ఏపీ నుంచి తరలిపోతున్న పరిశ్రమలు.. తెలంగాణ సర్కార్ రోజూ జగన్‌కి దండం పెడుతోంది : ధూళిపాళ్ల సెటైర్లు

By Siva KodatiFirst Published Dec 3, 2022, 4:46 PM IST
Highlights

గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన అమరరాజా కంపెనీ తెలంగాణకు తరలిపోవడంపై టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర స్పందించారు. ఏపీలోని పరిశ్రమలన్నీ తెలంగాణకు తరలిపోతుండటంతో అక్కడి ప్రభుత్వం రోజూ జగన్ ఫోటోకి దండం పెడుతోందని సెటైర్లు వేశారు. 
 

అమరరాజా పరిశ్రమ తెలంగాణకు తరలిపోవడంపై ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు భగ్గుమన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలను తెచ్చే సత్తా లేకపోగా.. వున్న కంపెనీలను కూడా పొమ్మనలేక పొగబెడుతున్నారంటూ విపక్షాలు ముఖ్యమంత్రి జగన్‌పై దుమ్మెత్తిపోస్తున్నాయి. తాజాగా ఈ వ్యవహారంపై టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలోని పరిశ్రమలన్నీ తెలంగాణకు తరలిపోతుండటంతో అక్కడి ప్రభుత్వం రోజూ జగన్ ఫోటోకి దండం పెడుతోందని సెటైర్లు వేశారు. 

ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపారం చేయాలంటూ జగన్ బీనామీలైనా కావాలని లేదంటే, ఆయన మనుషులకు వాటాలైనా ఇవ్వాల్సి వుంటుందని ధూళిపాళ్ల దుయ్యబట్టారు. ప్రభుత్వ వేధింపులకు తోడు, అధికార పార్టీ నేతల వసూళ్లకు భయపడి పారిశ్రామికవేత్తలు ఏపీని వీడుతున్నారని నరేంద్ర కుమార్ ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో క్యాపిటల్ ఇన్‌ఫ్లోకు బదులు.. క్యాపిటల్ రివర్స్‌ఫ్లో జరుగుతోందని ధ్వజమెత్తారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ 14వ స్థానానికి పడిపోవడం సిగ్గుచేట్టన్న ఆయన.. ఎప్పటి నుంచో వ్యాపారాలు చేస్తున్న వారిని బెదిరించడం, లేదా వారి వ్యాపారాన్ని లాక్కోవడంతో రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోతోందని నరేంద్ర విమర్శించారు. 

Also Read:చంద్రబాబు హెరిటెజ్ వ్యాపారం ఏపీలో ఉంది.. పెట్టుబడులు తరలిపోతున్నాయనే ప్రచారం అవాస్తవం: మంత్రి అమర్‌నాథ్

అంతకుముందు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మీడియాతో మాట్లాడుతూ.... ఆంధ్రప్రదేశ్ నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయనే ప్రచారం అవాస్తమన్నారు. ప్రభుత్వంపై కొన్ని పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఇతర ప్రాంతాల్లో పెట్టుబడులు పెడితే ఇక్కడి నుంచి వెళ్లిపోయినట్టా అని ప్రశ్నించారు. అమరరాజా కంపెనీ రూ. 9,500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టుగా తెలంగాణ ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకుంటే.. ఏపీ నుంచి ఆ కంపెనీని వెళ్లగొట్టే ప్రయత్నం ప్రభుత్వం చేసిందని దుష్ప్రచారం  చేస్తున్నారని మండిపడ్డారు. 

ఏపీలో పెట్టాల్సిన పెట్టబడులు ఇక్కడ పెట్టకుండా తెలంగాణలో పెడుతున్నట్టుగా అమరరాజా కంపెనీ ప్రతినిధులు ఎవరైనా చెప్పారా? అని ప్రశ్నించారు. అమరరాజా గ్రూప్ ఏపీలో మాత్రమే వ్యాపారం చేయాలని.. ఇంకా ఎక్కడ చేయకూడదనే చట్టం ఉందా అని అడిగారు. అమరరాజా గ్రూప్‌కు సంబంధించిన పలు పరిశ్రమలు ఏపీలో నడుస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగితే.. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు ఎలా నడుస్తున్నాయని ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు చెందిన హెరిటెజ్‌ వ్యాపారం ఏపీలోనే ఉందని అన్నారు. హెరిటేజ్ కార్పొరేట్ ఆఫీసు హైదరాబాద్‌లో ఉన్నప్పటికీ.. ఆ కంపెనీ ఏపీలో కూడా కార్యకలాపాలు సాగుతున్నాయని చెప్పారు. చంద్రబాబును ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందా? అని ప్రశ్నించారు. 

click me!