
ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల పరిస్ధితిపై సెటైర్లు వేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. యువగళం పాదయాత్రలో భాగంగా బుధవారం ఒంగోలులో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. బాహుబలిలో కుంతల రాజ్యం చూశామని, జగనన్న పాలనలో గుంతల రాజ్యం చూస్తున్నామన్నారు. జగనన్న ఒక్క గుంత కూడా పూడ్చలేకపోయారని లోకేష్ దుయ్యబట్టారు.
జగన్ అద్భుతమైన కటింగ్, ఫింగ్ మాస్టర్ అని.. ఆయన దగ్గర రెండు బటన్లు వుంటాయని బల్లపైన బ్లూ బటన్, బల్లకింద రెడ్ బటన్ అంటూ లోకేష్ ఎద్దేవా చేశారు. దేశంలో 100 సంక్షేమ పథకాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగనేనంటూ ఆయన మండిపడ్డారు. మహిళల కన్నీరు తుడిచే బాధ్యత టీడీపీ తీసుకుంటుందని.. చంద్రబాబు రాగానే యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు.
దేశంలో ఆంధ్రప్రదేశ్ రైతుల ఆత్మహత్యల్లో మూడో స్థానంలో, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో వుందన్నారు. జగన్ పేదల పక్షపాతి కాదని.. బడుగు , బలహీన వర్గాలంటే ఆయనకు చిన్న చూపని లోకేష్ ఎద్దేవా చేశారు. సంక్షేమాన్ని భారతదేశానికి పరిచయం చేసింది తెలుగుదేశం పార్టీయేనని ఆయన గుర్తుచేశారు. జగన్ నాలుగేళ్లలో 9,500 ఇళ్లు కడితే.. చంద్రబాబు 3 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారని , ఈ లెక్కల జగన్మోహన్ రెడ్డి 3 లక్షల ఇళ్లు కట్టాలంటే 100 జన్మలెత్తాలని నారా లోకేష్ సెటైర్లు వేశారు.
ALso Read: చరిత్రలో ఏ సీఎం కూడా ఇంత ద్రోహం చేయలేదు.. జగన్ రాయలసీమ ద్రోహి : చంద్రబాబు
అంతకుముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఇరిగేషన్ కోసం టీడీపీ హయాంలో 68 వేల కోట్లు ఖర్చు పెట్టామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో కేవలం 22 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని చంద్రబాబు దుయ్యబట్టారు. రాయలసీమ ప్రాజెక్టుల కోసం టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 12,441 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. వైసీపీ వచ్చిన తర్వాత రూ.2011 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం సిగ్గు లేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇరిగేషన్ కోసం టీడీపీ హయాంలో బడ్జెట్టులో 9.63 శాతం కేటాయిస్తే .. వైసీపీ ప్రభుత్వం 2.35 శాతం మాత్రమే ఖర్చు పెట్టిందన్నారు.
రాయలసీమ ద్రోహులు మీరు కాదా అని చంద్రబాబు నిలదీశారు. రాయలసీమకు నీళ్లిస్తే రతనాల సీమ అవుతుందని.. రాయలసీమకు గుండె లాంటి ముచ్చుమర్రి ప్రాజెక్టును వదిలేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు అవసరమైన 102 ప్రాజెక్టులు ప్రీ క్లోజర్ చేశారని దుయ్యబట్టారు. పూర్తికాదని తెలిసినా రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టుకు 38 వేల కోట్ల టెండర్ ఎందుకు పిలిచారని చంద్రబాబు ప్రశ్నించారు. రాయలసీమను నాశనం చేయడం దుర్మార్గమన్నారు. జగన్ పోవాలి... సీమలో సిరులు పండాలని, చరిత్రలో ఎప్పుడూ ఏ సీఎం కూడా రాయలసీమకు ఇంత ద్రోహం చేయలేదన్నారు.