విద్యాశాఖ బొత్సకు ఇష్టంలేదు... అసంతృప్తితోనే...: టెన్త్ పేపర్ లీకేజీపై జలీల్ ఖాన్ సంచలనం

Arun Kumar P   | Asianet News
Published : May 11, 2022, 05:24 PM IST
విద్యాశాఖ బొత్సకు ఇష్టంలేదు... అసంతృప్తితోనే...: టెన్త్ పేపర్ లీకేజీపై జలీల్ ఖాన్ సంచలనం

సారాంశం

ఏపీలో పదో తరగతి పరీక్షా ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేయడంపై స్పందిస్తూ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ విద్యాశాఖ మంత్రి బొత్సపై సంచలన వ్యాఖ్యలు చేసారు. 

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ అంశం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. నారాయణ విద్యాసంస్థలు ప్రశ్నపత్నాల లీకేజీకి పాల్పడ్డాయన్న అభియోగాలతో మాజీ మంత్రి నారాయణను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ అంశం పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. నారాయణ అరెస్ట్ ను అధికార వైసిపి సమర్ధిస్తుంటే ప్రతిపక్ష టిడిపి మాత్రం పరీక్షల నిర్వహణ చేతగాక వైసిపి ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులపై కుట్రలు పన్నుతోందని ఆరోపిస్తున్నారు. తాజాగా నారాయణ అరెస్ట్ పై స్పందిస్తూ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. 

గతంలో అనేక కీలక శాఖల మంత్రిత్వ బాధ్యతలు చేపట్టిన బొత్స సత్యనారాయణకు విద్యాశాఖను తీసుకోవడం ఏమాత్రం ఇష్టం లేదని జలీల్ ఖాన్ అన్నారు. ఇటీవల విద్యాశాఖ మంత్రిగా ప్రమాణంచేసేనాడే ఆయన ముఖం మాడ్చుకున్నాడని అన్నారు. ఎలాంటి ఆదాయంలేని శాఖ తనకెందుకన్న అసంతృప్తితో బొత్స ఉన్నాడని మాజీ ఎమ్మెల్యే  పేర్కొన్నారు.  

''విద్యార్థులకు నాణ్యమైన, ఉన్నత విద్యాభ్యాసం అందించలేనని సీఎం జగన్మోహన్ రెడ్డికి అర్థమైంది. నిరుద్యోగులు, యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించలేనని తెలిసిపోయింది. అందువల్లే తన అసమర్థత, చేతగానితనం యువత, విద్యార్థులు పసిగట్టకూడదన్న ఒకేఒక్క లక్ష్యంతోనే ప్రతిష్టాత్మక నారాయణ విద్యాసంస్థలను టార్గెట్ చేశాడు, ఈ క్రమంలోనే జరగని పేపర్ లీకేజ్ ఘటనకు నిందితుడిని చేస్తూ మాజీమంత్రి నారాయణను అరెస్ట్ చేశారు'' అని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. 

''నిన్నమొన్నటి వరకు మంత్రి బొత్స సహా వైసీపీలోని పనికిమాలిన వాళ్లంతా పదోతరగతి పరీక్షపత్రాలు లీక్ కాలేదని దబాయించారు. ఇప్పుడేమో నారాయణే చేశాడు... ఆయనకు చెందిన నారాయణ విద్యాసంస్థల్లోని విద్యార్థులకోసం చేయించాడని సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. పేపర్ లీక్ ఘటనలకు సంబంధించి తిరుపతి పబ్లిక్ మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పాడో, దాన్నే యధావిదిగా చిత్తూరు ఎస్పీ వల్లెవేశాడు. నారాయణ విద్యాసంస్థల్లో పేపర్ లీకేజ్ అనేది ఎప్పట్నుంచో జరుగుతుందని కూడా ఎస్పీ మాట్లాడాడు. రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా జరిగితే అప్పుడు ఆయనేం చేశాడు?'' అని ప్రశ్నించారు.

''నారాయణ, చైతన్య విద్యాసంస్థల్ని వాటి విద్యా విలువల్ని చూసి జగన్మోహన్ రెడ్డి ఓర్వలేకపోతున్నాడు. ఎవరైనా బాగుపడితే జగన్ రెడ్డికి నిద్రపట్టదు. అందుకే ఇప్పుడు నారాయణ విద్యాసంస్థలకు తాళాలేసి, లక్షలాది మంది విద్యార్థుల్ని రోడ్డునపడేయాలని చూశాడు. నారాయణ, చైతన్యలాంటి విద్యాసంస్థలు ఆవిర్భవించాకే తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఉన్నత చదువుల్లో అగ్రస్థానంలో నిలిచారు. నారాయణను అరెస్ట్ చేశామని చంకలుగుద్దుకున్న ముఖ్యమంత్రి, మంత్రి బొత్స, ప్రభుత్వం చివరకు ఏం సాధించింది? నారాయణను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచాక ఎలాంటి ఆధారాలు చూపించలేక  ఈ ప్రభుత్వంలోని అధికారులు ముఖాలు వేలాడేశారు'' అని జలీల్ ఖాన్ ఎద్దేవా చేసారు.  
  
''బాదుడేబాదుడు పేరుతో చంద్రబాబు జనంలోకి వెళ్తుండటంతో జగన్మోహన్ రెడ్డికి వణుకు మొదలైంది. దాన్ని కప్పిపుచ్చి, కవర్ చేసుకోవడానికే నారాయణను అరెస్ట్ చేయించాడు. పొత్తులపై మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి, ఆయన చెంచాలంతా సింగిల్ గా రావాలని చంద్రబాబుని అంటున్నారు. మీరు చేతగానివారు కాబట్టే పీకే (ప్రశాంత్ కిషోర్ ) ని తోడుచేసుకొని ఆయన రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రకారం కులాలు, మతాల మధ్యన చిచ్చుపెట్టి అధికారంలోకి వచ్చారు'' అని అన్నారు. 

''అధికారంలోకి రాకముందు వైసీపీవారు, ఇప్పుడున్న మంత్రులంతా గెడ్డాలు పెంచుకొని రోడ్లపై తిరిగేవారు. ఇప్పుడేమో ఒక్కొక్కడు ఒక్కో మినీఅంబానీలా కాలర్ ఎగరేస్తూ తిరుగు తున్నారు. చంద్రబాబు  పాలనకు, జగన్మోహన్ రెడ్డి పాలనకు ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడాఉంది. రాష్ట్రం బాగుపడాలని, ప్రజలంతా సంతోషంగా ఉండాలని, తెలుగుజాతి ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా ఎగబాకాలన్నదే చంద్రబాబు తపన. పొద్దున్నలేస్తే చంద్రబాబు పేరు చెప్పకుండా ఈముఖ్యమంత్రి బతకలేకపోతున్నాడు. రాష్ట్రంలో అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే తెలుగుదేశం వారే చేయిస్తున్నారంటారా? అన్నీ తెలుగుదేశం, చంద్రబాబు చేస్తుంటే అధికారంలో ఉండి మీరు గాడిదలు కాస్తున్నారా? సొంత బాబాయ్ ని చంపినవారిని పట్టుకోలేని ముఖ్యమంత్రి...పోలీస్ వ్యవస్థను తన రాజకీయ స్వార్థానికి వాడుకొని సర్వనాశనం చేసి, రాష్ట్రాన్ని, ప్రజల్ని వారిఖర్మకు వారిని వదిలేశాడు'' అని జలీల్ ఖాన్ మండిపడ్డారు. 

''జగన్మోహన్ రెడ్డి తనచర్యలతో, అతితెలివితేటలు చూపిస్తూ తనగొయ్యి తానే తీసుకుంటున్నా డు. అధికారమనే గొడ్డలి చేతికి అందిందని దానితో తనను తానే నరుక్కుంటున్నాడు. ఆయనకి దమ్ము, ధైర్యముంటే చంద్రబాబుని అరెస్ట్ చేయించాలి. గడపగడపకు అంటూ జనంలోకి వెళ్లి, వైసీపీవారు ఏం చెబుతారు? పిచ్చి మద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తున్నామని, ఇసుక ధరలు పెంచామని, మట్టి, నీళ్లు, సిమెంట్ అన్నీ అమ్ముకున్నామని చెబుతారా? అవినీతిపరుడి పాలనలో పారదర్శకపాలన జరుగుతుందంటే ప్రజలు నమ్ముతారా?'' అని మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Nimmala Ramanaidu Highlights Rayalaseema Irrigation Projects & Water Disputes | Asianet News Telugu
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం పొంచివుందా..? ఈ ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు