కరోనా సమయంలోనూ...మహానాడు నిర్వహించాలని టిడిపి నిర్ణయం: రావుల ప్రకటన

Arun Kumar P   | Asianet News
Published : May 13, 2020, 08:48 PM IST
కరోనా సమయంలోనూ...మహానాడు నిర్వహించాలని టిడిపి నిర్ణయం: రావుల ప్రకటన

సారాంశం

ఇవాళ టిడిపి పొలిట్ బ్యూరో సమావేశంలో తీసుకున్న నిర్ణయాల గురించి మాట్లాడారు ఆ పార్టీ సీనియర్ నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి.  

గుంటూరు: కరోనా వ్యాప్తి నేపథ్యంలో మే 27, 28 తేధీల్లో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మహానాడు నిర్వహించనున్నట్లు మాజీ రాజ్యసభ సభ్యులు, సీనియర్ నాయకుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. టిడిపి శ్రేణులందరికీ పండుగ పర్వదినమైన మహానాడును నిర్వహించాలని పొలిట్ బ్యూరో నిర్ణయించిందని... అయితే అందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు రావుల తెలిపారు. 

''పార్టీ ఆవిర్భావం నుంచి జరుపుకుంటున్న మహాద్భుత కార్యక్రమం మహానాడు. వార్షిక సమావేశంగా కాకుండా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారకరామారావు జన్మదినం మే28 కలిసి వచ్చేట్లుగా మహానాడును జరుపుకోవడం ఆనవాయితీ. తెదేపా శ్రేణులందరికీ పండుగ పర్వదినం మహానాడు. కానీ కరోనా సందర్భంగా ప్రత్యక్షంగా అందరం కలుసుకోలేని స్థితి. అయినప్పటికీ ఆ స్పూర్తిని కొనసాగించాలని నిర్ణయించాం'' అని అన్నారు. 

''మహానాడును వర్చువల్ గా జూం కాన్ఫరెన్స్ ద్వారా జరుపుకోవాలని నిర్ణయించాం. మహానాడుకు సంబంధించిన విధివిధానాలు సాంకేతిక  నిర్వహణపై దిశానిర్దేశం చేయమని పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్ ను కోరాం'' అని అన్నారు.  

''మహానాడులో అనేక అంశాలపై చర్చలు జరపడం ఆనవాయితీ. ఈసారి కూడా మే 27, 28 రెండురోజుల్లో వర్చువల్ గా మహానాడు జరుపుకోడానికి అవసరమైన ఏర్పాట్లుకు సన్నద్ధమవుతున్నాం. విధివిధానాలను ఖరారు చేసుకోవడం, కమిటీలను ఏర్పాటు చేసుకోవడానికి కూడా పాలిట్ బ్యూరో నిర్ణయించింది. కమిటీల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాలని అధ్యక్షులు ఆదేశించారు'' అని తెలిపారు. 

''మహాపర్వదినమైన మహానాడులో తెదేపా నాయకులంతా కలుసుకోవడం, అభిప్రాయాలు ఒకరికొకరు చర్చించుకోవడం ఆనవాయితీ. అయితే ఈసారి జూం కాన్ఫరెన్స్ ద్వారా ఈ చర్యలకు అవకాశం కల్పించాలని అధ్యక్షులు చంద్రబాబు నిర్ణయించారు. ఉభయరాష్ట్రాల్లో తెదేపా ప్రజల పక్షాన ఉంటుంది, పోరాడుతుంది, ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా తెదేపా పని చేసే క్రమంలో మరొక్కసారి తెదేపా విధానాలు సుస్పష్టం చేసే విధంగా మహానాడు నిర్వహించుకుంటాం'' అన్నారు. 

''చంద్రబాబు ఆధ్వర్యంలోని గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మిషన్ అనే ఆర్గనైజేషన్ ఇవాళ జాతీయ స్థాయిలో ఉన్న పరిస్థితులపై, కరోనా తర్వాత ఉత్పన్నమైన పరిస్థితులపై పూర్తిస్థాయి అధ్యయన నివేదికను ప్రధాని మోడీకి అందజేశారు. ప్రధాని ద్వారా నీతిఆయోగ్ కు ఆ నివేదిక వెళ్ళడం తద్వారా నీతిఆయోగ్ చంద్రబాబు, ఆర్గనైజేషన్ కృషిని అభినందిస్తూ లేఖ రాయడంతో పొలిట్ బ్యూరో సభ్యులందరం మనపూర్వకంగా అభినందనలు తెలియజేశాము. సీనియర్ నాయకునిగా దేశం ఎఫుర్కొంటున్న విపత్తులో తనవంతు పాత్రను ఏ విధంగా పోషీంచాలి, దేశానికి ఏ విధంగా మార్గదర్శకంగా ఉండాలో సూచనలు సలహాలివ్వడం ముదావహమన్న నీతిఆయోగ్ ప్రశంసలను గుర్తు చేసుకున్నాం'' అన్నారు. 

''కరోనాతో అన్నీ అగాయికానీ అవినీతి ఆగలేదు. కాదేదీ అనర్హం అన్నట్లు  బ్లీచింగ్ పౌడర్, మాస్కులు, అధికారపార్టీ విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతోంది.  ఉభయరాష్ట్రాల్లో కూడా ధాన్యం కొనుగోలు మూలంగా రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణాలో ప్రత్యేకించి తరుగు, తేమ,తాలు పేరుమీద  క్వింటాలుకు పది కిలోలు ధాన్యం దోస్తున్నారు. రైతాంగాన్ని ఆదుకోవడానికి రాష్ట్రప్రభుత్వాలు పారదర్శకంగా వ్యవహరించాలి'' అని సూచించారు. 

''అకాల వర్షాల వల్ల  తోటలు, ఉద్యానపంటలు దెబ్బతిన్నాయి. సంబంధిత రైతులను ఆదుకోవాలి. చివరిగింజ వరకూ కొంటామన్న మాటను ప్రభుత్వాలు నెరవేర్చాలి. గోనెసంచులు సిద్ధం చేసుకోవడం, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయడంలో నిర్ధిష్ట చర్యలు శూన్యం. రైతాంగం ఇబ్బందులపై చర్చ జరిపాం'' అన్నారు.     
''రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని  ప్రభుత్వాలను డిమాండ్ చేశాం  . రైతాంగంపై  అలక్షం ప్రదర్శించకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరాం'' అని రావుల తెలిపారు. 


 

PREV
click me!

Recommended Stories

Chandrababu Power Full Speech: అనకాపల్లిలో స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం| Asianet News Telugu
Kandula Durgesh Super Speech: Amarajeevi Jaladhara Scheme Foundation Ceremony | Asianet News Telugu