
ఏపీ సీఎం వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయం వద్ద ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిని కలవడానికి వచ్చి , ఆ ప్రయత్నం ఫలించకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేసింది. వెన్నెముక సమస్యతో బాధపడుతున్న కుమార్తె చికిత్సకు రూ.2 కోట్లు అవససరం కాగా.. తన ఇంటిని అమ్ముకోనివ్వకుండా ఇద్దరు పోలీసులు అడ్డుకుంటున్నారని కాకినాడ జిల్లాకు చెందిన ఆరుద్ర అనే మహిళ వాపోయారు. వీరిలో ఒకరు మంత్రి దాడిశెట్టి రాజా గన్‌మన్ ఒకరని ఆమె చెప్పారు. సీఎంతో తన గోడు వెళ్లబోసుకునేందుకు రాగా.. అధికారులు ఒప్పుకోకపోవడంతో ఆమె బ్లేడుతో మణికట్టును కోసుకున్నారు.
ఈ వ్యవహారంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ స్పందించారు. సొంత తల్లి, చెల్లిని తరిమేసిన వ్యక్తి పాలనలో సామాన్యుల కష్టాలు తీరుతాయనుకోవడం అత్యాశేనని లోకేశ్ దుయ్యబట్టారు. తాడేపల్లి ప్యాలెస్‌లో వున్న జగన్‌కి వైసీపీ నేతల అరాచకాలు కనపబడవని.. కుమార్తెకు వైద్యం చేయించలేని ఆరుద్ర ఆత్మహత్యాయత్నం ఆర్తనాదాలు వినిపించవు అంటూ లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ బిడ్డ వైద్యానికి తక్షణమే సాయం చేయాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు.
అంతకుముందు సీఎం జగన్ క్యాంప్ ఆఫీసు సమీపంలో ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. అనారోగ్యంతో బాధపడుతున్న కూతురుతో కలిసి సీఎంవో ఆఫీసు వద్దకు వచ్చిన మహిళా చేయి కోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. కుమార్తె చికిత్స కోసం ఇల్లు అమ్ముకోకుండా ఇద్దరు కానిస్టేబుల్స్ బెదిరింపులకు పాల్పడుతున్నాడని మహిళ ఆరోపించారు. వివరాలు.. కాకినాడ సమీపంలోని రాయుడుపాలెంకు చెందిన అరుద్ర మహిళ తన కూతురు అనారోగ్యంతో బాధపడుతుందని తెలిపారు. ఇల్లు అమ్మి చికిత్స చేయిద్దామంటే ఇద్దరు కానిస్టేబుల్స్ అడ్డుపడుతున్నారని ఆరోపించారు.
Also Read:తాడేపల్లిలో సీఎం జగన్ క్యాంప్ ఆఫీసు సమీపంలో మహిళా ఆత్మహత్య యత్నం.. ఏం జరిగిందంటే..?
కానిస్టేబుల్స్ దౌర్యన్యంపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరినీ ఇల్లు కొననీయకుండా వారు అడ్డుపడుతున్నారని చెప్పారు. ఈ క్రమంలోనే తన బాధ చెప్పుకునేందుకు సీఎం కార్యాయానికి వచ్చానని చెప్పారు. తన కుమార్తె చికిత్స ఖర్చుపై అంచనాలు ఇవ్వమని సీఎంవో అధికారులు అడిగారని తెలిపారు. సీఎంను కలవాలంటే ఎమ్మెల్యేతో రావాలని అధికారులు చెప్పినట్టుగా తెలిపారు.
ఈ క్రమంలోనే సీఎం జగన్‌ను అధికారులు కలవనీయకపోవడంతో తనకు న్యాయం జరగదనే ఆందోళనతో అరుద్ర ఆత్మహత్యకు యత్నించినట్టుగా తెలుస్తోంది. సీఎం క్యాంప్ ఆఫీసుకు కొద్ది దూరంలో కత్తితో చేయి కోసుకున్నారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది.. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఇక, అనారోగ్యంతో బాధపడుతూ వీల్ ఛైర్‌లో ఉన్న అరుద్ర కుమార్తె పరిస్థితి చూసి స్థానికులు చలించిపోయారు.