ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షాల ఓట్లన్నీ తొలగించే కుట్ర జరుగుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షాల ఓట్లన్నీ తొలగించే కుట్ర జరుగుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. మ్యానిపులేషనుతోనే ఎన్నికల్లో గెలవాలని జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఏపీలో ఓట్ల దొంగలు పడ్డారని అన్నారు. ఏపీలో ఓటర్ల జాబితాకు సంబంధించి రాష్ట్ర ప్రధాన ఎన్నిలక అధికారి ముఖేష్ కుమార్ మీనాకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ముఖేష్ కుమార్ మీనాను కలిసిన వారిలో అచ్చెన్నాయుడుతో పాటు పలువురు టీడీపీ నాయకులు ఉన్నారు. అనంతరం అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఏపీలో ప్రతిపక్ష పార్టీ సానుభూతి పరుల ఓట్లను తొలగించడం, చీల్చడం కోసం జగన్ ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారు.
వలంటీర్ వ్యవస్థ ద్వారా ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఏపీలోని ఓటర్ జాబితాలో అవకతవకలపై సీఈసీకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫిర్యాదు చేశారని అన్నారు. పర్చూరు, తిరుపతిలో ఓట్ల అవకతవకలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినా విచారణ ముందుకు సాగడం లేదని చెప్పారు. టీడీపీ నేత పయ్యావుల కేశవ్ కంప్లైట్ మీద మరింత దర్యాప్తు జరగాల్సి ఉందని అన్నారు. వలంటీర్లు ఫామ్-6,7 పేర్లతో నిబంధనలకు విరుద్దంగా అప్లై చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల నిబంధనలకు విరుద్దంగా 57 మంది ఒక్కొక్కరూ వేయి అప్లికేషన్లు పెట్టారని అన్నారు. నిబంధనలకు విరుద్దంగా ఫాం-7 అప్లికేషన్లు దాఖలు చేసిన వారి వివరాలను అధికారులకు జిల్లాల వారీగా ఇచ్చామని తెలిపారు.
ఏపీలో జరుగుతున్న పరిణామాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడానికే అమిత్ షాను లోకేష్ కలిశారని అచ్చెన్నాయుడు చెప్పారు. ఏపీలో జరుగుతోన్న పరిణామాలను తనకు తెలుసని అమిత్ షా అన్నారని తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక తమ ప్రమేయం లేదని అమిత్ షా స్పష్టం చేసినట్టుగా చెప్పారు. లోకేష్, పురంధేశ్వరి, కిషన్ రెడ్డిలు కలిసి వెళ్లి అమిత్ షాని కలవలేదని అన్నారు. లోకేష్ వెళ్లేసరికే పురందేశ్వరి, కిషన్ రెడ్డిలు అక్కడ ఉన్నారని చెప్పారు. అమిత్ షాతో లోకేష్ భేటీ వెనుక ఎలాంటి ప్రణాళిక లేదని తెలిపారు.
విశాఖకు తరలింపు అనే జీవో ఇస్తే ప్రజలంతా నవ్వుకుంటున్నారని అచ్చెన్నాయుడు అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలంటే ఏం తెలియదని వైసీపీ నేతలు అనుకుంటున్నారని మండిపడ్డారు. భూములను లాక్కోవడానికే జగన్ విశాఖ వస్తున్నారని అక్కడి ప్రజలకు తెలుసునని అన్నారు. ఉత్తరాంధ్రలో వలసలు ఆపడానికి జగనేం చేశారని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రలో ఒక్క ప్రాజెక్టుకైనా బడ్జెట్ కేటాయింపులు జరిపారా? అని అడిగారు. రుషికొండ మీద ఓ ఇల్లు కట్టుకున్నారని విమర్శించారు. జగన్‌కు ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఇళ్లు ఉన్నాయని అన్నారు. చిన్నగా ఉండే ఈ మనిషికి ఇన్ని ఇళ్లు ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
చంద్రబాబుపై పెట్టిన కేసుల్లో ఒక్క ఆధారాన్ని కూడా బయట పెట్టలేదని అచ్చెన్నాయుడు అన్నారు. జగన్ అరెస్ట్ అయితే వారి కుటుంబ సభ్యులే బయటకు వచ్చారని.. చంద్రబాబును అరెస్ట్ చేస్తే ప్రజలు రోడ్లెక్కారని అన్నారు. చంద్రబాబు అరెస్టుతో రాజకీయ లబ్ది పొందాలనుకున్న జగన్ వ్యూహం బూం రాంగ్ అయిందని విమర్శించారు. చంద్రబాబు అరెస్ట్ తనకు తెలియదని జగన్ దద్దమ్మ మాటలు మాట్లాడారని మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టుతో తనకు సంబంధం లేదని.. కేంద్రమే అరెస్ట్ చేయించిందనే రీతిలో జగన్ మాట్లాడారని అన్నారు.