మీ లాగా దోపిడీ సొమ్ము కాదు.. వాళ్లది కష్టార్జితం : జగన్‌పై సోమిరెడ్డి ఆగ్రహం

By Siva KodatiFirst Published Sep 18, 2022, 5:46 PM IST
Highlights

అసెంబ్లీ సాక్షిగా ఓ కులాన్ని, మీడియా సంస్థలను ఏపీ సీఎం వైఎస్ జగన్ టార్గెట్ చేయడంపై కౌంటరిచ్చారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. జగన్‌కు బెంగళూరు, కర్ణాటకలలో వ్యాపారాలు లేవా అని సోమిరెడ్డి ప్రశ్నించారు. 

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై మండిపడ్డారు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ సాక్షిగా ఓ కులాన్ని, మీడియా సంస్థలను , వాటి అధినేతలను టార్గెట్ చేస్తూ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. తన జీవితంలో ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశామని, కానీ ఓ ముఖ్యమంత్రి ఇంత దుర్మార్గంగా మాట్లాడటం ఇదే తొలిసారి అని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. 

జగన్ సీఎం అయ్యాక ఆయన సొంత సామాజిక వర్గానికి సహా ఏ వర్గానికి కూడా మేలు చేయలేదని చంద్రమోహన్ రెడ్డి దుయ్యబట్టారు. ఈనాడు గ్రూప్ ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించిందని... ఈ సంస్థపై ఎందుకంత కక్ష అని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలను ఈటీవీ ప్రసారం చేయకుండా అడ్డుకున్నారని సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ దోపిడి సొమ్ముతో సాక్షి పత్రిక, ఛానెల్ వచ్చాయని... కానీ కష్టార్జితంతో పైకొచ్చిన ఈనాడు గ్రూప్, ఇతర సంస్థలపై మాట్లాడటం ఏంటని చంద్రమోహన్ రెడ్డి ఫైరయ్యారు. జగన్‌కు బెంగళూరు, కర్ణాటకలలో వ్యాపారాలు లేవా అని సోమిరెడ్డి ప్రశ్నించారు. 

ALso REad:రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగుంటే పిల్లల చిక్కీ, పాలు ఎందుకు ఆగినట్లు : జగన్‌పై పయ్యావుల విమర్శలు

అంతకుముందు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ నుంచి తెలుగుదేశం సభ్యులను సస్పెండ్ చేసి, రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిపై సీఎం ఇష్టమొచ్చిన లెక్కలు చెప్పారని కేశవ్ ఆరోపించారు. అధికారులు ఇచ్చినవి కాకుండా, కావాలనే జగన్ అబద్ధాలు చెప్పారని ఆయన విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్ధితి బాగుంటే ఉద్యోగుల జీతాలు ఎందుకు ఆలస్యమవుతున్నాయని పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలోనూ ఉద్యోగులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాలు చెప్పిన ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని కేశవ్ దుయ్యబట్టారు. 

రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి బాగోలేదు కాబట్టే చిన్నారులకు చిక్కీ, పాలని కూడా ప్రభుత్వం నిలిపివేసిందని పయ్యావుల కేశవ్ విమర్శించారు. పేదల ఇళ్ల నిర్మాణం నిమిత్తం వచ్చిన నిధులను కూడా జగన్ ప్రభుత్వం దారి మళ్లించిందని ఆయన ఆరోపించారు. పథకాల అమలుకు నిధులు లేవని ప్రభుత్వమే స్వయంగా న్యాయస్థానంలో అఫిటవిట్ దాఖలు చేసిందని కేశవ్ గుర్తుచేశారు. మరోవైపు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసే సందర్భంగా పుల్ దెమ్ ఔట్ అని ఎలా అంటారంటూ పయ్యావుల ప్రశ్నించారు. స్పీకర్ ఫస్ట్ సర్వెంట్ ఆఫ్ ది హౌస్ అనే విషయాన్ని తమ్మినేని సీతారామ్ గుర్తించాలని కేశవ్ హితవు పలికారు. 

click me!