ఇలాంటి గ్యాంబ్లింగ్ ఎవరూ చేయలేదు.. అసలు క్విడ్‌ ప్రోకో ఇదే : జగన్‌పై ఉండవల్లి కీలక వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Apr 15, 2022, 7:47 PM IST
Highlights

సీఎం జగన్ ఎంతకాలం డబ్బులు పంచగలడు, ఎక్కడ్నుంచి తేగలడని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. తెలంగాణ రిచ్ స్టేట్.. ఏపీ పూర్ స్టేట్‌గా తయారయ్యాయని ఉండవల్లి అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు వల్ల మంచా.. ? చెడా అనే మథనం మధ్య తరగతిలో ప్రారంభమైందన్నారు. 
 

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై (ys jagan) కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (undavalli arun kumar) . శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంపై శుక్రుడు వక్రంగా చూస్తున్నాడని, అయితే ఆ శుక్రుడు ఎవరో తనను అడగొద్దని వ్యాఖ్యానించారు. తెలంగాణ రిచ్ స్టేట్.. ఏపీ పూర్ స్టేట్‌గా తయారయ్యాయని ఉండవల్లి అన్నారు. విద్యుత్‌పై జగన్‌కు ముందు చూపు లేదని.. గతంలో రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉండేదని అరుణ్ కుమార్ గుర్తుచేశారు. 

తెలంగాణలో పవర్ కట్ లేదని.. కానీ ఏపీలో విపరీతంగా కరెంట్ కోతలు (power cuts in ap) వున్నాయని ఆయన తెలిపారు. విద్యుత్ కష్టాల నుంచి బయట పడటానికి ... ఎన్ని యుగాలు పడుతుందో తెలియదని అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు వల్ల మంచా.. ? చెడా అనే మథనం మధ్య తరగతిలో ప్రారంభమైందని ఉండవల్లి పేర్కొన్నారు. జగన్ ఎంతకాలం బటన్స్ నొక్కి డబ్బులు ఇవ్వగలరో ఇప్పుడే చెప్పలేమని ఆయన వ్యాఖ్యానించారు. మోడీకి జగన్ ఇచ్చిన వినతి పత్రంలో ప్రత్యేక హోదా అంశం (ap special status) లేదని అరుణ్ కుమార్ అన్నారు. 

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గగ్గోలు పెట్టిన జగన్‌ పోలవరం ప్రాజెక్టును (polavaram project) కేంద్రానికి ఎందుకు అప్పగించడం లేదని అరుణ్‌కుమార్‌ ప్రశ్నించారు. జాతీయ ప్రాజెక్టును కేంద్రం కట్టి ఇవ్వాలని... చంద్రబాబు ఎందుకు తీసుకున్నారు అని ప్రశ్నించిన జగన్‌... ఇప్పుడు ఎందుకు అదే కొనసాగిస్తున్నారని ఉండవల్లి నిలదీశారు. ఈయన ప్రభుత్వం రాగానే కేంద్రానికి స్వాధీనం చేయాలి కదా అన్నారు. ఆంధ్రాలో బీజేపీలో అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని.. అందువల్ల ఎందుకు ఇక్కడ అనవసరంగా డబ్బులు ఖర్చుపెట్టడమని కేంద్రం భావిస్తోందన్నారు. మన ఎంపీలు గట్టిగా అడగలేరని.. ఇప్పటి వరకు ఎప్పుడైనా పార్లమెంట్లో అడిగారా? అని ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. 

ప్రజలకు డబ్బులు ఇచ్చాను... వాళ్లు నాకు ఓటు వేయాలి, ఇదే జగన్‌ విధానమన్నారు. అసలు క్విడ్‌ ప్రోకో అంటే ఇదేనని ఉండవల్లి వ్యాఖ్యానించారు. ఓటు వేయని వారికి పథకాలు ఇవ్వరని... ఈ విధానంలో జగన్‌ సక్సెస్‌ అవుతారా? ఫెయిల్‌ అవుతారా? అనేది ఎవరూ చెప్పలేరని అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ఇలాంటి  గ్యాంబ్లింగ్‌ ఇప్పటి వరకు ఎవరూ చేయలేదని.. ఎంతకాలం డబ్బులు పంచగలడు, ఎక్కడ్నుంచి తేగలడని ఉండవల్లి ప్రశ్నించారు. 
 

click me!