జగన్ కోసం సిబిఐని ఎదిరిస్తారా? మీరు జైలుకెళ్లక తప్పదు: డిజిపికి బుద్దా హెచ్చరిక

By Arun Kumar PFirst Published Jul 7, 2021, 1:45 PM IST
Highlights

 డిజిపి గౌతమ్ సవాంగ్ లోని స్వామిభక్తి పీక్స్ కు వెళ్లినట్లు స్పష్టమవుతోందని టిడిపి నాయకులు బుద్దా వెంకన్న అన్నారు. 
 

విజయవాడ: రాష్ట్రంలోకి సీబీఐవస్తే అడుగుపెట్టనివ్వనని... జగన్మోహన్ రెడ్డిపై ఈగకూడా వాలకుండా చూస్తానంటూ డీజీపీ గౌతమ్ సవాంగ్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న తప్పుబట్టారు. ఆ వ్యాఖ్యలతో డిజిపిలోని స్వామిభక్తి పీక్స్ కు వెళ్లినట్లు స్పష్టమవుతోందని అన్నారు. 

''రాష్ట్రంలో వైసీపీ నాయకులు ఆడిందే ఆట, పాడిందే పాట. తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాల ప్రకారమే డీజీపీ నడుచుకుంటున్నారు. తాడేపల్లి డైరెక్షన్ ... డీజీపీ యాక్షన్ లో  రాష్ట్రంలోని శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. డీజీపీ అనే మాటకు సవాంగ్ గారు కొత్త నిర్వచనం ఇచ్చేలా ప్రవర్తిస్తున్నారు'' అని బుద్దా ఆరోపించారు. 

''ఐఏఎస్ అధికారి గిరిజాశంకర్ కు కోర్టు ఒకరోజు పనిష్మెంట్ వేసింది. అదే గిరిజాశంకర్ చంద్రబాబు నాయుడి హాయాంలో కూడా పనిచేశారు. ఏనాడూ ఎవరితో మాటపడిందిలేదు. డీజీపీఇలాంటివి గుర్తిస్తే మంచిది. రోజులన్నీ ఒకేలా ఉండవని సవాంగ్ గారు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.  చంద్రబాబు నాయుడి హాయాంలో ఏ ఐపీఎస్, ఐఏఎస్ అధికారి అయినా కోర్టులముందు చేతులుకట్టుకున్నారా? డీజీపీ వైసీపీ పక్షానే నిలబడితే, ఆయన కూడా ఏదో ఒకరోజు జైలుకెళ్లక తప్పదు'' అని బుద్దా హెచ్చరించారు. 

''డీజీపీ జగన్మోహన్ రెడ్డికి భజనచేయడం మానేసి రాష్ట్రంలోని శాంతిభద్రతలపై దృష్టిపెట్టాలని కోరుతున్నాం. టీడీపీ నేతలకు అపాయింట్ మెంట్ ఇవ్వడానికి కూడా డీజీపీకి ముఖం చెల్లడంలేదు. వారడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే తన కార్యాలయానికి వచ్చే ప్రతిపక్షనేతలను కలవకుండా తప్పించుకుంటున్నాడు. ఇదే గౌతమ్ సవాంగ్ టీడీపీ ప్రభుత్వంలో విజయవాడ పోలీస్ కమిషనర్ గా పనిచేశారు. అప్పుడు పార్టీలకు, వ్యక్తులకు అతీతంగా చట్టప్రకారం వ్యవహరించి చాలామంచి పేరు తెచ్చుకున్నారు'' అని పేర్కొన్నారు. 

read more  కోర్టు ధిక్కరణ... సుప్రీంకోర్టు మెట్లెక్కాల్సి వస్తుంది జాగ్రత్త: సీఎం జగన్ కు రఘురామ హెచ్చరిక

''గతంలో మాచర్లవెళ్లిన నాపై, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుపై దాడిచేసిన వ్యక్తిపై, అతని అనుచరులపై ఇంతవరకు పోలీసులు ఎందుకు కేసు పెట్టలేదు? మాపై జరిగిన దాడికి సంబంధించి ఆనాడే ఫిర్యాదు చేసినా నిందితులను అరెస్ట్ చేయడానికి పోలీస్ శాఖ ఎందుకు సంకోచిస్తోంది. దాడికి పాల్పడిన వ్యక్తికి అధికార పార్టీ ప్రమోషన్ ఇచ్చింది. అతను ఇప్పుడు అక్కడ మున్సిపల్ ఛైర్మన్ అయ్యాడు.. ఆనాడు ఏదైనా జరగరానిది జరిగి టీడీపీ నేతలమైన తాము చనిపోయినా కూడా ఈ డీజీపీ ఇలానే ప్రవర్తిస్తాడుగా?'' అని నిలదీశారు. 

''ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో మంది డీజీపీలను చూశాం. ఎవరూ ఈయనలా ప్రవర్తించలేదు.  ఖాకీ చొక్కాల వెనుక వైసీపీ చొక్కా వేసుకొని డీజీపీ పనిచేస్తున్నారు. అమరావతి పర్యటనకు వెళ్లిన చంద్రబాబు నాయుడి వాహనంపై రాళ్లు, చెప్పులతో దాడిచేసిన వారిపై ఇంతవరకు కేసులు కట్టలేదు. పైగా ఆనాడు జరిగిన ఘటనను ప్రజాస్వామ్యంలో భాగమంటూ అభివర్ణించడం ద్వారా డీజీపీ తనస్థాయిని తానే దిగజార్చుకున్నాడు'' అని మండిపడ్డారు. 

''రామతీర్థం పర్యటనకు వెళ్లిన చంద్రబాబుని ఏదోరకంగా ప్రజలముందు చులకన చేయాలన్న దురుద్దేశంతో విజయసాయిరెడ్డి, అతని అనుచరులు అక్కడ వీరంగం వేసి ప్రజాగ్రహానికి గురయ్యారు. ఆనాడు వారు చేసినదానికి వారిని వారించకుండా అక్కడలేని టీడీపీ వారిపై అక్రమ కేసులు పెట్టారు. ఇలాంటి అనేక ఘటనలు సవాంగ్ నిర్దేశకత్వంలో జరిగాయని చెప్పడానికి సిగ్గుపడుతున్నాం. పోలీసులు ప్రజలకు రక్షకులా.. వైసీపీకి, ఆపార్టీ నేతలకు రక్షకులా? డీజీపీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సొమ్ముతీసుకుంటున్నాడా...లేక ప్రజలసొమ్ముని జీతంగా తీసుకుంటున్నాడా?'' అని బుద్దా ప్రశ్నించారు. 
 

click me!