
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే వారాహి పేరుతో తన రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు ప్రత్యేకంగా వాహనాన్ని తయారు చేయించుకున్నారు. ఇదే సమయంలో ఆయన ‘‘యువశక్తి’’ పేరిట ఏపీలోని పలు ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. దీనిలో భాగంగా జనవరి 12న తొలి సభను శ్రీకాకుళంలో ఏర్పాటు చేసింది జనసేన. ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. ఈ మేరకు గోడపత్రికను రిలీజ్ చేశారు .
ఇకపోతే.. పవన్ వారాహి వాహనంపై జరుగుతున్న వివాదానికి తెలంగాణ సర్కార్ చెక్ పెట్టింది. హైద్రాబాద్ పశ్చిమ రీజినల్ రవాణా శాఖ కార్యాలయంలో ఈ వాహనానం రిజిస్ట్రేషన్ చేయించారు. వారం క్రితమే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తైందని సమాచారం. ఈ వాహనం బాడీ సర్టిఫికెట్ ను కూడా పరిశీలించినట్టుగా రవాణాశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు
అసలు వివాదం ఏమిటి..?
పవన్ కల్యాణ్ ఈ నెల 7వ తేదీన సోషల్ మీడియాలో ఎన్నికల సమరానికి వారాహి సిద్దంగా ఉందంటూ ఓ పోస్టు చేశారు. తాను ప్రచారం నిర్వహించనున్న వాహనం ఫొటోలు, వీడియోను షేర్ చేశారు. అయితే వాహనం రంగుపై వైసీపీ నుంచి అభ్యంతరం వ్యక్తం అయింది. పవన్ వాహనంపై ఉన్న ఆలివ్ గ్రీన్ కలర్‌ను డిఫెన్స్ వాహనాలు మినహా ఇతర వాహనాలకు ఉపయోగించకూడదని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. కేంద్ర మోటారు వాహన చట్టం ఇదే విషయాన్ని స్పష్టంగా చెబుతుందని అన్నారు. అదే రంగు ఉంటే వాహనం రిజిస్టర్ అవ్వద్దని చెప్పారు. పవన్ కళ్యాణ్ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. వాహనం రంగును ఎలాగో మర్చాలి కదా.. అదేదో పసుపు రంగు వేసుకుంటే సరిపోతుందని వ్యంగ్యస్త్రాలు సంధించారు.
ALso REad:తగ్గేదేలే అంటున్న పవన్.. ప్రతి అడుగులో టార్గెట్ వైసీపీ.. సినిమా ఫంక్షన్‌లో అదే రంగు..!
దీంతో పవన్ ప్రచార వాహనం రంగుపై జనసేన, వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా ఒకరినొకరు దూషించుకోవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే స్పందించిన పవన్ కల్యాణ్ వైసీపీకి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. తనను అడ్డుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ట్వీట్ చేశారు. “మొదట మీరు నా సినిమాలను ఆపేశారు. విశాఖపట్నంలో నన్ను వాహనం, హోటల్ గది నుండి బయటకు రానివ్వలేదు. నన్ను నగరం వదిలి వెళ్ళమని బలవంతం చేశారు. మంగళగిరిలో నా కారును బయటకు వెళ్లనివ్వలేదు, తర్వాత నన్ను నడవనివ్వలేదు. ఇప్పుడు వాహనం రంగు సమస్యగా మారింది. ఒకే తర్వాత నేను శ్వాస తీసుకోవడం ఆపేయమంటారా?’’ అని పవన్ ట్వీట్ చేశారు.