రాయలసీమకు ఆ హక్కు కల్పించాలి...ఏ ప్రభుత్వమైనా: సోమిరెడ్డి డిమాండ్ (వీడియో)

By Arun Kumar PFirst Published Aug 20, 2020, 9:06 PM IST
Highlights

రాయలసీమలో మొదటి పంటకు క్రిష్ణా జలాల్లోనూ హక్కు కల్పించాలని మాజీ మంత్రి, టిడిపి నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు. 

గుంటూరు: రాయలసీమలో మొదటి పంటకు క్రిష్ణా జలాల్లోనూ హక్కు కల్పించాలని మాజీ మంత్రి, టిడిపి నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు. రాయలసీమ సాగు, తాగునీరు లేని దుర్భిక్ష ప్రాంతమని... వరద జలాలు సముద్రానికి పోతే కానీ ఈ ప్రాంతానికి నీరు విడుదల చేయమనడం తగదన్నారు. 

''కృష్ణాతో పాటు తుంగభద్ర వరద జలాలూ క్రిష్ణా డెల్టాకే వస్తున్నాయి. అదనంగా పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు వస్తున్నాయి. నికర జలాలైనా కానీ వరద జలాలైనా కానీ మొదటి పంట వరకు రాయలసీమకు కూడా హక్కు కల్పించండి. క్రిష్ణా డెల్టాలో రెండో పంటకూ అవకాశం కల్పించండి. అన్ని ప్రాంతాలతో సమానంగా రాయలసీమలో మొదటి పంటకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలి'' అని సూచించారు. 

వీడియో

"

''దేశంలో అతి తక్కువ వర్షపాతం కలిగిన జిల్లాల్లో అనంతపురం ఒకటి. కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోనూ సాగు, తాగునీటికి ఏటా సమస్యలే. ఎప్పుడో ఐదారేళ్లకు కానీ పెన్నానదికి ప్రవాహం రాని పరిస్థితి. సమృద్ధిగా పంటలు పండని దుస్థితి. గత ఏడాది కూడా పోతిరెడ్డిపాడుకు నీటి విడుదలలో పది రోజులు ఆలస్యమవడంతో విలువైన జలాలు సముద్రం పాలయ్యాయి. ఇప్పుడు శ్రీశైలం నిండిపోయింది. నాగార్జున సాగర్ దాదాపు నిండిపోవచ్చింది. ప్రకాశం బ్యారేజీ నిండిపోయి నెల రోజులుగా వరద సముద్రానికి చేరుతోంది. అయినా సముద్రానికి పోతే తప్ప రాయలసీమకు వదలమనడం న్యాయమేనా?'' అని ప్రశ్నించారు. 

''క్రిష్ణా, తుంగభద్ర క్యాచ్ మెంట్ ఏరియాల నుంచి ఎంత వరద, ఎన్ని రోజులు రాబోతుందనే అనే అంచనా ప్రభుత్వం, అధికారులు వేయకపోవడం దురదృష్టకరం. వృధాగా సముద్రానికి పోతే మీకొచ్చే ఆనందం ఏంటో అర్ధం కావడం లేదు. ముందస్తుగా ఒక అంచనాతో ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. ఏ ప్రభుత్వమైనా మొదట రాయలసీమ గురించి ఆలోచించాలనేది నా డిమాండ్.  క్రిష్ణా, పెన్నానది జలాలతో కలిపి రాయలసీమ ప్రాంతంలో మొదటి పంట పండించుకునే హక్కును కల్పించాలని ఈ ప్రాంత రైతుల తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా'' అని సోమిరెడ్డి పేర్కొన్నారు. 

click me!