
సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హత్యకు కొందరు రెక్కీ నిర్వహించినట్లుగా వార్తలు రావడంతో తెలుగునాట కలకలం రేగిన సంగతి తెలిసిందే. అయితే పవన్ ఇంటి వద్ద జరిగిన గొడవ తాగుబోతులు మద్యం మత్తులో చేసినదేనని పోలీసులు తేల్చారు. అయినప్పటికీ ఈ వ్యవహారానికి చెక్ పడటం లేదు. తాజాగా పవన్ భద్రత విషయంగా టీడీపీ సీనియర్ నేత బొండా ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షాలకు సహకరించిన వారిపై దాడులు, కూల్చివేతలు, అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ప్రతి శుక్రవారం, శనివారం జేసీబీలకు జగన్ రెడ్డి పని కల్పిస్తున్నారని బొండా ఉమా సెటైర్లు వేశారు. అవసరమైతే విపక్ష నేతల ప్రాణాలు తీయడానికి కూడా జగన్ వెనుకాడటం లేదని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ హత్యకు రూ.250 కోట్లతో కుట్ర పన్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రెక్కీ వెనుక తాడేపల్లి ప్యాలెస్ హస్తం వుందని బొండా ఉమా ఆరోపించారు.
Also REad:పవన్ కల్యాణ్ హత్యకు కుట్ర.. అది తాగుబోతుల గొడవే, రెక్కీ కాదు : తేల్చేసిన హైదరాబాద్ పోలీసులు
నిన్న నందిగామలో చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్లదాడి చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని వెనుక స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, వారి ముఖ్య అనుచరులు కుట్రపన్నారని బొండా ఉమా ఆరోపించారు. దుండగులు విసిరిన రాయి చంద్రబాబు సెక్యూరిటీ అధికారి గడ్డానికి తగిలిందని.. అదే కంటిపై తగిలుంటే కన్నుపోయేదని ఆయన తెలిపారు. చంద్రబాబుపై దాడి ఘటనలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను ముద్దాయిలుగా చేర్చాలని బొండా ఉమా డిమాండ్ చేశారు. నిన్నటి చంద్రబాబు పర్యటనలో వారికి అక్కడేం పని అని ఆయన ప్రశ్నించారు.
పిచ్చోడి చేతిలో రాయిలా జగన్ పాలన వుందని... విశాఖలో భూ కుంభకోణంపై ప్రశ్నించినందుకు టీడీపీ నేత అయ్యన్నపాత్రుడిని పోలీసులు అర్థరాత్రి అరెస్ట్ చేశారని బొండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. బాత్రూమ్ అంత గోడ కట్టారని అయ్యన్నపాత్రుడిని అరెస్ట్ చేశారని.. మరి సీఎం మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి వక్ఫ్ భూముల్లో సినిమా హాళ్లు నిర్మిస్తే ఏం చర్యలు తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో రోడ్లపై గుంతలు పూడ్చడానికి తట్ట మట్టి వేయని వాళ్లు .. ఇప్పటంలో రహదారి విస్తరణ అని చెబుతున్నారని బొండా ఉమ దుయ్యబట్టారు. గాంధీ, నెహ్రూ విగ్రహాలను ధ్వంసం చేసి.. వైఎస్ విగ్రహానికి పోలీసుల్ని కాపలా పెట్టారని ఎద్దేవా చేశారు.