అమరావతి రైతుల మహా పాదయాత్ర... ఉద్యమాభివందనాలు తెలిపిన నారా లోకేష్

By Arun Kumar PFirst Published Nov 1, 2021, 9:33 AM IST
Highlights

మహా పాదయాత్ర నేపథ్యంలో అమరావతి రైతులు, మహిళలు, యువతకు మాజీ మంత్రి నారా లోకేష్ ఉద్యమాభివందనాలు తెలిపారు. 

అమరావతి: జగన్ సర్కార్ మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేవలం అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు సాగిస్తున్న ఉద్యమం సోమవారం మరింత ఉదృతమయ్యింది. ఇవాళ న్యాయస్థానం టు దేవస్థానం  పేరిట తుళ్లూరు నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి అమరావతి రైతులు మహా పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ నేపధ్యంలో టిడిపి జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్ రైతు పాదయాత్రపై స్పందించారు. 

''రాష్ట్ర రాజధాని amaravati కోసం త్యాగం, భావితరాల భవిష్యత్తు కోసం పోరాటం. అణిచివేత, అవమానాలు ఎదురైనా ఎత్తిన జెండా దించకుండా 685 రోజులుగా జై అమరావతి అంటూ నినదిస్తున్న రైతులకు, మహిళలకు, యువతకు ఉద్యమాభివందనాలు. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని నినాదంతో ప్రజారాజధాని అమరావతి పరిరక్షణకి మీరు తలపెట్టిన మహా పాదయాత్ర విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ శ్రీవారి ఆశీస్సులతో పాలకుల ఆలోచనధోరణిలో మార్పు వచ్చి అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుకుంటున్నా'' అన్నారు నారా లోకేష్. 

ఇదిలావుంటే చాలారోజుల ముందే రాజధాని కోసం చేపట్టే maha padayatra కు పోలీస్ అనుమతి కోరింది అమరావతి పరిరక్షణ సమితి. అయితే మొదట రాజధాని రైతుల పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. శాంతిభద్రతల దృష్ట్యా పాదయాత్రకు అనుమతించలేమని స్వయంగా డిజిపి గౌతమ్ సవాంగ్ అమరావతి పరిరక్షణ సమితికి లేఖ రాశారు. దీంతో మహా పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ రాజధాని రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు రైతుల మహా పాదయాత్రకు అనుమతివ్వాలని పోలీసులను ఆదేశించింది.

 read more సోమవారం నుంచి రాజధాని రైతుల మహా పాదయాత్ర: పోలీసుల అనుమతి.. కానీ మెలిక, ఏంటంటే..?

దీంతో వెనక్కితగ్గిన పోలీసులు షరతులతో కూడిన అనుమతులిచ్చారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య మాత్రమే యాత్ర కొనసాగించాలని... అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు హైకోర్టుకు సమర్పించిన జాబితాలో ఉన్న 157 మంది మాత్రమే మహా పాదయాత్రలో పాల్గొనాలని స్పష్టం చేశారు. అలాగే పాదయాత్రలో పాల్గొనేవారు కచ్చితంగా ఐడీ కార్డులు ధరించాలని పోలీసులు ఆదేశించారు.  

పాదయాత్ర సందర్భంగా డీజే సౌండ్ సిస్టమ్స్ వినియోగించరాదని స్పష్టం చేశారు. ఒకటి రెండు పోర్టబుల్ హ్యాండ్ మైకులు మాత్రమే వినియోగించాలని స్పష్టం చేశారు. రైతుల పాదయాత్రకు ఆయా జిల్లాల్లో పోలీసులు రక్షణ కల్పించాలని.. బందోబస్తు ఏర్పాట్లు చేయాలని గుంటూరు అర్బన్, గుంటూరు రూరల్, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి నగర పోలీసు ఉన్నతాధికారులకు dgp goutham sawang ఆదేశాలు జారీ చేశారు. పాదయాత్ర జరిగినన్ని రోజులు వీడియో చిత్రీకరణ చేయాలని పోలీసులు సూచించారు.  

ఇదిలావుంటే రైతు సమస్యలు, ఆత్మహత్యలపై కూడా లోకేష్ స్పందించారు. ''ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైసీపీ ప్ర‌భుత్వ అరాచ‌క పాల‌న వ‌ల్లే అన్న‌దాత‌ల ఆత్మ‌హ‌త్య‌లు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. రైతుల ఆత్మ‌హ‌త్య‌ల్లో మ‌న రాష్ట్రం దేశంలోనే 3వ స్థానంలో ఉండ‌టం విచార‌క‌రం. వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఒక్క 2020 సంవ‌త్స‌రంలోనే 889 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు'' అంటూ లోకేష్ ఆవేదన వ్యక్తి చేసారు. 

''సున్నా వ‌డ్డీ రుణాల‌ని కోట్ల‌లో సొంత ప‌త్రిక‌లో ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చుకుని, ఇవ్వాల్సిన రుణాల‌కి సున్నా చుట్టేశారు. ఎరువులు-విత్త‌నాలు దొర‌క్క రైతులు బ్లాక్ మార్కెట్‌లో కొనుగోలు చేసి అప్పుల‌పాల‌వుతున్నారు. ప్ర‌తిప‌క్షంలో వున్న‌ప్పుడు త‌న మేనిఫెస్టోయే బైబిల్‌, ఖురాన్‌, భ‌గ‌వ‌ద్గీత అని చెప్పి..అందులో ధ‌ర‌ల స్థిరీక‌ర‌ణ నిధికి మూడు వేల కోట్ల రూపాయ‌లు కేటాయిస్తామ‌ని పేర్కొని, మూడు రూపాయ‌లు కూడా కేటాయించ‌ని రైతు ద్రోహి జ‌గ‌న్‌రెడ్డి'' అని లోకేష్ మండిపడ్డారు. 
 

click me!