వినాయక పందిళ్లపై సవాలక్ష రూల్స్ .. నీ దయాదక్షిణ్యాలపై ఆధారపడి పండగ చేసుకోవాలా : జగన్‌పై జేసీ ఫైర్

By Siva KodatiFirst Published Aug 28, 2022, 2:34 PM IST
Highlights

వినాయక చవితి సందర్భంగా పందిళ్లకు అనుమతి ఇవ్వకపోవడంపై టీడీపీ సీనియర్ నేత, తాడిపత్తి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి హిందువులు పండుగలు జరుపుకోవాలా అని జేసీ ప్రశ్నించారు. 

వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేయనున్న పందిళ్లకు నిబంధనల పేరిట అనుమతులు లభించకపోవడం పట్ల ఏపీ ప్రభుత్వంపై విపక్షాలు మండిపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంపై టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... శాంతి భద్రతల పేరుతో వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతి నిరాకరించడం సరికాదన్నారు. ప్రభుత్వ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి హిందువులు పండుగలు జరుపుకోవాలా అని జేసీ ప్రశ్నించారు. 

చవితి పందిళ్ల ఏర్పాటు కోసం ప్రజలు అధికారులు, పోలీసుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోందని ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ విగ్రహాల ఏర్పాటుకు అనుమతించని వారికి నిద్ర లేకుండా చేయాలంటూ విఘ్నేశ్వరుడిని ఆయన ప్రార్ధించారు. మునిసిపల్ ఛైర్మన్‌గా వున్న తనకే విగ్రహాల ఏర్పాటుకు సంబంధించిన అనుమతులు తీసుకోవడం కష్టంగా వుందని.. అలాంటప్పుడు సామాన్యుల పరిస్ధితి ఏంటని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 

ALso REad:హిందూ మతంపై జగన్‌కి కక్ష.. పండుగను అడ్డుకోవాలనే ప్లాన్, వినాయక పందిళ్లపైనా ట్యాక్స్ : బోండా ఉమా

ఇకపోతే... వినాయక పందిరికి రోజుకు వెయ్యి రూపాయలు పన్ను కట్టమనటం హేయమైన చర్య అంటూ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు టీడీపీ నేత బోండా ఉమా మహేశ్వరరావు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పనికిమాలిన నిబంధనలు పెట్టి రాష్ట్రంలో వినాయక చవితి జరగకుండా చేసి పండుగ ప్రాసిస్త్యం తహహించేలా జగన్ రెడ్డి చర్యలున్నాయని మండిపడ్డారు. హిందూమతం మీద జగన్మోహన్ రెడ్డి సాగిస్తున్న కక్ష సాధింపులో భాగంగానే చవితి వేడుకలకు అనేక నిబంధనలు పెట్టారని బోండా ఉమా ఆరోపించారు. పండుగల మీద జగన్మోహన్ రెడ్డి పెత్తనం ఏంటని ఆయన నిలదీశారు. 

పనికిమాలిన జీవోలు రద్దు చేయకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని బోండా ఉమా హెచ్చరించారు. పండుగలెలా చేసుకోవాలో కూడా ప్రభుత్వమే శాసించేలా జగన్ రెడ్డి తుగ్లక్ పాలన ఉందన్నారు. వినాయక చవితి పండుగ సంప్రదాయాలకు తగ్గట్లు కాకుండా ప్రభుత్వ నిబంధనల మేరకు జరపాలనటం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై వైసీపీ ప్రభుత్వం దాడులుకు తెగబడుతోందని బోండా ఉమ విమర్శించారు. వినాయక చవితి పందరికి మాలిన నిబంధనలు పెట్టారని.. పండుగ జరగకుండా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. 

చెంతాడు అంత నిబంధనలు పెట్టి వినాయక చవితిని ప్రభుత్వం అడ్డుకుంటోందని బోండా ఉమా విమర్శించారు. పిచ్చివాడి చేతిలో రాయి లాగా జగన్మోహన్ రెడ్డి వ్యహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ హిందూ దేవాలయాలపై వరుస దాడులు కొనసాగించారని బోండా ఉమా ఆరోపించారు. తుగ్లక్ నిబంధనలకు భయపడకుండా ప్రజలు వినాయక చవితి పండుగ నిర్వహించుకుంటే తెలుగుదేశం అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. 
 

click me!