట్లు విలువైన ఆస్తులు ఉన్నాయని ఎంఎల్‌ఏగా ఉన్న సమయంలో కాకాణి ఆరోపించారని, నకిలీ పత్రాలు సృష్టించి తన ప్రతిష్టను దెబ్బ తీశారని సోమిరెడ్డి మండిపడ్డారు. 3 నెలల క్రితం నుంచి ప్రజాప్రతినిధుల కేసులు ప్రత్యేక కోర్టులు చూస్తున్నాయని... కాకాణిపై ఉన్న కేసును ఉపసంహరించుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరణ పిటిషన్‌ వేసిందని సోమిరెడ్డి తెలిపారు. ప్రజాప్రతినిధుల కేసులు ప్రభుత్వం విత్‌ డ్రా చేసేందుకు వీల్లేదని కోర్టు తిరస్కరించిందని ఆయన గుర్తుచేశారు. 

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు అనుమతి లేకుండా రద్దు చేయలేమని జడ్జి చెప్పారని... అందుకే ఇక్కడ విచారణ జరుగుతోందన్నారు. శిక్ష పడుతుందేమోననే భయంతో కోర్టులో చోరీకి పాల్పడ్డారంటూ సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. మంత్రి కాకాణి తనను తాను కాపాడుకునేందుకు.. జైలుకు వెళ్లకుండా ఉండేందుకు ఇలా చేశారని చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ఈ రోజు కోర్టులోనే లాకర్‌ను పగులగొట్టి కీలక పత్రాలు తీసుకెళ్లారని... దీనిపై వెంటనే పోలీసులు స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎక్కడా రాజీ పడకుండా పోరాడుతానని.. వారికి శిక్ష పడుతుందని మాకు నమ్మకం ఉంది అని సోమిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 

కాగా.. నెల్లూరు జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలోని 4వ అదనపు కోర్టులో గురువారం నాడు చోరీ జరిగింది. ఈ  చోరీలో పలు కేసులకు సంబంధించిన కీలకమైన డాక్యుమెంట్లు చోరీకి గురయ్యాయి. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి (kakani govardhan reddy)పై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (somireddy chandramohan reddy) వేసిన కేసుకు సంబంధించిన ఆధారాలు చోరీకి గురయ్యాయని  ప్రచారం సాగుతుంది. ఈ కేసుతో పాటు ఇతర కేసులకు సంబంధించిన ఆధారాలు కూడా చోరీకి గురి కావడం కలకలం రేపుతుంది.

మలేషియా, సింగపూర్, హాంగ్ కాంగ్ లలో సోమిరెడ్డికి ఆస్తులు ఉన్నాయని, పెద్దమొత్తంలో లావాదేవీలు జరిపారని కాకాని గతంలో ఆరోపణలు చేశారు. అంతేకాకుండా, ఇందుకు సంబంధించిన కొన్ని పత్రాలనూ ఇటీవల విడుదల చేశారు. ఆ పత్రాలను మీడియా ముందు కూడా ఉంచారు. అయితే ఆ పత్రాలన్నీ నకిలీవని, తనపై లేనిపోని అభాండాలు వేస్తున్నారని, ఈ నకిలీ పత్రాలు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు సోమిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. 

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కాకాని గోవర్ధన్ రెడ్డి విడుదల చేసిన పత్రాలు ఫోర్జరీవిగా పోలీసులు గుర్తించారు. కాకాని గోవర్ధన్ రెడ్డి  తెచ్చిన డాక్యుమెంట్లు ఫోర్జరీవి అని ఫోరెన్సిక్ లేబోరేటరీ తేల్చింది. అసలు సోమిరెడ్డి మలేషియాకు వెళ్లలేదని ఇమ్మిగ్రేషన్ అధికారులు ధృవీకరించారు. ఫోర్జరీ డాక్యుమెంట్ల కేసులో కొందరిని అరెస్టు కూడా చేశారు. ఈ మేరకు పలువురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. 

ఈ కేసుకు సంబంధించి పోలీసులు చార్జీషీట్ ను కూడా దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను కోర్టులో భద్రపర్చారు.  అయితే కోర్టులో భద్రపర్చిన ఆధారాలు చోరీకి గురి కావడం ప్రస్తుతం కలకలం రేపుతుంది.  కాకానిపై ఉన్న కేసుకు సంబంధించిన ఆధారాలతో పాటు ఇతర కేసులకు సంబంధించిన ఆధారాలు కూడా చోరీకి గురికావడం ప్రస్తుతం చర్చకు దారి తీసింది. ఈ ఘటనపై కోర్టు సిబ్బంది చిన్నబజార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా Police కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!