కరోనాపై పోరాటంలో దేశం అలా రాష్ట్రం ఇలా...గణాంకాలివే: సీఎం జగన్

Arun Kumar P   | Asianet News
Published : May 13, 2020, 07:02 PM ISTUpdated : May 13, 2020, 07:11 PM IST
కరోనాపై పోరాటంలో దేశం అలా రాష్ట్రం ఇలా...గణాంకాలివే: సీఎం జగన్

సారాంశం

కరోనా మహమ్మారిని రాష్ట్రం నుండి తరిమికొట్టడానికి తమ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోందని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. 

అమరావతి: కరోనా మహమ్మారిని రాష్ట్రం నుండి తరిమికొట్టేందుకు తమ సర్కార్ అలుపెరగని పోరాటం చేస్తోందని ఏపి సీఎం వైఎస్ జగన్ తెలిపారు. దేశంలో పాజిటివిటీ కేసులు 4.01 శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 1.06 శాతంగా వుందన్నారు. అలాగే రాష్ట్రంలో మరణాల రేటు 2.20 శాతంగా వుంటే దేశంలో 3.25 శాతంగా, రికవరీ రేటు రాష్ట్రంలో 53.44 శాతం, దేశంలో 32.90 శాతంగా వుందన్నారు. ఈ గణాంకాలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా నిర్మూలన కోసం ఎలా పనిచేస్తుందో తెలియజేస్తుందని అన్నారు.  

కోవిడ్‌–19 నివారణా చర్యలపై డిప్యూటీ సీఎం, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, మంత్రి మోపిదేవి వెంకటరమణ, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌తో పాటు వివిధ శాఖల అధికారులతో  సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రస్తుత పరిస్థితిపై చర్చించి తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ఆదేశాలు జారీ చేశారు.  

గతంలో మీరిచ్చిన ఆదేశాల మేరకు ఎమర్జెన్సీ సేవలను గుర్తించామని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. గర్భిణీలు, కీమోథెరఫీ, డయాలసిస్‌ వంటి ఎమర్జెన్సీ సేవలు అవసరమైన వారందర్నీ గుర్తించామన్నారు. షెడ్యూలు ప్రకారం వారికి వైద్య సేవలు అందించడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నామని... షెడ్యూలు సమయానికి వైద్య సిబ్బందే కాల్‌ చేసి వైద్య సేవల కోసం వారిని ఆస్పత్రులకు తరలిస్తున్నారని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఏఎన్‌ఎంలు, ఆరోగ్య సిబ్బంది అన్ని రకాలుగా వారికి అండగా ఉంటున్నారని అధికారులు సీఎంకు వివరించారు. 

అలాగే ఆరోగ్య ఆసరా పథకం విషయంలో ఎక్కడా ఇబ్బంది రాకుండా చూడాలని సీఎం అధికారులకు సూచించారు. ఇది ఈ ప్రభుత్వంలో కొత్తగా పెట్టిన కార్యక్రమమని, అమల్లో ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. 

గత ప్రభుత్వం పెట్టిన ఆరోగ్యశ్రీ బకాయిలన్నింటినీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు చెల్లించామని అధికారులు సీఎంకు తెలియజేశారు. ప్రతి మూడు వారాలకు బిల్లులు అప్‌లోడ్‌ కావాలని, ఆ తర్వాత వాటిని వెంటనే మంజూరు చేయాలని సీఎం ఆదేశించారు. ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు.

108 సర్వీసుల కోసం కొత్తగా కొనుగోలు చేసిన 1060 వాహనాలను జూలై 1న ప్రారంభించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. అలాగే టెలి మెడిసిన్‌ కోసం కొత్త బైకులను కూడా కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. 

రాష్ట్రంలోని చేపలు, రొయ్యలను  స్థానికంగా విక్రయించేలా చూడాలని సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. దీని కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని...కనీసం 30 శాతం స్థానిక వినియోగం ఉండేలా చూడాలన్నారు. దీనిపై ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. అలాగే రైతులు పండించిన ఇతర ఉత్పత్తులు కూడా కనీసం 30 శాతం స్థానిక వినియోగం ఉండేలా చూడాలన్నారు. 

చేపలకు ధర, మార్కెటింగ్‌ విషయాల్లో చర్యలు తీసుకోవాలని మంత్రి మోపిదేవికి సీఎం ఆదేశించారు.ట్రేడర్లతో మాట్లాడాలని సీఎం సూచించారు. అలాగే ట్రేడర్లకు అవసరమైన మార్కెటింగ్‌ ఇతర రాష్ట్రాల్లో లభించేలా తగిన చర్యలు తీసుకునేలా చూడాలని సీఎస్‌కు సీఎం ఆదేశించారు. 

రాయలసీమ తదితర జిల్లాలలో ఎక్కువగా ఉత్పత్తి అవుతున్న పండ్లు, టమోటాలకు మరింత మార్కెట్‌ కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారు. కోల్డ్‌ స్టోరేజీలు, ప్రాసెసింగ్‌ యూనిట్లు, గోదాముల నిర్మాణంపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. 
 

PREV
click me!

Recommended Stories

Chandrababu Power Full Speech: అనకాపల్లిలో స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం| Asianet News Telugu
Kandula Durgesh Super Speech: Amarajeevi Jaladhara Scheme Foundation Ceremony | Asianet News Telugu