యూ1 జోన్‌ను రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం.. దీక్షలు విరమించిన రైతులు..

By Sumanth KanukulaFirst Published Aug 28, 2022, 1:09 PM IST
Highlights

గుంటూరు జిల్లా తాడేపల్లి, కుంచనపల్లి, కొలనుకొండ గ్రామాల పరిధిలో యూ1 రిజర్వ్ జోన్‌ను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. 
 

గుంటూరు జిల్లా తాడేపల్లి, కుంచనపల్లి, కొలనుకొండ గ్రామాల పరిధిలో యూ1 రిజర్వ్ జోన్‌ను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. గత కొద్ది రోజులుగా రిజర్వ్ జోన్‌ను తొలగించాలని ఆ ప్రాంతాల రైతులు రిలేదీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. బాధిత రైతులు చేపట్టిన ఆందోళన రోజరోజుకు మరింత  తీవ్రతరం అవుతోంది. ఈ క్రమంలోనే యూ1 జోన్‌ను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. దీంతో రైతులు రిలేదీక్షలను విరమించారు. ఇక, తాడేపల్లి, కుంచనపల్లి, కొలనుకొండ గ్రామాల పరిధిలో 178 ఎకరాల భూమిని 2015లో యూ1 రిజర్వ్ జోన్‌గా ప్రకటించారు. రాజధాని నిర్మాణానికి అవసరమైన మౌలిక వసతుల కల్పన కోసం ఈ భూమిని రిజర్వ్ చేశారు. 

ఆ భూముల్లో వ్యవసాయం తప్ప ఇతర కార్యకలాపాలు చేపట్టకుండా ఆంక్షలు విధించారు. అయితే దీనిని వ్యతిరేకిస్తూ ఆ భూముల రైతులు ఐదేళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే 2020లో రైతుల ఎమ్మెల్యే ఆర్కేతో కలిసి సీఎం జగన్‌ను కలిశారు. దీంతో సమస్యను పరిష్కారిస్తానని హామీ ఇచ్చారు. అయితే రెండేళ్లు గడిచిన ఎటువంటి పరిష్కారం చూపకపోవడంతో.. రైతులు ఆందోళలను ఉధృతం చేశారు. దీంతో రిజర్వ్ జోన్‌ ఎత్తివేతపై ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యంతరాలు ఏమి రాకపోవడంతో.. తాజాగా యూ1 రిజర్వ్ జోన్‌ను రద్దు చేస్తూ జీవో విడుదల చేసింది. 

click me!