ప్రతిపక్షంలో మేనమామ... అధికారంలో దొంగమామ: జగన్ పై జవహర్ సెటైర్లు

By Arun Kumar PFirst Published May 21, 2021, 3:10 PM IST
Highlights

వైసీపీ ప్రభుత్వం దళితులకు కేటాయించిన నిధుల కంటే సీఎం జగన్ రెడ్డి ప్రచారం కోసం ఖర్చు చేసిన నిధులే ఎక్కువని మాజీ మంత్రి జవహర్ ఎద్దేవా చేశారు.  

గుంటూరు: వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో దళితులు తీవ్ర అన్యాయం జరిగిందని మాజీ మంత్రి కె.యస్. జవహర్ మండిపడ్డారు. ఇది దళిత వ్యతిరేక బడ్జెట్ అని ఆరోపించారు.  వైసీపీ ప్రభుత్వం దళితులకు కేటాయించిన నిధుల కంటే సీఎం జగన్ రెడ్డి ప్రచారం కోసం ఖర్చు చేసిన నిధులే ఎక్కువని జవహర్ ఎద్దేవా చేశారు.  

''ఎస్సి సబ్ ప్లాన్ కి కేవలం రూ . 17 వేల కోట్లే కేటాయించారు... ఆ నిధులు కూడా బడ్జెట్ లో అంకెలుగా ఉపయోగపడతాయి తప్ప దళితులకు ఏమాత్రం ఉపయోగపడవు. జగన్ రెడ్డి తన ప్రభుత్వ ప్రచార ఆర్భాటాలకు  ఖర్చు పెట్టినన్ని డబ్బులు కూడా దళితులకు ఖర్చు చేయడం లేదు'' అని ఆరోపించారు. 

''గత ఏడాది ఎస్సి సబ్ ప్లాన్ కి కేటాయించిన రూ.14 వేల కోట్లు ఏమయ్యాయి? 14 వేల కోట్ల లో కనీసం 14 రూపాయలైనా దళితులు ఖర్చు చేసారా? 2 ఏళ్ల వైసీపీ పాలనలో కనీసం ఒక్కరికైనా ఎస్సి కార్పొరేషన్ ద్వారా రుణాలు గానీ స్వయం ఉపాధి యూనిట్లు గాని ఇచ్చారా?  2 ఏళ్ళలో దళితులకు ఏం చేశారో  శ్వేతపత్రం విడుదల చేసే దైర్యం ముఖ్యమంత్రి జగన్ కి ఉందా?'' అని నిలదీశారు. 

read more  మైనస్ లోకి గ్రోత్ రేట్... ప్రమాదపు అంచుల్లో ఏపీ: యనమల ఆందోళన

''ఎన్నికలకు ముందు దళితులకు మేనమామలా ఉంటానన్న జగన్  అధికారంలోకి వచ్చాక దొంగ మామలా తయారయ్యారు.  2 ఏళ్ల పాలనలో జగన్ దళితులకు చేసిన న్యాయం కంటే అన్యాయమే ఎక్కువ.   ఎన్టీఆర్ విదేశీ విద్య, అంబేద్కర్ ఓవర్సీస్ , బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ వంటి పథకాలు రద్దు చేసి దళిత విద్యార్థులు విద్యకు గండి కొట్టారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఎస్సి కార్పొరేషన్ ఋణాలు రద్దు చేశారు, 2 ఏళ్లలో ఒక్క ఋణం కూడా ఇవ్వలేదు.  వేలాది ఎకరాల దళితుల అసైన్డ్ భూములు లాక్కున్నారు'' అని ఆరోపించారు. 

''వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రంలో దళితులపై దాడి జరగని రోజు లేదు. దళితులకు అన్ని విధాలా అన్యాయం చేసిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి బుద్ధి చెప్పేందుకు దళితులు సిద్ధంగా ఉన్నారు'' అని జవహర్ హెచ్చరించారు. 


 

click me!