ముఖ్యమంత్రే నక్సలైట్ల భాష మాట్లాడుతున్నారు.. ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి: టీడీపీ నేత చంద్రమోహన్ రెడ్డి

By telugu teamFirst Published Oct 22, 2021, 8:12 PM IST
Highlights

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డే స్వయంగా మావోయిస్టులు, నక్సలైట్ల భాష మాట్లాడుతున్నారని, రాష్ట్రం ఎక్కడికి పోతున్నదో అర్థం కావడం లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. టీడీపీ కార్యాలయాలపై దాడి చేసినవారి వ్యక్తులు వీరని పోలీసులకు చెబుతున్నా అరెస్టు చేయడం లేదని, రక్షణ కోరిన టీడీపీ నేతలపైనే తప్పుడు కేసులు బనాయించడం దారుణమని అన్నారు.
 

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో హింస పేట్రేగిపోయిందని, పోలీసుల సహాయంతో ప్రభుత్వమే ప్రజలపై దాడి చేస్తున్నదని TDP పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను అరికట్టండని కోరినందుకు ప్రజలే బలవుతున్నారని అన్నారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ గంజాయి, మాదక ద్రవ్యాలను గురించి ప్రశ్నిస్తే, విమర్శిస్తే పోలీసులు వారిని లోపలేస్తున్నారని ఆరోపించారు. పోలీసు సంస్మరణ సభలో ముఖ్యమంత్రి YS Jagan Mohan Reddy మాట్లాడిన మాటలు ఎంతమాత్రం సమర్థనీయం కాదని అన్నారు. డీజీపీ, ఎస్పీల సమావేశంలో ముఖ్యమంత్రే తనను తిట్టారని, ఏం చేస్తారో చేయండని అంటే ఎలా? అని అడిగారు. ఆయనే మావోయిస్టులు, నక్సలైట్లు మాట్లాడినట్టు మాట్లాడారని విమర్శించారు. ప్రజలపై హింసను పోలీసులే ప్రోత్సహిస్తుంటే, ఇక సామాన్యులకు రాష్ట్రంలో దిక్కెవరు? అని ప్రశ్నించారు. టీడీపీ కార్యాలయపై దాడి చేసింది వీరు అని చెప్పినా పోలీసులు వారిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని నిలదీశారు. సీఎం జగనే వారిని అరెస్టు చేయవద్దని పోలీసులను ఆదేశిస్తున్నారా? అని అడిగారు.

ముఖ్యమంత్రి ప్రభుత్వాధినేత.. కానీ, ఆయనే నిన్న మాట్లాడుతూ, తనను తిట్టారు కాబట్టి కొట్టండి... చంపండి అనేలా మాట్లాడమేంటని అడిగారు. అందుకే పరిస్థితి ఇంతలా దిగజారిందని అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగితే నిందితులను అరెస్టు చేయకుండా.. రక్షణ కల్పించాలని కోరిన టీడీపీ నేతలపైనే తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. టీడీపీ నేతలు పట్టాభిరామ్, నాదెండ్ల బ్రహ్మంలను అరెస్ట్ చేసిన పోలీసులు, టీడీపీ కార్యాలయంపై దాడి చేసినవారి జోలికి మాత్రం పోవడం లేదన్నారు.

Also Read: కొట్టుకుందాం అంటే.. కొట్టేసుకుందాం, డేట్ .. టైం ఫిక్స్ చేయండి: జగన్‌కు కేశినేని సవాల్

ఈ రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలో జరిగిన ఘటనలు ప్రతి ఆంధ్రుడిని సిగ్గుతో తలదించుకునేలా చేశాయని తెలిపారు. టీడీపీ కార్యాలయంపై దాడికి వచ్చినవారు స్వయంగా YCP ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి వాహనంలోనే వచ్చారని, అది సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిందని వివరించారు. భోజరాజు అనే వ్యక్తీ దాడికి వచ్చాడని, అతను ఇటీవలే గాంధీ కోఆపరేటివ్ సొసైటీ సభ్యుడిగా నియమితుడయ్యాడని తెలిపారు. విజయవాడ 18వ డివిజన్ కార్పొరేటర్ అరవసత్యం కూడా దాడికి వచ్చాడని పేర్కొన్నారు. టీడీపీ కార్యాలయంపైకి దాడికి వచ్చినవారిని డీఎస్పీ స్థాయి అధికారే దగ్గరుండి వాహనాల్లో ఎక్కించి సాగనంపాడని ఆరోపించారు.

ప్రతిపక్షం బంద్‌కు పిలుపునిస్తే టీడీపీ వారిని అరెస్ట్ చేస్తారా? వైసీపీవారికేమో ఎస్కార్ట్‌గా నిలిచి నిరసనలు చేయిస్తారా? అంటూ పోలీసులపై విమర్శలు చేశారు. ఏపీ పోలీసు వ్యవస్థ కంటే బిహార్, పశ్చిమ బెంగాల్, జమ్ము కశ్మీర్ పోలీసు వ్యవస్థ బాగా పనిచేస్తున్నదని అన్నారు. ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని తెలిపారు. ప్రజలే తిరుగుబాటు చేసే సమయం ఆసన్నమైందని వివరించారు.

click me!