చేనేత కార్మికులకు అండగా వుంటాం : ధర్మవరంలో నేతన్నలకు నారా లోకేష్ హామీ

Siva Kodati |  
Published : Apr 01, 2023, 09:43 PM IST
చేనేత కార్మికులకు అండగా వుంటాం : ధర్మవరంలో నేతన్నలకు నారా లోకేష్ హామీ

సారాంశం

టీడీపీ ప్రభుత్వం రాగానే చేనేత కార్మికులకు అండగా నిలుస్తామన్నారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. యువగళం పాదయాత్రలో భాగంగా శనివారం ధర్మవరం ఇందిరమ్మ కాలనీలో చేనేత కార్మికులు ఆయనను కలిశారు.   

యువగళం పాదయాత్రలో భాగంగా శనివారం ధర్మవరం ఇందిరమ్మ కాలనీలో చేనేత కార్మికులు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ని కలిసి వారి సాధక బాధకాలను తెలుసుకున్నారు. ధర్మవరం నియోజకవర్గంలో 75 శాతానికి పైగా చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్నామని వారు తెలిపారు. గత నాలుగేళ్లుగా చేనేతలు వాడే పట్టు, ముడిసరుకుల ధరలు నూరుశాతం పైగా పెరిగాయని వారు లోకేష్‌కు వివరించారు. గోరుచుట్టుపై రోకటిపోటులా రెండేళ్ల కోవిడ్ కాలంలో చేనేతరంగం అతలాకుతలమైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.   పెరిగిన ధరల కారణంగా చేనేత వస్త్రాలకు గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో కుటుంబాలను పోషించుకోలేక చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. 

వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ధర్మవరం నియోజకవర్గంలో 56మంది ఆకలిచావులు, బలవన్మరణాలకు పాల్పడ్డారని వారు లోకేష్‌కు వివరించారు. ఆత్మహత్యలకు పాల్పడిన చేనేత కార్మికులకు ఇప్పటివరకు ప్రభుత్వం ఎటువంటి పరిహారం చెల్లించలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మహత్యలకు  పాల్పడిన చేనేత కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే పరిహారం చెల్లించేలా చొరవచూపాలని వారు నారా లోకేష్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రతి చేనేత కార్మికుడికి ఎటువంటి పూచీకత్తు లేకుండా వడ్డీలేని రుణాలు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. చేనేత వృత్తిదారులను రుణవిముక్తులను చేయడానికి రూ.2లక్షల వరకు రుణమాఫీ చేయాలని కార్మికులు కోరారు. చేనేత కార్మికులు తయారుచేసిన పట్టుచీరలను గిట్టుబాటు ధర చెల్లించి ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలని వారు లోకేష్‌కు వివరించారు. 

Also Read: కాపుల‌తో పార్టీకి గ్యాప్ పెరిగింది నిజ‌మే కానీ.. : టీడీపీ నేత నిమ్మకాయల‌‌ చినరాజప్ప

అనంతరం నారా లోకేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసమర్థత చేనేత కార్మికులకు శాపంగా మారిందన్నారు. ఆత్మహత్య చేసుకున్న కార్మికులకు పరిహారం ఇవ్వకపోగా, కనీసం వారి కుటుంబాలను పరామర్శించేందుకు సిఎంకు మనసు రాలేదని లోకేష్ దుయ్యబట్టారు. గత ప్రభుత్వ హయాంలో చేనేత కార్మికులకు రూ.110 కోట్ల‌ మేర రుణమాఫీ చేశామని, చేనేత కార్మికులకు ముడిసరుకుపై సబ్సిడీ, రుణాలు అందజేసి అండగా నిలిచామని ఆయన గుర్తుచేశారు. ఆదరణ పథకంలో చేనేత కార్మికులకు 90శాతం సబ్సిడీపై పనిముట్లు అందజేశామని లోకేష్ వెల్లడించారు. వచ్చే టీడీపీ ప్రభుత్వంలో చేనేతలకు ముడిసరుకు సబ్సిడీ, సబ్సిడీ రుణాలను అందజేసి ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఆత్మహత్య చేసుకున్న చేనేత కుటుంబాలకు చంద్రన్న బీమాతో తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CM Chandrababu Speech: తిరుపతి వెడ్డింగ్ హబ్ గా తయారవుతుంది | Wedding Hub | Asianet News Telugu
Chandrababu: స్వర్ణ నారావారిపల్లెకు శ్రీకారం చుట్టాం.. జీవనప్రమాణాలు పెంచాలి | Asianet News Telugu