
వచ్చే ఎన్నికలను తెలుగుదేశం పార్టీ సీరియస్‌గా తీసుకుంది. చావో రేవో అన్నట్లుగా అధికార వైసీపీతో పోటీ పడుతోంది. ఇందుకోసం వ్యూహా ప్రతివ్యూహాలు సైతం సిద్ధం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఇప్పటికే జనసేన పార్టీతో పొత్తు కన్ఫర్మ్ కాగా.. రెండు మూడు రోజుల్లో సీట్లు కూడా ఖరారు ఖానున్నాయి. అయితే ఈ పొత్తు కారణంగా తెలుగుదేశం పార్టీలో కొందరి టికెట్లు గల్లంతు కానున్నాయి. టీడీపీ బాస్ చేయించుకున్న సర్వేల ఆధారంగా మరికొందరికి మొండిచేయి ఖాయం. అలాంటి వారిలో ఒకరు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు.
చిలకలూరిపేట కేంద్రంగా రాజకీయాలు నడిపిన ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014-19 మధ్య చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగానూ పనిచేశారు. సీనియర్ రాజకీయవేత్తగా , చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా వుండే పుల్లారావు 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. స్వయంగా తాను రాజకీయ ఓనమాలు దిద్దించిన శిష్యురాలు విడదల రజినీ చేతుల్లో ఓడిపోవడం ఆయనను తీవ్రంగా కలచివేసింది. ఈసారి చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావు పోటీ చేయడం అనుమానంగానే వుంది. పుల్లారావు అంటే వ్యతిరేకత బాగా పెరిగిపోయింది.
పుల్లారావును నరసరావుపేటలో పోటీ చేయిస్తే ఎలా వుంటుందన్న దానిపై చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారని టాక్. చిలకలూరిపేట, నరసరావుపేటలలో ప్రత్తిపాటి పుల్లారావును బరిలో దించితే ఎలా వుంటుందన్న దానిపై ఆయన సర్వేలు చేయిస్తున్నారట . అయితే నరసరావుపేటలో అట్లా చిన్న వెంకట రెడ్డి, డాక్టర్ చదలవాడ అరవింద్ బాబులు టికెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా చదలవాడ అయితే అధికార పార్టీతో నేరుగా యుద్ధం చేసి నిత్యం ప్రజల్లో వున్నారు. దీంతో ఆయన ఈసారి తనకు టికెట్ కన్ఫర్మ్ అని ఫిక్స్ అయ్యారు. అలాంటిది ప్రత్తిపాటి పుల్లారావును ఇక్కడికి షిప్ట్ చేస్తే లోకల్ కేడర్ సహకరిస్తుందా అనే భయాలు హైకమాండ్‌ను వెంటాడుతోంది.
కాకపోతే.. చంద్రబాబు ఒక్కసారి డిసైడ్ అయ్యారంటే ఆటోమేటిగ్గా కేడర్ పనిచేసుకుంటూ పోతుంది. ఎందుకంటే టీడీపీ గెలుపే వారికి ముఖ్యం. అటు పొత్తులో జనసేన చిలకలూరిపేట, నరసరావుపేటలలో ఒక దాన్ని కోరుకుంటే చంద్రబాబు వద్ద ఎలాంటి పరిష్కారం వుందన్న దానిపై పేటలో చర్చ జరుగుతోంది.