
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రిగా చేసిన తొలి ప్రసంగంలోనే టీడీపీ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై తప్పుడు ఆరోపణలు చేశారని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అబద్ధాలతో ప్రజల్ని జగన్ నమ్మిస్తున్నారని, విద్యుత్ ఛార్జీల భారంతో వారిని కుంగదీస్తున్నాడని ఎద్దేవా చేశారు. విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి టీడీపీపై చేసిన ఆరోపణను జగన్ నిరూపించలేకపోయారని , చివరికి కోర్టుల్లోనూ చీవాట్లు తిన్నారని పయ్యావుల చురకలంటించారు.
తన మనుషులకు కట్టబెట్టడానికే జగన్ .. టీడీపీ ప్రభుత్వంలోని టెండర్లను రద్దు చేశారని పయ్యావుల కేశవ్ ఆరోపించారు. సోలార్ విద్యుత్‌పై దుష్ప్రచారం చేసిన సీఎం.. మళ్లీ టెండర్లు పిలిచి ఆదానీకి కట్టబెట్టాలని చూస్తే... కోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేసిందని ఆయన గుర్తుచేశారు. చంద్రబాబుకు క్షమాపణలు చెప్పేంత పెద్ద మనసు జగన్‌కు ఎలాగూ లేదని.. కనీసం రాష్ట్ర ప్రజలకైనా చెప్పాలని పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ అవినీతి బయటపడుతుందనే జగన్ పీఏసీ కార్యకలాపాలు జరపడం లేదని ఆయన ఆరోపించారు. విద్యుత్ రంగానికి సంబంధించి పీఏసీ హోదాలో తాను విద్యుత్ శాఖ కార్యదర్శికి 11 లేఖలు రాస్తే సమాధానం లేదని పయ్యావుల కేశవ్ ఆరోపించారు. తనకున్న వ్యక్తిగత పరిచయాలతోనే సమాచారం సేకరిస్తున్నాని ఆయన తెలిపారు.
ALso REad:ఐదు, పదో తరగతి చదివినోళ్లను పట్టభద్రులుగా.. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అక్రమాలు : యనమల
ఇకపోతే.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఎక్కడికి వెళ్లిన రోడ్లను బ్లాక్ చేసి.. ట్రాఫిక్ ఉన్నచోట మాత్రమే మీటింగ్‌లు పెడుతున్నారని విమర్శించారు. సోమవారం సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రోడ్లమీద కాకుండా చంద్రబాబు ఎక్కడైన గ్రౌండ్‌లో మీటింగ్ పెడుతున్నారా అని ప్రశ్నించారు. ట్రాఫిక్ ఉన్నచోట నిలబడి ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై బెదిరింపులకు దిగుతున్నారని అన్నారు. ఆయన ఏదనుకుంటే అదే రూల్ అని భావిస్తున్నారని మండిపడ్డారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటంకు వచ్చినప్పుడు వాహనం టాప్ మీద ఎక్కి ప్రయాణించారని అన్నారు. ఆ బ్యాచ్ అంతా వారికి ఎలాంటి రూల్స్ ఉండవని అనుకుంటున్నారని విమర్శించారు. అలాంటివారు వైసీపీని ప్రశ్నించడం చూస్తే.. వారి స్వభావం ఏమిటో తెలుస్తుందని అన్నారు. చంద్రబాబు, ఆయన కొడుకు, దత్తపుత్రుడులు పిచ్చెక్కి మాట్లాడుతున్నారని విమర్శించారు. పైత్యం ఎక్కువ అయిపోయి.. ప్రభుత్వంపై విషయం కక్కుతున్నారని మండిపడ్డారు. సైకో ఎవరనేది చంద్రబాబు మాటలను చూస్తే అర్థమవుతుందని అన్నారు. చంద్రబాబు సైకో అని ప్రజలు కూడా గుర్తించారని అన్నారు. పవన్ కల్యాణ్ రాజకీయం అంటే 60 సీన్ల సినిమా అనుకుంటున్నారని విమర్శించారు.