ఆ లెక్కలు చెప్పే ధైర్యం వ్యవసాయ మంత్రికి వుందా?: కన్నబాబుకు సోమిరెడ్డి సవాల్

By Arun Kumar PFirst Published Sep 12, 2021, 1:30 PM IST
Highlights

వ్యవసాయం అంటే ఏంటో తెలియన కన్నబాబు వ్యవసాయ శాఖ, ఇరిగేషన్ అంటే అర్థం తెలియని అనిల్ యాదవ్ నీటిపారుదల శాఖను సీఎం జగన్ అప్పగించారని మాజీ మంత్రి సోమారెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. 

అమరావతి: రాష్ట్రంలో వ్యవసాయశాఖ మూతపడిందని... వ్యవసాయ రంగానికి, రైతులకు సీఎం జగన్ వెన్నుపోటు పొడిచారని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు.   వ్యవసాయ రంగం, రైతులకు సంబంధించిన ఏ పథకంలోనైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దేశంలో ముందంజలో ఉందా? అని ప్రశ్నించారు. గత టీడీపీ ప్రభుత్వ హాయాంలో వ్యవసాయ అనుబంధరంగాల్లో 11శాతం వృద్ధిరేటు నమోదైతే...  ఈ ప్రభుత్వ హయాంలో ఎంత నమోదైందో, దేశంలో రాష్ట్రం ఏ స్థానంలో ఉందో చెప్పగలదా? అని సోమిరెడ్డి నిలదీశారు. 

''ఈ రెండున్నరేళ్లలో జగన్ సర్కారు రైతులకు ఏం చేసిందనే ప్రశ్నకు సమాధానం లేదు. ధాన్యం కొనుగోళ్లలో అంతా దళారుల రాజ్యమైపోయి చివరకు రైతులనోట్లో మట్టికొడుతున్నారు. రైతు లేకపోతే దేశమే లేదనే వాస్తవాన్ని పాలకులు ఎందుకు విస్మరిస్తున్నారు.వ్యవసాయమంటే  తెలియని కన్నబాబుకి వ్యవసాయ శాఖ, ఇరిగేషన్ పదానికి అర్థం తెలియని అనిల్ కుమార్ కు నీటిపారుదలశాఖ అప్పగించారు'' అని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు.

'' టీడీపీ ప్రభుత్వం ప్రతి రైతుకి రూ.9వేలిస్తే, జగన్ రైతు భరోసా కింద దాన్ని రూ.7,500లకు పరిమితం చేశాడు. భూసార పరీక్షలు, బిందు తుంపర సేద్యం పరికరాల పంపిణీ, రైతులకు అందించే సూక్ష్మ పోషకాల పంపిణీని జగన్ ప్రభుత్వం అటకెక్కించింది. కోటి20లక్షల మంది రైతులకు భూసారపరీక్ష కార్డులు పంపిణీచేసి, సూక్ష్మ పోషకాలను టీడీపీ ప్రభుత్వం ఉచితంగా అందించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వమే బిందు తుంపర సేద్యానికి 60శాతం సబ్సిడీ ఇస్తుంటే కేవలం 40శాతం సబ్సిడీని భరించలేక సీఎం జగన్ ఆ పథకాన్ని నిలిపేశాడు'' అన్నారు.

read more  ఆరో స్థానం నుండి రెండో స్థానానికి ఏపీ...ఈ ఘనత జగన్ సర్కారుదే: మాజీ మంత్రి యనమల ఎద్దేవా

''కర్నూల్లో చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన మెగాసీడ్ పార్క్ ను మూతపడేలా చేశారు. 2014-15లో వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.6,200లుగా ఉన్న బడ్జెట్ కేటాయింపులను 2018-19లో రూ.18,500 కోట్లకు పెంచాము. 2019-20లో బడ్జెట్లో రూ.20వేలకోట్లు కేటాయించిన వైసీపీ ప్రభుత్వం కేవలం రూ.7వేలకోట్లు మాత్రమే ఖర్చుపెట్టింది. ఆ మొత్తంలోనూ సగం వ్యవసాయశాఖ ఉద్యోగుల జీతాలకే వెచ్చించింది'' అని పేర్కొన్నారు.

''వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలకు టీడీపీ ప్రభుత్వం రూ.1700కోట్లు ఖర్చుపెడితే, జగన్మోహన్ రెడ్డి రూపాయి కూడా ఖర్చుచేయలేదు. చంద్రబాబు నాయుడి ప్రభుత్వం 20వేల ట్రాక్టర్లను రైతురథం పథకం కింద  రైతులకు పంపిణీ చేసింది. ఈ ప్రభుత్వం కనీసం ఒక్కరైతుకి కూడా ఎక్కడా ఒకనాగలికూడా ఇచ్చిందిలేదు. ఈ రెండున్నరేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద రైతులకు జగన్ ప్రభుత్వం ఎంతఖర్చుపెట్టిందో సమాధానం చెప్పాలి. వ్యవసాయశాఖలో పలానా దానికి ఇంతఖర్చు పెట్టామని చెప్పగల ధైర్యం ప్రభుత్వానికి, వ్యవసాయ మంత్రికి ఉందా?'' అని మాజీ మంత్రి సోమిరెడ్డి ప్రశ్నించారు. 


 

click me!