వైసిపి పాలన నచ్చలేదని చెబితే వారి పథకాలను పీకేస్తారట... ఓటు హక్కును తీసేస్తామని ప్రజలను వైసిపి నాయకులు బెదిరిస్తున్నారని దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఇబ్రహీంపట్నం : ఏపీ నీడ్స్ జగన్ కాదు ఏపీ హేట్స్ జగన్ అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సరైన వాడే అయితే... ప్రభుత్వమే ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తుంటే కేశినేని ఫౌండేషన్ నిర్వహించే మెడికల్ క్యాంపులకు వేలాది మంది ఎందుకు వస్తారని దేవినేని ఉమ ప్రశ్నించారు. వైసిపి ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం లేదు... అందువల్లే జగన్ ను ద్వేషిస్తున్నారని అన్నారు.
కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన ఉచిత మెగా మెడికల్ క్యాంపును టిడిపి నేత దేవినేని ఉమ, కేశినేని చిన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉమ మాట్లాడుతూ.... ఇవాళ ప్రారంభించిన వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంపై సంచలన వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఏం ఉద్ధరించాడని ఆయన బొమ్మకు స్టాంపు గుద్దాలని అడిగారు. వైసిపి దొంగలు ప్రజలవద్దకు పంపించడం సరే... ప్రభుత్వ ఉద్యోగులను పార్టీ ప్రచారానికి వాడుకోవడం ఏమిటని నిలదీసారు. సచివాలయ ఉద్యోగులు, టీచర్లను వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం కోసం ఉపయోగిస్తూ జగన్మోహన్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడని దేవినేని ఉమ అన్నారు.
ఎన్నికలు దగ్గర పడుతున్నాయి... ప్రస్తుతం ఓటర్ లిస్ట్ ప్రక్రియ కొనసాగుతోంది... ఇలాంటి సమయంలో సచివాలయ ఉద్యోగులను వైసిపి కార్యక్రమాలకు వాడుకుంటున్నారని ఉమ ఆరోపించారు. దీనిపై జిల్లా కలెక్టర్లు, రాష్ట్ర ఎన్నికల అధికారి చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీ కార్యక్రమాలకు ప్రభుత్వ ఉద్యోగులకు ఉపయోగించడంపై ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయనున్నట్లు మాజీ మంత్రి తెలిపారు.
Read More ముఖ్యమంత్రి చేస్తున్నది చాలదా..? వై ఏపీ నీడ్స్ జగన్? : నారా లోకేష్ సీరియస్
వైసిపి పాలన నచ్చలేదని చెబితే వారి పథకాలను పీకేస్తారట... ఓటు హక్కును తీసేస్తామని వైసిపి నాయకులు ప్రజలను బెదిరిస్తున్నారని దేవినేని ఉమ తెలిపారు. ప్రజాధనం జీతంగా తీసుకుంటున్న సచివాలయ ఉద్యోగస్తులు, వాలంటీర్లు వైసిపి కోసం ఎలా పనిచేస్తారని నిలదీసారు. అది అధికారిక కార్యక్రమం కాదు... అధికార పార్టీ కార్యక్రమం మాత్రమే... దాన్ని వైసిపి నాయకులు, కార్యకర్తలతో చేసుకోవాలని టిడిపి నేత దేవినేని ఉమ సూచించారు.