వైసీపీ సమన్వయకర్తగా నీ దోపిడీలన్నీ తెలుసు.. చర్చకు సిద్ధమా : విజయసాయిరెడ్డికి అయ్యన్న సవాల్

Siva Kodati |  
Published : Sep 14, 2022, 04:40 PM ISTUpdated : Sep 14, 2022, 04:44 PM IST
వైసీపీ సమన్వయకర్తగా నీ దోపిడీలన్నీ తెలుసు.. చర్చకు సిద్ధమా : విజయసాయిరెడ్డికి అయ్యన్న సవాల్

సారాంశం

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై విమర్శలు గుప్పించారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. ఉత్తరాంధ్ర వైసీపీ సమన్వయకర్తగా వున్నప్పుడు విజయసాయిరెడ్డి ఎంత దోచుకున్నారో చర్చించేందుకు తాము సిద్ధమని ఆయన సవాల్ విసిరారు.

వైసీపీ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్‌పై విరుచుకుపడ్డారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హుదుద్ తుఫాను సమయంలో చంద్రబాబు ఎంత కష్టపడ్డారో అందరికీ తెలుసునని అయ్యన్న గుర్తుచేశారు. వైసీపీ నేతలు ఆంధ్రా యూనివర్సిటీని బ్రోతల్ హౌస్‌గా మార్చారని ఆయన మండిపడ్డారు. వైస్ ఛాన్సెలర్‌ కార్యాలయాన్ని వైసీపీ పార్టీ కార్యాలయంగా మార్చేశారని అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్ర వైసీపీ సమన్వయకర్తగా వున్నప్పుడు విజయసాయిరెడ్డి ఎంత దోచుకున్నారో చర్చించేందుకు తాము సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. జగన్ తుగ్లక్ నిర్ణయాలతో రాష్ట్రం దెబ్బతింటోందని.. ఏపీని అప్పుల ఊబిలోకి నెట్టేశారని అయ్యన్నపాత్రుడు దుయ్యబట్టారు. 

కాగా.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రేపటి (సెప్టెంబర్ 15) నుంచి ప్రారంభం కానున్నాయి. ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. రేపు ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాల తొలి రోజే ప్రభుత్వం మూడు రాజధానులపై శాసనసభలో స్వల్పకాలిక చర్చను పెట్టే అవకాశం ఉంది. అధికార వికేంద్రీకరణను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్న ప్రభుత్వం.. ఆ దిశగా అసెంబ్లీ సమావేశాలను వినియోగించుకోవాలని చూస్తోంది. 

మూడు రాజధానులపై సభలో సీఎం జగన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ విధంగా మూడు రాజధానులతో ప్రయోజనాలు ఉన్నాయనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఆలోచనలో జగన్ ఉన్నారు. మరోవైపు ఈ సమావేశాల్లో ప్రభుత్వం.. అధికార వికేంద్రీకరణ, మూడు రాజధానులపై కొత్త బిల్లును ప్రవేశపెట్టనుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేకపోయినప్పటికీ.. ప్రభుత్వం వైపు నుంచి అలాంటి సంకేతాలు వెలువడుతున్నాయి. 

Also REad:రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. తొలి రోజే మూడు రాజధానులపై చర్చ..?

రాజధాని స్థానాన్ని మార్చే శాసనాధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఈ ఏడాది మార్చిలో ఏపీ హైకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అలాగే అమరావతిలో పెండింగ్‌లో ఉన్న అన్ని పనులను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ తర్వాత అసెంబ్లీ.. ఏపీసీఆర్‌డీఏ రద్దు చట్టం- 2020, ఏపీ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి చట్టం- 2020 లను రద్దు చేసింది. 

అయితే జగన్ సర్కార్ మాత్రం మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది.  విశాఖపట్నం (పరిపాలన రాజధాని), అమరావతి (శాసన రాజధాని), కర్నూలు (న్యాయ రాజధాని)..  మూడు రాజధానులకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం జగన్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వం రూ. 1.09 లక్షల కోట్ల భారీ వ్యయంతో 53,000 ఎకరాలను అభివృద్ధి చేయాలనే బృహత్తర ప్రణాళికను రూపొందించిందని.. అయితే ఈ ప్రక్రియ అంతా అవినీతి, బంధుప్రీతితో కూడుకున్నదని జగన్ ఆరోపించారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?