అలా జరక్కుంటే మీ పదవులుండవు... ఆ మంత్రులకు సీఎం వార్నింగ్: దేవినేని ఉమ సంచలనం

By Arun Kumar PFirst Published Feb 7, 2021, 1:15 PM IST
Highlights

సీఎం జగన్ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని రావణకాష్టంగా ఎలామార్చాడో సావధానంగా ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు మాజీ మంత్రి ఉమ పిలుపునిచ్చారు.  

విజయవాడ: తొలివిడత పంచాయతీ ఎన్నికలు 9వతేదీన జరగనున్నందున రాష్ట్రంలోని ఓటర్ మహాశయులంతా 20నెలల జగన్ పాలనలో రాష్ట్రానికి ఏం ఒరిగిందో ఆలోచన చేయాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సూచించారు. అధికారం కోసం చేపట్టిన పాదయాత్రలో అడ్డగోలుగా అసత్యాలు చెప్పిన వ్యక్తి నేడు అధికారంలోకి వచ్చాక ఏవిధంగా ప్రజలను మోసగించాడో, వారిపై వివిధరకాల పన్నులు, ధరల భారం ఎలా మోపారో... రాష్ట్రాన్ని రావణకాష్టంగా ఎలామార్చాడో సావధానంగా ఆలోచించాలన్నారు. వీటన్నింటిని దృష్టిలో వుంచుకుని ఓటు వేయాలని ఉమ పిలుపునిచ్చారు.  

''రేషన్ దుకాణాల్లో ఇచ్చిన కందిపప్పు, పంచదార ధరలు కూడా పెంచిన ఘనత ఈ ప్రభుత్వానిదే. కందిపప్పు కొంటేనే బియ్యం ఇస్తామంటూ ప్రజలను వేధించుకుతింటున్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచడంతో పాటు, పెట్రోల్ డీజిల్ ధరలతో పాటు, ఆస్తిపన్ను, డ్రైనేజ్ పన్ను, రోడ్లసెస్సు అంటూ పిచ్చిపిచ్చి పన్నులన్నీ వేసి ఎలా ప్రజలను దోచుకుంటున్నారో చూస్తున్నాం. ఈవీఎంల పుణ్యమా అని పొరుగురాష్ట్రాలనుంచి రూ.4వేలకోట్ల అవినీతి సొమ్ముతెచ్చి, తనదగ్గరున్న రూ.2500కోట్లను విచ్చలవిడిగా ఖర్చుచేసి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడేమో బ్యాలెట్ పద్ధతిలో ప్రజాస్వామ్యపద్ధతిలో ఎన్నికలు జరుగుతుండటంతో ఈవీఎం పాపాలు బయటపడతాయని, మేజర్ పంచాయతీల్లో ఓటుకు రూ. 3 నుంచి 5వేలు, మైనర్ పంచాయతీల్లో రూ.2వేలచొప్పున పంచుతున్నారు'' ఆరోపించారు. 

''వైసీపీ నేతలు, వాలంటీర్ల ద్వారా విచ్చలవిడిగా ధన ప్రవాహం జరుగుతోంది. పక్కరాష్ట్రాలనుంచి వాటర్ ట్యాంకుల్లో మద్యం సీసాలను తీసుకొచ్చి పంచుతున్నారు. జి.కొండూరు మండలంలో వాటర్ ట్యాంకులో 6వేలమద్యం సీసాలు దొరికితే, మంత్రులు ఒత్తిడిచేసి 192 సీసాలకు కేసునమోదు చేయించారు.  నందిగామ నియోజకవర్గంలో మోటార్ బైకులను తగలబెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. బలవంతపు ఏకగ్రీవాలకోసం ప్రతిపక్షం తరుపున నామినేషన్ వేసినవారిని నానారకాలుగా బెదిరిస్తున్నారు. ఏకగ్రీవాలను గుడ్డిగా ఆమోదించకుండా పరిశీలనచేశాకే ప్రకటించాలని చెబితే, మంత్రినంటూ రాజ్యాంగబద్ధ సంస్థను పట్టుకొని నోటికొచ్చినట్లు మాట్లాడాడు. మంత్రులవ్యాఖ్యలు, వారి అహంకారపూరితచర్యలు ముఖ్యమంత్రి అంతరంగానికి అద్దం పడుతున్నాయి'' అని మండిపడ్డారు. 

''రాష్ట ప్రథమ పౌరుడైన గవర్నర్ ని కలవడానికి వెళ్లిన టీడీపీనేతల నుంచి వినతిపత్రం కూడా తీసుకోవడానికి ఎవరూ రాలేదు. దేశ ప్రథమ పౌరుడు నేడు రాష్ట్రానికి వస్తున్న తరుణంలో రాజ్యాంగవ్యవస్థలపై జరుగుతున్న దాడిపై దృష్టిసారించాలని విజ్ఞప్తిచేస్తున్నాం. మైలవరం నియోజకవర్గంలో మద్యం సీసాలు దొరికితే, వాటిని పంచుతూ పట్టుబడిన వైసీపీనేతలపై ఏం చర్యలు తీసుకున్నారు. ఎవరైనా సరే డబ్బులు, మద్యం పంచుతూ పట్టుబడితే చర్యలు తీసుకుంటామని, విచారణలో వాస్తవాలు తేలితే ఎన్నికలైన తర్వాతకూడా వారికి మూడేళ్లవరకు జైలుశిక్ష వేయిస్తామని జగన్ చెప్పారు. ఇప్పుడు వైసీపీనేతలపై ఏం చర్యలు తీసుకుంటారు'' అని నిలదీశారు. 

read more   వైసిపికి ఎందుకు ఓటెయ్యాలి... ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: కళా వెంకట్రావు

''దాడులుచేసైనా, దౌర్జన్యాలకు తెగబడైనా, ఏంచేసై నా సరే 90శాతం స్థానాలు అధికారపార్టీకి దక్కేలా చేయాలనే ఆదేశాలు తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చాయి. 90శాతం పంచాయతీ స్థానాలు గెలవలేని మంత్రులు నేరుగావెళ్లి రాజ్ భవన్ లో రాజీనామాలు సమర్పించాలనికూడా చెప్పడం జరిగింది. ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇవ్వనని ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి ఆ విధంగా చెప్పబట్టే వారంతా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేందుకు బరితెగించారు. చివరికి బూత్ క్యాప్చరింగ్ చేసైనాసరే పంచాయతీలను గెలవాలని చూస్తున్నారు'' అని అన్నారు. 

''ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశాలు పాటించే అధికారులను తమ ప్రభుత్వం బ్లాక్ లిస్ట్ లో పెడుతుందని, ఏకగ్రీవాల ప్రకటించని అధికారులపై మార్చి31 తర్వాత చర్యలుంటాయని పంచాయతీ రాజ్ శాఖామంత్రి చెప్పాడు. ఆయన తన మాటల్లో ముఖ్యమంత్రి అంతరంగంలోని మాటలను చెప్పకనే చెప్పాడు. మంత్రుల వ్యాఖ్యలు రాజారెడ్డి రాజ్యాంగం  అమలుకు నిదర్శనాలు. రాష్ట్రంలోని ఓటర్ మహాశయులంతా డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడటానికి,  ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ముందుకు రావాల్సిన సమయం వచ్చింది. మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యాన్ని హరించేలా దుర్మార్గంగా, రాష్ట్రంలో సాగుతున్న రాక్షసపాలనను ప్రజలంతా తమ ఓటు అనే ఆయుధంతో అడ్డుకోవాలి'' అని సూచించారు.

''పట్టపగలే విజయవాడలో టీడీపీ నేత పట్టాభిపై దాడి జరిగితే పోలీసులు ఇంతవరకు నిందితులను ఎందుకు పట్టుకోలేకపోయారు? దాడి జరిగిన ప్రాంతంలో నోవాటెల్ హోటల్ ఉంది. అక్కడున్న సీసీ కెమెరాల్లో దాడిచేసినవారి చిత్రాలు నమోదైనా, పోలీసులు ఇంతవరకు అక్కడికెళ్లి విచారణ జరపలేదు.  అచ్చెన్నాయుడుని అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. సింహాన్ని బోనులో పెట్టిన ప్రభుత్వం, అందుకు తగిన మూల్యం చెల్లించుకోబోతోంది. సీడీఫైల్ ని కూడా కోర్టుకి పంపకుండా ఆయన్ని జైల్లోనే ఉంచి, పైశాచిక ఆనందం పొందుతున్నారు. గతంలో 80రోజులుజైల్లో ఉంచారు. ఈవిధంగా ఎన్నిదుర్మార్గాలు చేసినా, ఎన్నిరకాల బెదిరింపులకు దిగినా టీడీపీ కార్యకర్తలు, నేతలు ప్రజాస్వామ్యంకోసం, అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడటంకోసం పని చేస్తున్నారు'' అన్నారు. 

''తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయడం ద్వారా రాష్ట్రంలో అమలవుతున్న  రాజారెడ్డి రాజ్యాంగాన్ని తుద ముట్టించాలని ప్రతిఒక్కరికీ చేతులెత్తి నమస్కరించి చెబుతున్నాను. రాజ్యాంగ వ్యవస్థలను ధిక్కరిస్తూ మాట్లాడిన మంత్రిని తక్షణమే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి. ఎన్నికల కమిషన్ ను, కమిషనర్  ని బెదిరిస్తూ మాట్లాడుతున్న వైసీపీ నేతలపై వెంటనే చర్యలు తీసు కోవాలి'' అని ఉమా డిమాండ్ చేశారు. 


 
  

click me!