నెలరోజుల్లో 8 నుండి 1097...జగన్ కు ఆ ధైర్యం వుందా?: దేవినేని ఉమ సవాల్

By Arun Kumar PFirst Published Apr 27, 2020, 10:44 AM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం కూడా తాడేపల్లి రాజప్రాసాదంలో వున్న ముఖ్యమంత్రి జగన్ తెలిసి వుండదని మాజీ మంత్రి దేేవినేని ఉమ ఎద్దేవా చేశారు. 

విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా మహమ్మారి రోజురోజుకు మరింత వేగంగా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇలా రాష్ట్రంలో కరోనా కోరలు చాస్తున్నా జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రతిపక్ష టిడిపి ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి, టిడిపి నాయకులు దేవినేని ఉమామహేశ్వర రావు  మరోసారి ముఖ్యమంత్రి జగన్ పై సోషల్ మీడియా  వేదికన విరుచుకుపడ్డారు.      

''నెలరోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8 నుండి 1097 కేసులకు(137రేట్లు) పెరిగిన కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తున్న విషయం మీకు తెలుసా ముఖ్యమంత్రి గారు. తాడేపల్లి రాజప్రసాదం నుండి బయటకు వచ్చి ప్రజల్లోకి వెళ్తే వాస్తవాలు తెలుస్తాయి. మీకు కర్నూలును సందర్శించే ధైర్యం ఉందా వైఎస్ జగన్ గారు'' అంటూ ఉమ సవాల్ విసిరారు.

''కరోనా టెస్ట్ ఫలితాలను ఆలస్యంగా వెల్లడిస్తుండటంతో కేసుల సంఖ్య పెరుగుతోంది. కమ్యూనిటీ ట్రాన్స్ ఫర్ జరుగుతోందని నేను గతంలోనే చెప్పాను. 72 కేసులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియడం లేదు. దీనిని ఏం సమాధానం చెబుతారు?''అని ఇటీవలే జగన్ ప్రభుత్వాన్ని ఉమ ప్రశ్నించారు. 

''కరోనా నిర్మూలనకు సూచనలు చేసిన వారిపైనే  వైసిపి నాయకులు ఎదురుదాడి చేస్తున్నారు. విజయవాడను కర్ఫ్యూ వాతావరణానికి తీసుకువచ్చారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని  ఫ్రంట్ లైన్ వారియర్స్ పనిచేస్తున్నా ప్రభుత్వం మాత్రం లెక్కలేనితనంతో వ్యవహరిస్తోంది. అందువల్ల కేంద్రం ఏపీలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి'' అని ఉమ సూచించారు. 

''విపత్కర పరిస్థితులను చక్కదిద్దాల్సిన సీఎం జగనే వీడియో గేమ్స్ కు పరిమితం అయ్యారు. విజయసాయిరెడ్డి అచ్చోసిన అంబోతులా తిరుగుతున్నారు. విశాఖలో ఛాతి ఆసుపత్రిలో 51 కేసుల వివరాలను ఎందుకు బయట పెట్టడం లేదు. వైసీపీ నేతల ఊరేగింపులతో కరోనా కేసులు పెరుగుతున్నాయి'' అని  ఆయన ఆరోపించారు. 

''ప్రతి పేద కుటుంబానికి రూ.5 వేలు ఇవ్వాలని చెబుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.  చంద్రబాబునాయుడు రాసిన లేఖలకు స్పందన లేదు. ఆరోగ్యసేతు యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని ప్రధాని, చంద్రబాబు చెబుతుంటే జగన్ ప్రజలకు ఎందుకు చెప్పడం లేదు. మీడియా ముందుకు వచ్చే ధైర్యం ఎందుకు చేయడం లేదు? 24 గంటల్లో 61 కేసులు బయటపడితే ఏం సమాధానం చెబుతారు'' అంటూ ఉమ వైసిపి ప్రభుత్వాన్ని నిలదీశారు.

click me!