
ఇటీవల ముగ్గురు యువనేతలూ విద్యార్ధులతో ముఖాముఖి సమావేశాలకు ప్రధాన్యత ఇస్తున్నారు. అయితే, ఇటువంటి సమావేశాల్లో ఓ వెసులుబాటు ఉంటుంది. అదేంటంటే, ప్రతిపక్ష నేతలను అధికార పార్టీ విమర్శలు చేయించాలన్నా లేదా విపక్షాలే ముఖ్యమంత్రిని విమర్శలు చేయించాలన్నా విద్యార్ధుల ద్వారానే చేయించవచ్చు.
ఇటువంటి కార్యక్రమాలవైపే ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు కుమారుడు లోకేష్, జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కల్యాణ్ మొగ్గు చూపుతున్నారు. అయితే, ఇందులో జగన్, పవన్ విజయం సాధిస్తుంటే, లోకేష్ మాత్రం విఫలమవుతున్నారు.
పై ముగ్గురు చేస్తున్నదీ ఒకే విధమైన కార్యక్రమాలు. అందులో ఇద్దరు విజయం సాధిస్తుంటే మరొకరు ఎందుకు విఫలమవుతున్నారు? అంటే అక్కడే తేడా ఉంది. విద్యార్ధులతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిచేటపుడు ప్రశ్నలు వేసే విద్యార్ధులను ఎంపిక చేయటమే చాలా కీలకం. ఎవరి కార్యక్రమమైనా ప్రశ్నలు వేసే విద్యార్ధులను ముందుగానే ఎంపిక చేయటం సహజం.
ఇక్కడే టిడిపి విఫలమవుతోంది. పార్టీ విఫలమవుతోంది కాబట్టే లోకేష్ తరచూ అభాసుపాలవుతున్నారు. తాజాగా జగన్ ఆధ్వర్యంలో విజయనగరంలో జరిగిన యువభేరి కార్యక్రమాన్నే తీసుకుందాం. అందులో పాల్గొన్న విద్యార్ధులందరూ చంద్రబాబును, కేంద్రప్రభుత్వాన్ని విమర్శిస్తూ మాట్లాడిన వారే. చంద్రబాబు, కేంద్రంపై విమర్శలు గుప్పిస్తూనే జగన్ ను కాబోయే సిఎంగా కీర్తించటం గమనార్హం.
జగన్ ను ఇబ్బంది పెట్టదలచకుంటే, విద్యార్ధులకు ప్రశ్నలే కరువా? అక్కడ పాల్గొన్న విద్యార్ధులందరూ వైసీపీ మద్దతుదారులేనా లేక జగన్ అభిమానులేనా? వందల మంది పాల్గొన్న విద్యార్ధుల్లో అలా ఉండరు కదా? మరి, ఏ విద్యార్ధి కూడా జగన్ ఇబ్బంది పట్టే ప్రశ్నలు ఎందుకు వేయలేదు? అక్కడే, వైసీపీ నేతల స్టేజ్ మేనేజ్ మెంట్ సామర్ధ్యం కనబడుతోంది.
అదేవిధంగా ఇటీవల అనంతపురం జిల్లా గుత్తిలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో పవన్ పాల్గొన్న కార్యక్రమంలో కూడా విద్యార్ధులు చంద్రబాబును విమర్శిస్తూనే మాట్లాడారు. పవన్ ను విభేదించే విద్యార్ధులుండరా? విమర్శించటానికి పవన్ లో లోపాలు లేవా ? అక్కడ కూడా స్టేజ్ మేనేజ్ మెంట్ స్పష్టం.
మరి ఈ విషయాలేవి టిడిపికి తెలీదనుకోవాలా? లేక లోకేష్ కార్యక్రమాలను టిడిపి నేతలు లైట్ తీసుకుంటున్నారా? ఏదేమైనా స్టేజ్ షోలలో టిడిపి విఫలమవుతుండటం లోకేష్ కు పెద్ద మైనస్సే. ఎవరికైనా డౌటా?