300 కోట్ల భూమి కబ్జాకు కుట్ర.. ఆయనదా, ఆయన తండ్రిదా : పేర్ని నానిపై కొల్లు రవీంద్ర ఫైర్

By Siva KodatiFirst Published Feb 7, 2023, 3:43 PM IST
Highlights

మాజీ మంత్రి పేర్నినానిపై మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత కొల్లు రవీంద్ర. రూ.300 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకు పేర్ని నాని కుట్ర పన్నారని .. ఇది ఆయన కష్టమా, ఆయన తండ్రి కష్టమా అంటూ కొల్లు దుయ్యబట్టారు. 

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ప్రభుత్వ భూమిని వైసీపీ కార్యాలయానికి అప్పగించడాన్ని నిరసిస్తూ టీడీపీ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసిన సంగతి తెలిసిందే. సోమవారం ఆందోళనల్లో పాల్గొన్న టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ కార్యాలయం పేరుతో 5.40 ఎకరాల ప్రభుత్వ భూమిని దోపిడీ చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రూ.300 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకు పేర్ని నాని కుట్ర పన్నారని .. ఇది ఆయన కష్టమా, ఆయన తండ్రి కష్టమా అంటూ కొల్లు రవీంద్ర తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇందుకోసం అధికారులు రికార్డులు మార్చేశారని.. వారంతా తగిన మూల్యం చెల్లించుకుంటారని కొల్లు రవీంద్ర హెచ్చరించారు. ఆ భూమి ఏపీ పోలీస్ క్వార్టర్స్‌దని, ప్రజల ఆస్తుల కోసం తాము పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు. విలువైన భూమిని కొట్టేస్తుంటే.. కాపాడుకోవాల్సింది పోయి అధికారుల లంచాల కోసం సహకరిస్తున్నారా అని కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. పోలీసుల ఆస్తి కోసం తాము పోరాటం చేస్తుంటే.. తిరిగి తమపైనే వారు కేసులు పెడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఈ వ్యవహారంపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. 

Also Read: మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్, టీడీపీ శ్రేణుల ఆందోళన.. మచిలీపట్నంలో ఉద్రిక్తత

కాగా.. కృష్ణా జిల్లాలో టిడిపి నాయకుల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. వైసిపి కార్యాలయం కోసం మచిలీపట్నంలో కోట్లాది రూపాయల విలువచేసే ప్రభుత్వ భూమిని కేటాయించడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగిన మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. రవీంద్రను వెంటనే విడుదల చేయాలంటూ టిడిపి శ్రేణులు గూడూరు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 
 
ఇక ఇదే కృష్ణా జిల్లాలో టిడిపి మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావును కూడా పోలీసులు అరెస్ట్ చేసారు. గుడివాడ నియోజకవర్గం నాగవరప్పాడులో పేదల గుడిసెలను తొలగిస్తున్న అధికారులను అడ్డుకున్న మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి అరెస్టు చేసారు. వైద్య పరీక్షల కోసం పమిడిముక్కల స్టేషన్ నుండి గుడివాడ ప్రభుత్వ హాస్పిటల్ కు రావిని తరలించారు పోలీసులు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా భారీగా పోలీసులు మొహరించారు.  
 

click me!