రాష్ట్రంలో మరో టీడీపీ కార్యకర్త హత్య జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే పరిణామాలకు మీరే బాధ్యులు అవుతారని ఏపీ సీఎం జగన్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ హెచ్చరించారు.
గుంటూరు:రాష్ట్రంలో మరో టీడీపీ కార్యకర్త హత్య జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే పరిణామాలకు మీరే బాధ్యులు అవుతారని ఏపీ సీఎం జగన్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ హెచ్చరించారు.
గుంటూరు జిల్లా పెద్దగార్లపాడులో ఆదివారం నాడు హత్యకు గురైన టీడీపీ నేత పేరంశెట్టి అంకులు కుటుంబాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోమవారం నాడు పరామర్శించారు.రాష్ట్రంలో ఫ్యాక్షన్ హత్యలకు పుల్ స్టాప్ పెట్టాలని లోకేష్ కోరారు.
undefined
బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. అంకులు కుటుంబానికి అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఫ్యాక్షనిస్టు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తున్నామన్నారు.
గురజాల నియోజకవర్గంలో నలుగురు టీడీపీ కార్యకర్తలను హత్యచేశారని ఆయన చెప్పారు. ఇంకా 84 మంది కార్యకర్తలపై దాడులు చేసి కాళ్లు, చేతులు విరగ్గొట్టారని ఆయన చెప్పారు.
కాపు నేత అంకులును అత్యంత దారుణంగా హత్య చేశారన్నారు. గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, దాచేపల్లి ఎస్ఐ అంకులును హత్య చేయించారని ఇక్కడి ప్రజలందరికీ తెలుసునన్నారు.
రాష్ట్రంలో ఎవరికీ భద్రత లేదన్నారు. ప్రొద్దుటూరులో చేనేత నాయకుడు సుబ్బయ్యను దారుణంగా హత్య చేశారని ఆయన గుర్తు చేశారు.
సుబ్బయ్య హత్య కేసులో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే, ఆయన బావమరిది పేర్లను ఇచ్చినా పోలీసులు నమోదు చేయలేదన్నారు. ఈ విషయమై తాము ఆందోళన చేస్తేనే అప్పుడు వారి పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చారన్నారు.
అంకులు హత్య కేసులో ఎస్ఐ పేరును తాము చేర్చాలని కోరినా కూడ ఎఫ్ఐఆర్ లో చేర్చలేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కొందరు అధికారులు ఎందుకు వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలుగా ప్రవర్తిస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఈ గ్రామానికి జనవరి 1వ తేదీన గురజాల ఎమ్మెల్యే వచ్చారన్నారు. ఎమ్మెల్యే వచ్చిన రెండు రోజుల తర్వాత అంకలయ్య హత్యకు గురయ్యాడన్నారు. అంకలయ్యను ఎస్ఐ పిలిపించాడన్నారు. ఎస్ఐ సమక్షంలోనే అంకలయ్యను హత్య చేశారని ఆయన ఆరోపించారు.
ఫ్యాక్షన్ రాజకీయాలకు పుల్ స్టాప్ పెట్టాలని గురజాల ఎమ్మెల్యే మహేష్ రెడ్డిని కోరారు. మైనింగ్ అక్రమాలను బయటపెడితే తమ నాయకులపై దాడులు చేస్తున్నారని ఆయన విమర్శించారు.
రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావడం లేదన్నారు. రాజారెడ్డి రాజ్యాంగాన్ని జగన్ అమలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.ఎస్ఐ కాల్ డేటా వివరాలను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.