
రాజధాని భూముల సమీకరణ, ప్లాట్ల కేటాయింపు విషయంలో టిడిపి చేతివాటాన్ని టిడిపి వ్యతిరేక మీడియా ఉతికి ఆరేస్తోంది. తాజాగా రాజధానిలో పచ్చనేతలు ఆన్ లైన్ పేరుతో జరిపిన మోసమంటూ ఓ కథనాన్ని ప్రచురించటం ఆశక్తిగా మారింది. అమరావతి పరిధిలో ముఖ్యమైన వాణిజ్య, నివాస ప్లాట్లన్నీ ముందుగానే ‘బుక్’ చేసేసుకున్నారట. రహదారుల పక్కన, పార్కుల చుట్టూ, కార్నర్ బిట్లు, వాణిజ్య సముదాయాలకు పక్కనే ఇలా ఎక్కడైతే బాగా డిమాండ్ ఉంటుందనుకున్నారో అటువంటి చోట్లంతా అడ్డదారిలో ముందే సొంతం చేసుకున్నారనేది కథనం సారాంసం.
తమకు కావాల్సిన చోట్ల ముందే బుక్ చేసేసుకుని తర్వాత మిగిలిన ప్లాట్లనే ఆన్ లైన్లో పెట్టి రైతులకు అంటగడుతున్నారన్నది ప్రధాన ఆరోపణ. అంటే, రాధాధాని కోసం భూములను వదులుకున్న రైతుల నోట మట్టి కొట్టి ఎటువంటి సంబంధం లేని అధికార పార్టీ ముఖ్యులకు మాత్రం కోట్లు విలువ చేయబోయే ఆస్తులన్నమాట. ముందే తీసేసుకున్న ప్లాట్ల లబ్దిదారుల్లో మంత్రి నారాయణ, ఎంఎల్ఏ, ఎంఎల్సీలు పయ్యావుల కేశవ్, దూళిపాళ నరేంద్ర, స్పీకర్ కోడెల శివప్రసాదరావు, గుంటూరు జిల్లా అధ్యక్షుడు, వినుకొండ ఎంఎల్ఏ జీవి ఆంజనేయులు, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాధరెడ్డి, స్పీకర్ పిఏ గుప్తా తదితరుల పేర్లతో ఖరీదైన ప్లాట్లు బుక్ అయిపోయాయట. ఇప్పటికి బయటపడిన పేర్లివే. ఇంకా ఎందరున్నారో చూడాలి. రైతుల పేర్లతో ఇప్పటికే ఎకరాలకు ఎకరాలు టిడిపి నేతలు సొంతం చేసేసుకున్నారంటూ విపరీతమైన ఆరోపణలున్నాయి. దానికి తాజా ఆరోపణలు బోనస్ అన్నమాట.
అధికారంలోకి వచ్చింది మొదలు టిడిపి తన ఇష్టారాజ్యంగా సాగిస్తోంది పాలన. చట్టం, న్యాయం అంటూ ఏమీ లేవన్నట్లే వ్యవహరిస్తోంది అధికార పార్టీ. తమ్ముళ్ల వ్యవహారాలన్నీ తెలిసీ చంద్రబాబు మౌనం వహిస్తున్నారంటే వారి ఆటలకు సిఎం అంగీకారం ఉందనే అనుమానించాల్సి వస్తోంది. సరిగ్గా అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యే రోజే మీడియాలో కథనాలు రావటంతో సభలో వైసీపీ సైకిల్ గాలి తీసేస్తుంది. అంటే, టిడిపిని ఇరుకున పెట్టేందుకు వైసీపీకి కావాల్సినన్ని అశ్త్రాలు సిద్ధం చేసుకున్నట్లే కనబడుతోంది.