కన్నా లక్ష్మీనారాయణ‌తో టీడీపీ నేత ఆలపాటి భేటీ..

Published : Feb 20, 2023, 03:18 PM IST
కన్నా లక్ష్మీనారాయణ‌తో టీడీపీ నేత ఆలపాటి భేటీ..

సారాంశం

మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణతో టీడీపీ సీనియర్ ఆలపాటి రాజేంద్రప్రసాద్ భేటీ అయ్యారు. 

మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణతో టీడీపీ సీనియర్ ఆలపాటి రాజేంద్రప్రసాద్ భేటీ అయ్యారు. ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన కన్నా లక్ష్మీనారాయణ.. టీడీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే కన్నాతో ఆలపాటి రాజేంద్రప్రసాద్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇది మర్యాదపూర్వక  భేటీ మాత్రమేనని.. కన్నా టీడీపీలోని వస్తున్న నేపథ్యంలోనే ఆలపాటి ఆయనను కలిశారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ నెల 23న కన్నా లక్ష్మీనారాయణ  ఆ పార్టీలో చేరే అవకాశం ఉంది.

ఇక, సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్‌లో కొనసాగిన కన్నా లక్ష్మీనారాయణ.. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఏపీలో కోట్ల విజయభాస్కర రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి,  వైఎస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు. కాపు సామాజిక వర్గంలో కీలక నేతగా ఉన్నారు. అయితే ఏపీ పునర్విభజన తర్వాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో.. 2014లో కన్నా లక్ష్మీ నారాయణ కాషాయ కండువా కప్పుకున్నారు. అయితే రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి బాగోలేదనే ఆలోచనతో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ.. 2019 ఎన్నికలకు ముందే పార్టీ మారతారనే ప్రచారం సాగింది. టీడీపీ, వైసీపీలు కన్నాతో చర్చలు జరిపాయనే వార్తలు కూడా వచ్చాయి. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ కూడా కన్నాను పార్టీలోకి చేర్చుకునేందుకు ఆసక్తికనబరిచడంతో.. ఆయన కూడా వైసీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. 

అయితే ఆ తర్వాత పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. బీజేపీ అధినాయకత్వం కన్నా లక్ష్మీనారాయణతో సంప్రదింపులు జరిపారు. 2018 మే నెలలో కన్నా లక్ష్మీనారాయణను ఏపీ బీజేపీ చీఫ్‌గా నియమించారు. ఈ క్రమంలోనే 2019 అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ కన్నా నేతృత్వంలోనే వెళ్లింది. ఆ ఎన్నికల్లో బీజేపీకి చేదు ఫలితమే మిగిలింది. ఇక, రాష్ట్ర బీజేపీ చీఫ్‌గా రెండేళ్ల పదవీకాలం పూర్తికాగానే.. కన్నాను ఆ పదవి నుంచి బీజేపీ అధిష్టానం తప్పించింది. ఆ స్థానంలో సోము వీర్రాజును నియమించింది. 

ఆ తర్వాత కన్నా లక్ష్మీనారాయణను జాతీయ కార్యవర్గంలోకి తీసుకున్నప్పటికీ.. రాష్ట్ర పార్టీలో తనకు సరైన గుర్తింపు దక్కడం లేదనే అభిప్రాయంతో ఆయన ఉన్నారు. ఈ క్రమంలోనే గత కొంతకాలంగా ఆయన పార్టీ కార్యాక్రమాలకు కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ నాయకత్వం, పనితీరుపై ఆయన చాలాసార్లు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికార వైసీపీపై సోము వీర్రాజు మెతకగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయాలంటే అధికార పార్టీపై పోరాటం చేయాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తూ వచ్చారు. సోము వీర్రాజు, ఎంపీ జీవీఎల్ నరసింహారావులు అధికార వైసీపీపై కాకుండా ప్రతిపక్ష టీడీపీపై విమర్శలు గుప్పించడాన్ని కూడా ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu: అధికారులకు చంద్రబాబు హెచ్చరిక | Asianet News Telugu
CM Chandrababu Naidu: చరిత్రలో నిలిచిపోయే రోజు సీఎం చంద్రబాబు| Asianet News Telugu