జేసీ దివాకర్ రెడ్డి సహా టీడీపీ నేతల అరెస్ట్: ఇళ్లకు తరలింపు

By narsimha lodeFirst Published Oct 30, 2019, 1:37 PM IST
Highlights

టీడీపీ నేత మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని బుధవారం నాడు  పోలీసులు అరెస్ట్ చేశారు. వెంకటాపురం గ్రామానికి వెళ్లేందుకు జేసీ దివాకర్ రెడ్డి ప్రయత్నించగా పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. 

అనంతపురం: అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం వెంకటాపురం వెళ్తున్న అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే యామిని బాల, టీడీపీ నేత బీటీ నాయుడులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరగంట తర్వాత వారిని పోలీస్ బందోబస్తు మధ్య  వారి ఇళ్లకు తరలించారు.

అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్ర మండలం వెంకటాపురంలో టీడీపీ నేత ఇంటి చుట్టూ వైసీపీకి చెందిన వారు నాపరాళ్లు పాతారు. ఈ విషయమై టీడీపీ నేతకు అండగా నిలిచేందుకు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆ గ్రామానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు జేసీ దివాకర్ రెడ్డిని గ్రామంలోకి వెళ్లకుండా అడ్డుకొన్నారు.

వెంకటాపురం గ్రామానికి చెందిన  వైసీపీ నేత వెంకట్రామిరెడ్డికి అదే గ్రామానికి చెందిన టీడీపీ నేతకు మధ్య స్థలం విషయంలో వివాదం ఉంది. ప్రైవేట్ స్థలంలో రోడ్డు ఉందని టీడీపీ నేతలు చెప్పడాన్ని వైసీపీ నేతలు ఖండిస్తున్నారు.వైసీపీ నేత వెంకట్రాంరెడ్డిదే ఈ స్థలమని రెవిన్యూ అదికారులు తేల్చారని ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు.

Also read:టీడీపీ నేత ఇంటి చూట్టూ నాపా రాళ్ళు పాతిన వైసీపీ నేత!

ఈ విషయం తెలుసుకొన్న అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఇవాళ  వెంకటాపురం గ్రామానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు వెంకటాపురం గ్రామంలోకి జేసీ దివాకర్ రెడ్డిని వెళ్లకుండా అడ్డుకొన్నారు.

ఈ సమయంలో శింగనమల మాజీ ఎమ్మెల్యే యామిని బాల టీడీపీ నేత బీటీ నాయుడులను కూడ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.జేసీ దివాకర్ రెడ్డిని కారులో నుండి బలవంతంగా పోలీసులు దించేశారు.పోలీస్ స్టేషన్‌కు తరలించారు.  ఆ తర్వాత పోలీసులు టీడీపీ నేతలను తమ ఇళ్ల వద్ద వదిలి వెళ్లారు.

ఎన్నికల తర్వాత అనంతపురం జిల్లాలో  టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకొంటున్నాయి. ఈ జిల్లాలో ఈ రెండు పార్టీల కార్యకర్తలు ఘర్షణలకు దిగుతున్నారు. వైసీపీకి చెందిన కార్యకర్తలు తమపై దాడులకు దిగుతున్నారని టీడీపీనేతలు ఆరోపిస్తున్నారు. 

రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో తమ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలపై వైసీపీ దాడులకు పాల్పడుతోందని టీడీపీ ఆరోపిస్తోంది.ఈ విషయమై రాష్ట్రంలో పర్యటిస్తున్న మానవహక్కుల ప్రతినిధులకు ఫిర్యాదు చేయాలని చంద్రబాబునాయుడు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో మానవహక్కుల ప్రతినిధులకు టీడీపీ కార్యకర్తలు పిర్యాదు చేస్తున్నారు.

మరో వైపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పార్టిని బలోపేతం చేసేందుకు చంద్రబాబునాయుడు పర్యటిస్తున్నారు. డిసెంబర్ నెలాఖరువరకు చంద్రబాబునాయుడు జిల్లాల పర్యటనలు కొనసాగించనున్నారు. 
 

click me!