
ఏపీ సీఎం వైఎస్ జగన్ పై (ys jagan) మండిపడ్డారు టీడీపీ (tdp) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (nara lokesh). ఆదివారం వరుస ట్వీట్ లు చేసిన ఆయన .. మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏం ఇస్తారు అన్నట్లుగా జగన్ వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. సాక్షి పత్రిక వేయించుకునేందుకు కూడా వాలంటీర్లకు జగన్ ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందని విరుచుకుపడ్డారు. ప్రజల సొమ్మును దోచుకునేందుకు జగన్ అండ్ టీమ్ ఆడని నాటకాలు లేవంటూ లోకేష్ సెటైర్లు వేశారు. కార్యకర్తలను వాలంటీర్లుగా పెట్టుకుని పార్టీ పనులు చేయిస్తున్నారని.. ఇందుకోసం ప్రజాధనాన్ని ఉపయోగించుకుంటున్నారని ఆయన ఆరోపించారు. వాలంటీర్లకు రూ.233 కోట్లు వెచ్చించి మొబైల్స్ కొనిచ్చిన జగన్.. ఇప్పుడు జనం సొమ్మును ఎలా వాడుకోవాలనే దానిపై మరో ఆర్డర్ తెచ్చారంటూ లోకేష్ ఫైరయ్యారు.
నిధులు లేవంటూ సంక్షేమ పథకాలు ఆపేసిన ప్రభుత్వం.. రూ.300 కోట్లతో సాక్షి పత్రికకు ప్రకటనలు ఇచ్చిందని లోకేష్ మండిపడ్డారు. అలాగే సంక్షేమ పథకాల గురించి తెలుసుకోవాలంటూ సాక్షి పత్రికను చదవాలన్న జగన్ ఇందుకోసం నెలకు రూ.5.32 కోట్లు విడుదల చేశారని లోకేష్ మండిపడ్డారు. తద్వారా సాక్షి పత్రి కోసమే ఏడాదికి రూ.63.84 కోట్లు ఖర్చు చేస్తున్నారని.. జనం సొమ్మును జలగలా పీల్చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇకపై జగన్ జనానికి ఎదురొచ్చినా.. జనమే ఎదురెళ్లినా జనానికే రిస్క్ అంటూ లోకేష్ సెటైర్లు వేశారు.