గత్యంతరం లేకే పంచాయతీ ఎన్నికలకు...: మాజీ మంత్రి కాల్వ సంచలనం

By Arun Kumar PFirst Published Jan 27, 2021, 5:56 PM IST
Highlights

 ప్రతిపక్ష పార్టీలకు చెందినవారు ఎన్నికల్లో పోటీచేసే అవకాశం లేకుండా చేయడానికి అధికారపార్టీ నేతలు అడుగడుగునా విశ్వప్రయత్నాలు చేస్తున్నారన్నారని మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు ఆరోపించారు. 

గుంటూరు: ప్రజాస్వామ్య విలువలకు అడుగడుగునా పాతరేస్తున్న జగన్మో హన్ రెడ్డి ప్రభుత్వం విధిలేని పరిస్థితుల్లోనే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పూనుకుందని,  ఆ ఎన్నికల్లో ప్రజాతీర్పుని పరిహాసం పాలుచేసే కుట్రలకు ఇప్పటికే తెరలేపిందని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు ఆరోపించారు. బుధవారం ఆయన తన నివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు.  

నిన్నటివరకు అడుగడుగునా ఎన్నికల కమిషనర్ ను అవమానించడం, ఎన్నికల కమిషన్ నిర్ణయాలను బేఖాతరు చేయడం వంటివి చేసిన ప్రభుత్వం, సుప్రీంకోర్టు ఆదేశాలతోనే గత్యంతరం లేకనే పంచాయతీ ఎన్నికలకు సిద్ధమైందన్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటివారు ఇస్తున్నప్రకటనలు ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయని కాలవ తెలిపారు.  

ఈ ఎన్నికల్లో తాము ఓటుహక్కు వినియోగించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుందా లేదా అనే గందరగోళంలో ప్రజలంతా తీవ్రంగా ఆందోళన చెందుతున్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవడానికి రాజ్యాంగం ప్రతిపౌరుడికి ఓటుహక్కు కల్పించిందని, కానీ ఆ హక్కుని దుర్వినియోగం చేసేలా ప్రభుత్వ చర్యలున్నాయని మాజీమంత్రి తేల్చిచెప్పారు. 

ప్రతిపక్ష పార్టీలకు చెందినవారు ఎన్నికల్లో పోటీచేసే అవకాశం లేకుండా చేయడానికి అధికారపార్టీ నేతలు అడుగడుగునా విశ్వప్రయత్నాలు చేస్తున్నారన్నారు. సక్రమంగా ఎన్నికలకు సహకరించాల్సిన సర్కారే, అభూతకల్పనలతో ఏదోసాయం చేస్తున్నామనే మాటలతో ఏకగ్రీవాల పేరుతో తప్పుడు ప్రకటనలివ్వడం, ప్రజలను మోసంచేయడంలో భాగంగా ఇచ్చినవేనని మాజీమంత్రి తేల్చిచెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలవల్ల ముఖ్యమంత్రి ప్రజలకు కొత్తగా ఏం చెప్పదలుచుకున్నారో సమాధానం చెప్పాలన్నారు. ఏకగ్రీవాలు చేసుకుంటే లక్షలకు లక్షలు పంచాయతీలకు వస్తాయనే భ్రమను కల్పిస్తున్నప్రభుత్వం, ప్రజలను మభ్యపెట్టడానికే ఈకొత్త ఎత్తుగడకు తెరలేపిందన్నారు.  

నేడు ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనల్లో వేసిన సచివాలయం బొమ్మ, ఏ రాష్ట్రంలోనిదో సజ్జల సమాధానం చెప్పాలని కాలవ డిమాండ్ చేశారు. వేరే రాష్ట్రంలోని సచివాలయం బొమ్మను పత్రికల్లో వేసి, అది తమ ప్రభుత్వ ఘనతగా చెప్పుకుంటున్న పాలకులు, ప్రజలు ఏంచేసినా, ఏం చెప్పినా నమ్ముతారనే భావనలో ఉన్నారని కాలవ తెలిపారు. 

read more   ఏపీ ప్రభుత్వ ప్రకటనలో తెలంగాణ లోగో.. !

సాంకేతిక కారణాలు చూపి, ప్రతిపక్షపార్టీలకు చెందిన మద్ధతుదారులు ఎన్నికల్లో పోటీచేయకుండా  అడ్డుకోవాలని చూస్తున్నారని,  చిన్నచిన్న కారణాలను చూపి వార్డు కౌన్సిలర్లు, పంచాయతీ అభ్యర్ధుల నామినేషన్లను అధికారులు ఎక్కడికక్కడ తిరస్కరిస్తున్నారన్నారు. ప్రతిపక్ష పార్టీలకు చెందినవారు పోటీలోనిలిచి, ప్రజలు వారికి ఓట్లేస్తే, వైసీపీ మద్ధతుదారులు చిత్తుచిత్తుగా ఓడిపోతారన్న భయంతోనే అధికారపార్టీ ఈవిధమైన కొత్త కుట్రలకు తెరలేపిందని కాలవ మండిపడ్డారు. 

వైసీపీ ప్రభుత్వ దుర్మార్గాలు, దుర్నీతిని ఓటు అనే ఆయుధంతోనే ప్రజలు అడ్డుకోవాలన్నారు. వైసీపీకి బుద్ధిచెప్పడానికి ప్రజలంతా ఇప్పటికే సంసిద్ధులై ఉన్నారని, అధికారపార్టీ తరుపున పోటీచేసినవారందరికీ ఘోరపరాజయం తప్పదని మాజీమంత్రి జోస్యం చెప్పారు. ఎక్కడైనా కొందరు అభ్యర్థులు రాజకీయపార్టీల ముసుగులో లేకపోయినా, వారు ఎలాంటివారో స్థానికులకు కచ్చితంగా తెలుస్తుందన్నారు.  ప్రభుత్వం ఆదినుంచీ స్థానిక ఎన్నికల నిర్వహణకు మొగ్గుచూపకపోవడం, ఓటర్ల జాబితాను  సవరించకపోవడం, కొత్త ఓటర్ల జాబితాను ఖరారు చేయకపోవడం వంటి కారణాలు ఒకఎత్తయితే, ఎన్నికలను ఆపడానికి  సుప్రీంకోర్టు వరకు వెళ్లడంచూస్తుంటే, అధికారపార్టీ ఎన్నికలకు ఎంతలా భయపడుతోందో అర్థమవుతోందన్నారు.  

అధికారంలోకి వచ్చి నిండా 20నెలలైనా కాకమునుపే, ఎన్నికలను అడ్డుకోవడానికి అధికారపార్టీ ఎందుకింతలా అడ్డుకుంటోందన్నారు. ప్రజాభిమానం పొందలేని అసమర్థస్థితిలో ఉన్న అధికారపార్టీ ప్రజలను బెదిరించడానికి అనేకమార్గాలను అన్వేషిస్తోందన్నారు. ఓట్లేయవద్దని, ఎన్నికల్లో పోటీచేయవద్దని చెప్పడంతో పాటు, నామినేషన్లను తిరస్కరించడం వంటి చర్యలతో అధికారపార్టీ ఎలాంటి సంకేతాలు ఇస్తోందో సజ్జల రామకృష్ణారెడ్డి సమాధానం చెప్పాలన్నారు. మంత్రులు, ముఖ్యమంత్రి, సలహాదారులు అందరూ కలిసి చివరకు ఎన్నికల నిర్వహణకే భయపడటం సిగ్గుచేటన్నారు. 

ప్రభుత్వ ముసుగేసుకొని, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం ప్రలోభాలకు గురిచేయడం, వారిని గందరగోళపరచడం వంటి చర్యలు పాలకులకు తగవన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించకుండా చేసే కుట్రల్లో అధికారపార్టీవారే భాగస్వాములవుతున్నారన్నారు. ప్రజలు తమకు ఓటేస్తారనే భావన నిజంగా వైసీపీవారికి ఉంటే ప్రతి పౌరుడు, తన ఓటుహక్కుని సద్వినియోగ పరుచుకునే అవకాశాన్ని ఓటర్లకు కల్పించాలని తాను డిమాండ్ చేస్తున్నానన్నారు. చంద్రబాబు నాయుడి నాయకత్వంలో ప్రజాస్వామ్య పరిరక్షణకోసం టీడీపీ రాజీలేని పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా కాలవ స్పష్టం చేశారు. 

click me!