ప్రాణాలతో ఆటలొద్దు... వెంటనే స్కూళ్లకు సెలవులివ్వండి...: విద్యార్థులతో ముఖాముఖీలో లోకేష్ డిమాండ్

By Arun Kumar PFirst Published Jan 26, 2022, 9:18 AM IST
Highlights

రాష్ట్రంలో కరోనా ధర్డ్ వేవ్ దావానంలా వ్యాపిస్తున్నా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ స్కూళ్లను నడుపడమేంటని జగన్ సర్కార్ పై నారా లోకేష్ విరుచుకుపడ్డారు. 

మంగళగిరి: ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా (corona virus) ఉదృతి రోజురోజుకు మరింత ఎక్కువ అవుతున్నా రాష్ట్రంలో స్కూళ్ళు కొనసాగుతుండటాన్ని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (nara lokesh) తప్పుబట్టారు,  విద్యార్థులే కాదు  వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఇతర స్కూల్ సిబ్బంది ప్రాణాలతో జగన్ సర్కార్ చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. కరోనా ఉదృతి తగ్గే వరకూ ఇతర రాష్ట్రాల మాదిరిగానే పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని లోకేష్ డిమాండ్ చేసారు. 

అనంతపురం (anantapur), కర్నూలు (kurnool) జిల్లాల ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులతో లోకేష్ వర్చువల్ గా ముఖాముఖి నిర్వహించారు.  ఏపీలో ఒమిక్రాన్ (omicron) కేసులు పెరుగుతున్న నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకునేందుకు లోకేష్ ఈ ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు మాట్లాడుతూ... కరోనా వ్యాప్తి చెందకుండా అధికారులు కనీస చర్యలు కూడా చేపట్టలేదని లోకేష్ ఎదుట ఆవేదన వ్యక్తం చేసారు. మాస్కులు లేవు, శానిటైజర్ లేదు, కనీసం భౌతిక దూరం కూడా పాటించకుండానే స్కూల్స్‌ నడపడం వలన తల్లితండ్రులు, టీచర్లతోపాటు తాము కూడా కరోనా బారిన పడుతున్నామ‌ని విద్యార్థులు ఆందోళన చెందారు. మేము పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సెలవులు ప్రకటించేలా చూడాలని... ఆన్ లైన్ క్లాసులు నిర్వహించేలా ఒత్తిడి తేవాలని విద్యార్థులు లోకేష్‌ని కోరారు. 

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... కరోనా విజృంభిస్తున్న సమయంలో పాఠశాలలు తిరిగి ప్రారంభించడం ప్రమాదమని  జనవరి 17న తేదీనే ఓ లేఖ ద్వారా సీఎం జగన్ ను హెచ్చరించానని గుర్తుచేసారు.   సంక్రాంతి సెలవులనే అలాగే పొడిగించాలని కోరినా ప్రభుత్వం అనాలోచితంగా పాఠశాలలు ప్రారంభించిందని లోకేష్ అన్నారు. 

''అన్ని జాగ్రత్తలు తీసుకునే స్కూల్స్ ప్రారంభించామని విద్యాశాఖ మంత్రి చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులకు అసలు పొంతనే లేదు. జనవరి 21న కేవలం ఒక్క రోజే కర్నూలులో 75 మంది విద్యార్థులు, 17 మంది ఉపాధ్యాయులు కరోనా బారిన పడ్డారంటే ప్రభుత్వం ఏ మేర చర్యలు తీసుకుందో అర్థమవుతోంది'' అని ఎద్దేవా చేసారు. 

''ఒక పక్క కరోనా కేసులు పెరుగుతుంటే 75 శాతం హాజరు ఉంటేనే అమ్మఒడి వస్తుందని ముడిపెట్టడం వలన తల్లిదండ్రులు మానసిక వేదనకు గురవుతున్నారు. 15 ఏళ్లలోపు పిల్లలకు వ్యాక్సిన్ అందుబాటులో లేనప్పుడు స్కూల్స్ నిర్వహించడం వారి ప్రాణాలతో చెలగాటమాడటమే అవుతుంది. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వారు కూడా కరోనా సోకితే ఇబ్బంది పడుతున్నారు. కేవలం బూస్టర్ డోస్ తీసుకున్న వారిలో మాత్రమే ఎటువంటి లక్షణాలు కనపడటం లేదని అన్నారు'' అని లోకేష్ పేర్కొన్నారు.

''ప్రభుత్వం కనీసం పాఠశాలల్లో కరోనా వ్యాప్తి చెందకుండా మాస్కులు, శానిటైజర్ అందుబాటులో ఉంచడం, భౌతిక దూరం పాటిస్తూ తరగతులు నిర్వహించడంలో కూడా విఫలమైంది. ఒమిక్రాన్ బారిన పడకుండా సాధారణ మాస్క్ కూడా రక్షణ కల్పించదని, కేవలం మెడికల్ గ్రేడ్ ఎన్ 95 మాస్క్ ధరిస్తేనే రక్షణ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పాజిటివిటి రేటు 30 శాతానికి చేరుకున్నా ప్రభుత్వం పాఠశాలలు నడపాలనుకోవడం మూర్ఖత్వమే అవుతోంది'' అని మండిపడ్డారు. 

'' విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పడుతున్న ఆవేదన దృష్టిలో పెట్టుకొని పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించాం... జిల్లాల్లో డిఈఓ, ఆర్ఐఓ లకు వినతిపత్రాలు అందజేసి విద్యార్ధుల ప్రాణాలు కాపాడాలని కోరాము. ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకుని పాఠశాలలకు సెలవులు ప్రకటించాలి... లేని పక్షంలో ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేందుకు టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు చేపడతాం'' అని నారా లోకేష్ హెచ్చ‌రించారు. 


 

click me!