రంగంలోకి మంత్రి నారాయణ: కన్నబాబుతో ఆదాల సయోధ్య

First Published Jul 31, 2018, 2:59 PM IST
Highlights

ఏపీ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ చొరవతో  టీడీపీ నేత కన్నబాబు తన నిరసన దీక్షను విరమించారు. పార్టీ పరంగా అన్ని రకాలుగా ఆదుకొంటామని  మంత్రి హామీతో  కన్నబాబు తృప్తి చెందారని ఆయన వర్గీయులు చెబుతున్నారు.


ఆత్మకూరు: ఏపీ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ చొరవతో  టీడీపీ నేత కన్నబాబు తన నిరసన దీక్షను విరమించారు. పార్టీ పరంగా అన్ని రకాలుగా ఆదుకొంటామని  మంత్రి హామీతో  కన్నబాబు తృప్తి చెందారని ఆయన వర్గీయులు చెబుతున్నారు.

నెల్లూరు జిల్లా ఆత్మకూరు టీడీపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీ పదవిని మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డికి కట్టబెట్టడాన్ని నిరసిస్తూ  టీడీపీ నేత కన్నబాబు పార్టీ కార్యాలయంలోనే నిరసన దీక్షకు దిగారు. 

ఆదాలకు ఇంచార్జీ పదవిని ఇవ్వడంపై కన్నబాబు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే  మంత్రి పి.నారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్రయాదవ్  కన్నబాబుతో మంతనాలు జరిపారు.

కన్నబాబు నిరసన విషయమై మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డితో  మంత్రి నారాయణ టీడీపీ నేతలు రవిచంద్రయాదవ్, ఎమ్మెల్యే రామకృష్ణ చర్చించారు.  దీంతో మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డితో సహా మంత్రి నారాయణ, ఎమ్మెల్సీ బీద రవిచంద్రయాదవ్, ఎమ్మెల్యే రామకృష్ణలు  పార్టీ కార్యాలయానికి చేరుకొని కన్నబాబుతో చర్చించారు. కన్నబాబు డిమాండ్లపై సానుకూలంగా స్పందించారు. దీంతో కన్నబాబు తన నిరసనను  విరమించారు.

మంత్రి నారాయణ కన్నబాబుకు ఆపిల్ ను తినిపించి దీక్షను విరమింపజేశారు. తాను కూడ దీక్ష విరమిస్తున్నట్టు కన్నబాబు ప్రకటించారు.  పార్టీ నాయకత్వం తన డిమాండ్లను సానుకూలంగా  స్పందించిందని కన్నబాబు ప్రకటించారు. ఈ కారణంతోనే తాను తన దీక్షను విరమిస్తున్నట్టు ఆయన ప్రకటించారు.

click me!