జగన్ తో రమణదీక్షితులు భేటీ: తెలుగుదేశంలో ప్రకంపనలు

First Published Jun 8, 2018, 7:59 AM IST
Highlights

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తిరుమల మాజీ ప్రధానార్చకుడు రమణదీక్షితులు భేటీ కావడం తెలుగుదేశంలో ప్రకంపనలు సృష్టించింది.

హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తిరుమల మాజీ ప్రధానార్చకుడు రమణదీక్షితులు భేటీ కావడం తెలుగుదేశంలో ప్రకంపనలు సృష్టించింది. జగన్ ను తాను కలవడానికి కారణం చెబుతూ - తన పొట్ట నింపేవారిని ఎవరినైనా తను కలుస్తానని రమణదీక్షితులు చెప్పారు.

అంతేకాకుండా, ముఖ్యమంత్రి చంద్రబాబును చాలా సార్లు కలవడానికి ప్రయత్నించానని, తనకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదని కూడా ఆయన చెప్పారు. జగన్ ను ఆయన గురువారం హైదరాబాదులోని లోటస్ పాండ్ లో కలిశారు.  టీటీడీపై రమణదీక్షితులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో జగన్ తో ఆయన భేటీకి ప్రాధాన్యం చేకూరింది. ఈ భేటీపై తెలుగుదేశం పార్టీ నాయకులు మూకుమ్మడిగా విమర్శల దాడి ప్రారంభించారు.

రమణదీక్షితులుతో జగన్ జరిపిన చర్చల వివరాలు మాత్రం బయటకు రావడం లేదు.  దాదాపు 24 ఏళ్ల పాటు రమణదీక్షితులు తిరుమలలో ప్రధానార్చకుడిగా పనిచేశారు. ఒక్కసారిగా ఆయనను ప్రభుత్వం తొలగించింది. అప్పటి నుంచి ఆయన టీటీడీ వ్యవహారాలపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు.  

శ్రీవారికి చెందిన ఓ వజ్రం మాయమైందని, తిరుమలలో అక్రమంగా తవ్వకాలు జరిగాయని దీక్షితులు ఆరోపించారు. దీంతో ఆలయ ప్రతిష్టను దిగజార్చుతున్నందుకు దీక్షితులుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది.
 
రమణదీక్షితులు ఇది వరకే బిజెపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాతో భేటీ అయ్యారు. కర్ణాటక ఎన్నికల ప్రచారం ముగించుకుని తిరుమల వచ్చిన అమిత్ షాను ఆయన కలిశారు. అప్పటి నుంచి రమణదీక్షితులు టీటీడీ వ్యవహారాలపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.

ఈ నేపథ్యంలో బహిరంగంగా  జగన్‌తో దీక్షితుల భేటీ కావటం తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే ఈ భేటీకి ప్రత్యేకత ఏమీ లేదని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు అంటున్నారు. తన పోరాటానికి జగన్ మద్దతు కోరేందుకు వచ్చారని చెబుతున్నారు.

click me!