
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి (mangalagiri) నియోజకవర్గ పరిధిలోని కురగల్లు గ్రామం (kuragallu village)లో ఇళ్ల కూల్చివేతపై టిడిపి (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (nara lokesh) సీరియస్ అయ్యారు. నిరుపేదల గూడు గోడు ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి వినిపించదా? అని ప్రశ్నించారు. ఇళ్లు కోల్పోయిన బాధితులందరికి టిడిపి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
మంగళగిరి నియోజకవర్గంలో బుధవారం నారా లోకేష్ పర్యటించారు. ఈ సందర్భంగా మంగళగిరి మండలం కురగల్లు గ్రామంలో సుమారు 226 మంది తమ గోడును లోకేష్ ఎదుట వెళ్లబోసుకున్నారు. దశాబ్దాలుగా తాము ఇళ్లు కట్టుకుని వుంటున్నామని... ఇప్పుడు హఠాత్తుగా ప్రభుత్వభూమిలో వుంటున్నారని... ఉన్నపళంగా ఖాళీచేయాలని నోటీసులు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
Video
కురగల్లు బాధితులతో మంగళగిరి అంబేద్కర్ విగ్రహం నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకూ ర్యాలీగా వెళ్లిన నారా లోకేష్ ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు. అధికారులు మానవత్వంతో ఆలోచించి నిరుపేదల ఇంటి సమస్యని పరిష్కరించాలని కోరారు. టిడిపి ప్రభుత్వహయాంలో కొండపోరంబోకు భూముల్లో నివసిస్తున్న పేదలకు పట్టాలిచ్చామని... అదేవిధంగా వీరికి పట్టాలివ్వాలని లోకేష్ కోరారు.
read more Chandrababu fire on Justice Chandru : వీళ్లంతా పేటీఎం బ్యాచ్.. జస్టిస్ చంద్రుపై చంద్రబాబు ఫైర్ ..
రాజధాని ప్రాంతంలో పేదల ఇళ్లు తొలగింపు లక్ష్యంగా అధికార పార్టీ, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి పనిచేస్తున్నారని ఈ తొలగింపులు స్పష్టం చేస్తున్నాయన్నారు. సీఆర్డీఎ పరిధిలో పేదలు ఇళ్లు తొలగింపునకు నోటిసు ఇచ్చే అధికారం స్థానిక రెవెన్యూ అధికారులకు లేదని లోకేష్ స్పష్టంచేశారు.
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ కురగల్లు బాధితులకి న్యాయం జరిగేవరకూ అండగా వుంటానని... న్యాయపోరాటానికి పూర్తి సహాయసహకారాలు అందిస్తానన్నారు. పేదల గూడు కూలగొట్టడం, పేదల పొట్ట కొట్టడం ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి దినచర్యగా మారిందని లోకేష్ ఆరోపించారు.
రేవేంద్రపాడు సర్కిల్ పెద్దవడ్లపూడి పరిధిలో ప్రభుత్వం తొలగించిన పేదల ఇళ్ళను లోకేష్ పరిశీలించారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఇళ్ళు కూల్చేసారని, వ్యాపారాలు కూడా చేసుకోవడానికి వీల్లేదని షాపులు కూడా కూల్చేసారంటూ లోకేష్ ఎదుట మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లు కట్టుకుని ఇరవై ఏళ్లుగా వుంటున్నానని, ఇప్పుడు హఠాత్తుగా ఖాళీచేయాలంటున్నారని, ఏం చేయాలో పాలుపోవడం లేదని దివ్యాంగుడు రమేష్ కన్నీరు పెట్టుకున్నాడు.
పేదల పొట్టకొట్టడానికి ఈ ప్రభుత్వం వెనుకాడకపోవడం విచారకరమని నారా లోకేష్ అన్నారు. ఇళ్లు కోల్పోయిన, నోటీసులు అందుకున్న బాధితులకు టిడిపి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
జగన్ రెడ్డికి సబ్జెక్ట్ లేదు, అవగాహన లేదని స్వయంగా సలహాదారు సజ్జల చెప్పారు... సీఎం కే అవగాహన లేకపోతే ఇక ఎమ్మెల్యే ఆర్కే కి అవగాహన ఎలా ఉంటుందని లోకేష్ అన్నారు. మంగళగిరి లో డివైడర్ ఎవరు ఎత్తుకెళ్లారో నీతి కబుర్లు చెబుతున్న ఎమ్మెల్యే ఆర్కే సమాధానం చెప్పాలని అన్నారు. ప్రభుత్వం కేటాయించిన రూ.2800 కోట్లలో ఒక్క రూపాయి కూడా మంగళగిరికి తీసుకురాలేదని అన్నారు. ప్రభుత్వం నుండి నిధులు తీసుకురాకుండా కార్పొరేషన్ జనరల్ ఫండ్స్ వాడేస్తూ మౌలిక సదుపాయాలు కల్పించడానికి అవకాశం లేకుండా చేసారని అన్నారు. నియోజకవర్గంలో ఇసుక అంతా ఏమవుతుంది? అవినీతి అంతా ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జరుగుతుందని లోకేష్ ఆరోపించారు.